భాష నిఘంటువులు సాంబనిఘంటువు (ఆంధ్రనామనిఘంటువు)
మానవవర్గు
క. శ్రీనగజామానసలస
మానసరోహంస నిరుప-మానవిభవ ధా
మా నవముగ నీపేరిట
మానవవర్గువి రచింతు - మానక సాంబా.
1
సీ. తొలిచదువులు ప్రాఁత-పలుకులు
ప్రామినుకులు తొంటి-బాస లనఁగ
వేదాఖ్య లగు నేల-వేల్పులు తొలిజాతి
వారు మిన్కులచదు-వరులు జన్ని
గట్టులు దుగపుట్టు-కలు పార్లు బాఁపలు
నాఁగ బ్రాహ్మణులకు - నామము లగు
ఱేలు దొరలు నేల-యేలుదంటలు వెన్ను
వలబుజమునఁ గల-వారు రాచ
 
తే. వారు ఱేఁడులు రెండవ - వంగడంపుఁ
బబువు లన క్షత్రియాఖ్య లౌ - బచ్చు బేరి
మూడవకొలం బతఁడు నాఁడె-కాఁడు నల్ల
నయ్యతొడబిడ్డ కోమటి - నాఁ దనర్చు
వైశ్యనామంబు లద్రిని-వాస సాంబ.
2
సీ. కలపతాల్పులు తుది-కొలము నేర్పరులు కాఁ
పులు వినువాఁకతో-బుట్టువు లన
నలరును శూద్రాఖ్య - లమ్మ కన్నది తల్లి
యవ్వ నా మాతపే - ళ్లమరుఁ దండ్రి
యబ్బ కన్నయ్య నా-యన యయ్య య ప్పన
జనకాఖ్య లగుఁ దమ్ముఁ - డనుఁగు తోడు
తోడఁబుట్టు వనంగఁ - దోఁబుట్టు వన సోద
రాఖ్య లౌ మొదటివాఁ-డన్న పెద్ద
 
తే. యనఁగ నగ్రజుఁ డగు నక్క - యప్ప యనఁగ
జ్యేష్ఠకన్యకుఁ జెల్లెలు - చెల్లె చెలియ
లనఁగ దనఁరు గనిష్ఠ కి-ల్లాలు రాణి
యాలు పెండ్లా మనఁగ భార్య - కగును సాంబ.
3
సీ. అయిదువరాలు ము-త్తైదు వనఁ బురంధ్రి
కగుఁ దోడికోడ లే-రా లనంగఁ
బతిసోదరునిభార్య - పరఁగుఁ గూఁతురుకూఁతు
కొమరిత యనఁ బుత్రి-కమరుచుండుఁ
గొమరుండు బుడుతఁడు - కొడుకు పట్టి యనంగఁ
బుత్రుఁ డౌ బిడ బిడ్డ-పూప పాప
కుఱ్ఱ చిఱుత కందు - కూన నిసువు పాల
బుడుత నా శిశునామ-ములు దనర్చు
 
తే. గోల ముద్దియ ముద్దరాల్‌ - బేల ముగుద
యనఁగ ముగ్ధాంగనకు నాఖ్య - లగును ముదిమి
వాఁడు ముదుకఁడు ముదిసిన-వాఁడు ముసలి
ముదుసలి యనంగ వృద్ధు పే-ళ్లొదవు సాంబ.
4
సీ. పిన్న కొండికవాఁడు - చిన్నపడుచు చోఱ
పసివాఁ డనెడిపేళ్లు - బాలున కగుఁ
జతురుపే ళ్లగు దిట్ట - జాణ దింట వలంతి
వెరవరి ప్రోడ నే-ర్పరి యనంగఁ
జెలికాఁడు సంగాతి - చెలిమరి గాదిలి
సకియ సంగడికాఁడు - సంగడీఁడు
చెలినేస్తి యనఁ జను - స్నేహితునకుఁ జెల్మి
నంటు మాలిమి పొం ద-నంగ మైత్రి
 
తే. కొఱలుఁ గుఱుచ టింగణ గిడ్డ - గిఱక గుజ్జు
పొట్టి యన వామనాఖ్య లౌ - గట్టివాయి
ఱాఁగ జంత గయాళియు - నాఁగఁ దనరు
ధూర్తవనితకు దురితవి-దూర సాంబ.
5
సీ. కబ్బపుసేఁతరి - కయి కైసరుఁడు మాట
లల్లువాఁ డనుపేళ్లు - చెల్లుఁ గవికి
బట్టులు చదువరుల్‌ - బట్టు క్రిక్క లనంగ
వందులు కగుఁ బడ-వాళ్లు వేగు
వారు వేగరు లనఁ - జారులపే ళ్లొప్పు
బోయీలు బెస్తలు - మోపరు లన
వాహకులకుఁ జెల్లు - సాహిణి సాని రౌ
తనఁగ నశ్వారోహ-కునకుఁ దనరుఁ
 
తే. గట్టికలు పణిహారులు - కటిక లనఁగ
వేత్రపాణుల కగు బోయ - వేఁటకాఁడు
నడవిద్రిమ్మరి యనఁ గిరా - తాఖ్య లెసఁగు
నన్నగళ పేడి యన షండుఁ - డగును సాంబ.
6
సీ. జాలరి వలఱేఁడు - మీలపేఁటరి యనఁ
దగు ధీవరునిపేళ్లు - తడుపుదాల్పు
వడు గొంటిజందెము-వాఁడు బమ్మాచారి
యన బ్రహ్మచారిపే - ళ్లమరు గేస్తు
మనికిఱేఁ డింటివాఁ - డన గృహస్థున కగు
నడవికాఁపు తపసి - జడలదారి
నాఁ జెలువొందు వా-నప్రస్థునకు నొంటి
కాఁడు గోణముదారి - బోడ బీద
 
తే. కావులుగలాఁడు సన్నాసి - నా వెలుంగు
యతిసమాఖ్యలు ముగితిము-త్తైదు వనఁగ
జక్కి ననఁ బేరఁటా లన - బరగు మృతచి
రంటినామంబు లాపన్న-రక్ష సాంబ.
7
సీ. మూకాఖ్య లగు మూవ - మూఁగ మూఁగి యనంగ
గ్రుడ్డి చీ కన నంధ-కునకుఁ జెల్లుఁ
బరువము ప్రాయము - వయసు జవ్వన మన
యౌవనాభిఖ్య లౌ - నందగాఁడు
వగకాఁ డమరువాఁడు - వన్నెకాఁ డెమ్మెకాఁ
డౌసుకాఁ డన సొగ-సైనవాఁడు
నీటుకాఁ డనగ రా-ణించు శృంగారికి
గోవాళ్లు బొజుఁగు నాఁ - గోడెకాఁడు
 
తే. వెచ్చకాఁడు ననువుకాఁడు - వేడ్కకాఁడు
లంజెకాఁడు మిండఁ డనఁ బ-ల్లవుఁడు దనరు
సోయగంబు చక్కఁదనంబు - సొబగు రూపు
నాఁగ సౌందర్యమునకుఁ - జెన్నగును సాంబ.
8
సీ. గట్టిమనసువాఁడు - గడుసరి యుక్కరి
దిటవరి దిట్టన - ధీరున కగుఁ
గుచ్చితుఁ డడిగొట్టు - కూళ పెంకె బికారి
ముడికాఁడు చిలుమువాల్‌ - మోటు లుచ్చ
చెండిపోతు గరాసు - మొండికట్టె తులువ
కైలాటకాఁడు ట-క్కరి పిసాళి
టకటొంకు టాటోటు-ఠవళి దబ్బిలి దూబ
గడుసు కల్లరి దోస-కారి చెనఁటి
 
తే. పాలసుఁడు లండి పిక్కరి - పలువ బెడుగు
బేరజ మనంగ ధూర్తుని - పేరు లమరుఁ
బగఱు మార్తురు పగతురు - పవతు లనఁగ
నహితులకు నామధేయము - లమరు సాంబ.
9
సీ. పెఱవారు కడవారు - వింతవా రెడవారు
లాతిఁవా రన నన్యు-లకు జెలంగుఁ
జుట్టలు చుట్టాలు -చుట్టముల్‌ విందులు
బందుగు లనఁ జెల్లు - బంధువులకుఁ
గూర్చువాఁ డెడకాఁడు - కుంటెనకాఁ డనఁ
దాపికాఁ డనఁ బేరు - దనరుచుండు
విటదూత బయకాఁడు - వీణెకాఁ డనఁ బొల్చు
వైణికునకు గాణ - పాటకుఁ డన
 
తే. గాయకున కగుఁ దిక్క వెం-గలి వెడంగు
వెకలి వీఱిఁడి వెంబర-విత్తు వెఱ్ఱి
వేఁదు ఱనఁగ నపస్మారి - వెలయుఁ జెవిటి
విననివాఁ డన బధిరాఖ్య - లొనరు సాంబ.
10
సీ. ఎకిమీఁడు పాదుసా - యేలిక మన్నీఁడు
సాహేబు రాయఁడు - సామి పబువు
జియ్య తుపాసి వ-జీరుండు రాయలు
దునెదారి రాఱేఁడు - దొర యొడయఁడు
నేఁ డన వర్తిలు - నృపుపేళ్లు పడవాలు
దలవాయి దళ్వాయి - దణి యనంగఁ
దగు దళకర్తకుఁ - దగువాఁడు వెరవరి
తీర్పరి కార్బారి - దిట్ట యనఁగఁ
 
తే. గార్యకర్తకుఁ జెలఁగు బ్రె-గ్గడ నిజోగి
ప్రెగ్గడ మంతిరి నా మంత్రి-పేర్లు వెలయుఁ
బంగునకు లేవఁ జాలని-వాఁడు పుట్టు
మొండి పిచ్చుకుం టనుపేళ్లు - పొసఁగు సాంబ.
11
సీ. ఎడకాఁడు కొల్లగాఁ - డెడత్రోవకాపరి
గడిదొంగ దోఁపుడు-కాఁడు నాఁచు
గజముచ్చు చేవాఁడి-కాఁడు జాజరకాఁడు
మచ్చరి మునిముచ్చు - మాయదారి
తెరువాటుకాఁడు క-త్తెరదొంగ దొరకోలు
సన్నాసి వడికాఁడు - కన్నగాఁడు
రేద్రిమ్మరీఁడు ము-ల్లియవిప్పు లోవాఁడి
కాఁడు తెక్కలికాఁడు - కల్లరీఁడు
 
తే. తవళి మోసరి యనఁ జెల్లుఁ - దస్కరునకుఁ
దొత్తు సాఁకుడు బోనము-కత్తె దాది
విలువరమ్ముఁడు వరవు డిల్‌-బిడ్డ యనఁగ
దాసికానామధేయముల్‌ - దనరు సాంబ.
12
సీ. పడపుఁజాన గడించు - పడఁతి మేల్దాపరి
బోగపుఁ జేడియ - పొత్తుటాలు
వేడుకచెలి లంజె - వెలయాలు రోచెల్వ
వెల్లాటకత్తె నా - వేశ్య వెలయుఁ
గూర్చియిచ్చుమిటారి - కుంటెనకత్తియ
తాపికత్తె యనంగఁ - దనరు దూతి
నాగ వాసం బన - నామ మౌ వేశ్యల
మేళంబునకుఁ గొమ-రాలు కొమిరె
 
తే. చామ జవరాలు కొమరిత - జవ్వని యన
సుందరికిఁ జెల్లు గట్టవై-సుదియుఁ బ్రోడ
యనఁగఁ దగుఁ బ్రౌఢ వయసుచె-ల్లినది ముసలి
మిండకో రన లో లాఖ్య - మెఱయు సాంబ.
13
సీ. కన్నియ కన్నె నా - కన్యక కగుఁ బేరు
లాసగలది ఱంకు-లాడి చెడిపె
వెలిచొరవరి యన-వెలయు జారిణిపేళ్లు
మెయి మేయి యొడలు నె-మ్మేను మేను
బొంది మే మై యనఁ - బొసఁగు దేహమునకు
నెఱకలు వెండ్రుకల్‌ - నెఱు లనంగఁ
గేశసమాఖ్య లౌఁ - గేశబంధము పేళ్లు
కీల్ముడి మ్రొమ్ముడి - కీలుగంటు
 
తే. నూనెముడి వెన్నుగం టన - నొనరు శిఖకు
జుట్టు సిక సిగ యనఁ జెల్లుఁ - జుంచు కురులు
ముంగురులు కూఁకటు లనంగఁ - బొసఁగుచుండు
గుంతలములకు జితదైత్య-కూట సాంబ.
14
సీ. కొప్పు వేనలి మూల - క్రొవ్వెద తుఱు మనఁ
గబరి యౌ క\న్‌ గను - క న్ననంగ
నేత్రాఖ్య లగు నొసల్‌ - నెన్నొసల్‌ నుదురు నె
న్నుదు రన నిటలాఖ్య - లొదవుఁ జూడ్కి
పారువ దిష్టి చూ-పన వీక్షణము లొప్పు
వీనులు చెవులును - జానుగులును
నా నొప్పుశ్రోత్రముల్‌ - కౌను లేఁగౌను నె
న్నడుము నడు మనంగ - నడరు మధ్య
 
తే. మునకుఁ బొక్కిలి బొడ్డనఁ - దనరు నాభి
మూతి మోర మొకము మోము - మొగ మనంగ
వదనము దనర్చు వా నోరు - వాయి యనఁగ
ముఖగుహాభిఖ్య లగు గురు-మూర్తి సాంబ.
15
సీ. పలు పల్లు పండులు - పండ్లన రదము లౌఁ
జెంప దవుడ - చెక్కి లనఁగఁ
దగుఁ గపోలము నెత్తి - తల యన శిర మొప్పు
ముకు ము క్కనంగ నా-సిక చెలంగు
బొమ కనుబొమ యన - భ్రూనామ మమరు మీ
సలు మీసము లనంగ - శ్మశ్రు వలరు
నదరము కెమ్మోవి - పెదవి వాతెఱ మోవి
యన నోష మగు నెద - యక్కు ఱొమ్ము
 
తే. నెడఁద యన పక్ష మగుఁ బొట్ట - కడుపు బొజ్జ
బొఱ్ఱ డొక్కన నుదరంబు - పొసఁగుచుండుఁ
గేలు కై కయి చేయి కెం-గే లనంగఁ
బంచశాఖకు నామముల్‌ - పరఁగు సాంబ.
16
సీ. అఱచెయ్యి లోచెయి - యనఁ గరతల మొప్పుఁ
బెడచెయ్యి మీఁజెయి - వెనుకచెయ్యి
యనఁ దగుఁ జరమశ-యంబు వేల్‌ వ్రే లన
నంగుళి యగుఁ జర-మాంగమునకు
వెన్ను వెనుకమేను -వీఁ పన వర్తిల్లు
గద్దువ గడ్డము - గౌద యనఁగఁ
జుబుకనామంబు రా-జిల్లుఁ గడవసంబు
చట్ట తో లనఁ గళా-సంబు నాఁగ
 
తే. జర్మ మమరు మోఁకాళ్లన - జానువు లగుఁ
బిక్క చిఱుదొడ యన జంఘ-పేళ్లు దనరుఁ
గురువు తొడ యన నూరువు - వఱలు ముడ్డి
పిఱుఁదు తుంటన జఘనంబు - పేళ్లు సాంబ.
17
సీ. పునుక పుఱియ పుచ్చె - యనఁ గపాలం బొప్పు
బుజము మూఁ పనఁ జెల్లు - భుజముపేళ్లు
బట్ట వలువ కోక పుట్టంబు గింటెంబు
చీర నా వసనంబు - చెలఁగు నఱుత
గొంతు కుత్తుక యఱ్ఱు - కొలిమి మెడ యనంగ
గళమున కగుఁ బిడి-కి లన ముష్టి
కగుఁ బ్రసృతికిఁ జేర - యన నంజలికి దోయి
లన హస్తమునకు మూ - రనఁగఁ బొసఁగు
 
తే. బార యనఁగను వ్యామాఖ్య - పరఁగు జేన
దుత్త యనఁ దాలమున కొప్పు - బెత్త యనఁగ
నంగులాభిఖ్య యగు నంజ - హజ్జ యడుగు
నాఁగఁ బాదాఖ్య లగు లోక-నాథ సాంబ.
18
సీ. చనులు గుబ్బలు చండ్లు - చాచులు పాలిండ్లు
చన్ను లనంగఁ గు-చంబు లమరు
నారు నూఁగా రన - నలరు రోమావళి
పాపలఁగనుతావు - పత్త బుయ్య
మరునిల్లు దుబ్బన - మదనమందిర మొప్పు
బిల్లలఁ గలిగించు-వేరు చుల్లి
బుల్ల బెల్ల మనంగఁ - బొసఁగు శేఫము గాఁడు
గుద్ద పిఱ్ఱ యనంగ - గుదము దనరుఁ
 
తే. బైఁట పయ్యఁట పయ్యెద - పయట చెఱఁగు
నాఁగఁ జేలాంచలాభిధా-నంబు చెలఁగుఁ
గలువడము చందువా మేలు-క ట్టనంగ
నతిశయిల్లు వితానాహ్వ-యములు సాంబ.
19
సీ. చెలి ముద్దుగుమ్మ యు-గ్మలి నవలా చాన
కన్నె బిత్తరి గోతి - కలికి మగువ
జవరాలు చేడియ - జవ్వని తొయ్యలి
నాతి పైదలి యెల-నాగ లేమ
సకియ జక్కవచంటి - చామ చిల్కలకొల్కి
గుబ్బెత ప్రోయాలు - కొమ్మ పడఁతి
పొలఁతి ముద్దియ నన - బోఁడి యింతి మిటారి
నెలఁతుక వాల్గంటి - నెలఁత తెఱవ
 
తే. యన్ను లతకూన యొయ్యారి - యతివ వెలఁది
చెలియ సకి బోఁటి కొమరిత - చిగురుబోఁడి
ముగుద వగలాఁడి సింగారి - ముదిత యువిద
గరితి యన భామినీసమా-ఖ్య లగు సాంబ.
20
సీ. ఆనవాలును పులు - గంగమచ్చము గుఱు
తడియాల మన లాంఛ-నాఖ్య లొదవు
జడిత గొబ్బున వేగ - సరగు గ్రక్కున వడి
వేగిర మనఁ దగు - వేగమునకు
మరియాద గడి మేర - సరుదెల్ల కర యనఁ
బఱఁగు మర్యాదకు - వెఱఁగు వింత
యక్కజ మబ్బుర - మరిది నివ్వెఱ యబ్ర
మచ్చెరు వన నద్భు-తాఖ్య లమరుఁ
 
తే. బరఁగు కదలిక పరువన - మెఱయు ధావ
నమ్మునకు వేడెమొనరించెఁ - గ్రమ్మెఁ బొదివెఁ
జుట్టుకొనె నావరించె నా - నిట్టి నుడులు
వేష్టనంబున కమరు స-ర్వేశ సాంబ.
21
సీ. బువ్వ మెతుకు కూడు - బోన మోరెము పసా
దము వంటకము పస-దనము బాతు
సాద మోగిర మన - జరుగు నన్నము పేళ్లు
కుడిచె బోసేసె సా-పడియె నమలె
నారోగిణ మొనర్చె - నారగించె మెసవెఁ
దినె మెక్కె నన భుక్తి-గొనుట కలరుఁ
బనులు చెయ్వులు సేఁత-లనఁ గర్మముల కొప్పుఁ
గనలు మోడి యలుక - కినుక కిన్క
 
తే. నాఁగ గోపాఖ్య లగు లజ్జ-నాన సిగ్గు
బొసుకు పుయిలోట సిబ్బితి-పుచ్చటి కనఁ
బరఁగు వ్రీడాఖ్య యోల నె-పంబు సా క
నంగ వ్యాజం బమరు జగ-న్నాథ సాంబ.
22
సీ. పానుపు తలిమంబు - పఱువు లే పన మెత్త
సెజ్జ యనఁగ శయ్య - చెలఁగుచుండుఁ
బన్నుండెఁ దెన్నుండెఁ - బండుకొనెఁ బరుండెఁ
బవ్వళించెను బండెఁ - బడకవేసె
నత్తమిల్లె ననంగ - నలరారు శయనించె
ననుటకు నిద్దుర-గొనియె గుఱక
గొనియె నిద్దురవోయెఁ - గూర్కిడెనన నిద్రి
తున కొప్పు లేచె మె-ల్కొనియె మెలఁకు
 
తే. వయ్యె నన జాగ్రదభిధాన - మమరు వేడ్క
యెలమి వేడుక సంతోస-మింపు ముదము
సంతసము సొంపు మే లరు-సం బనంగఁ
బ్రమదమున కాఖ్య లగు జగ-త్పాల సాంబ.
23
సీ. బలికె వాక్రుచ్చె న-ప్పనసేసె మందలిం
చెను వించెఁ జె-ప్పె ననె నొడివె
నాడెఁ బల్కె వచించె - నన భాషణము సేసె
ననుటఁ కౌ వీనిచ్చె - నాలకించె
వినెఁ జెవియొగ్గెను - వినియె నాలించెనా
శ్రుతమయ్యె ననుట కౌఁ - జులుక చౌక
యులక యెల్లిద మన - నొనరు లఘుత పేళ్లు
పులకలొత్తెను గగు-ర్పొడిచె గగురు
 
తే. పాఱె గరుపఱె మైమోజు-పర్వె ననఁగఁ
దగును రోమాంచనామముల్‌ - నగవు నవ్వు
నగు న వన హాసమున కొప్పు - నడిమిదిన్నె
దీవి యన ద్వీప మగుఁ బర-దేవ సాంబ.
24
సీ. జోత జాగిల కొల్పు - జోహారు గిడిగిడి
మోడుపు చేకూర్పు - మ్రొక్కు మొగుపు
చిన్నవూ చేమూడ్పు - జేజెవెన్నెల చెంగ
నాలు గొబ్బులు టెంక-ణాలు నేరె
డల్లుల్‌ సలా మన-నమరు దండముపేళ్లు
పళ్లెము కంచము - పళ్లెరంబు
తెలె హరివాణంబు - తలియ తట్టి యనంగ
భాజనం బగు గిన్నె - బటుది కోర
 
తే. డబ్బుర యనంగఁ జషకమౌ - డప్పి దూప
డప్పి దగ నీరువ ట్టన - దాహ మమరుఁ
జాగ మీవి పుడుకు పెట్టు - తేగ మీగి
యనఁగఁ ద్యాగసమాభిఖ్య - లగును సాంబ.
25
సీ. అగపడెఁ జేపడె - నబ్బె దొరకెఁ జిక్కెఁ
దగిలెఁ దగుల్కొనెఁ - దగులుపడియెఁ
బట్టువడియెఁ జిక్కు-వడెఁ దవిలె ననంగ
నమరు గృహీతాఖ్య - లఱచె నేడ్చె
వాపోయె మొఱలిడె - వాచఱచె ననంగ
రోదనంబున గను - రొద గలిబిలి
చప్పుడు గొలగొల సద్దు - కూఁత యులివు
నలుకుఁడు రవళి ఱం-తనఁగ ధ్వనికి
 
తే. నలరుఁ గలసెఁ బెరసెఁ గూడె - హత్తె దొరసె
నందెఁ బొందెఁ బెనఁగెఁ జెందె - నంటె ననఁగ
నమరు సక్తాఖ్య లోనయ్యె - నగ్గమయ్యె
లోఁబడె ననంగ స్వవశాఖ్య-లు చను సాంబ.
26
సీ. ఎడసె వీడెను బాసె - నెడఁబాసెఁ బురివిచ్చె
వేఱువడె ననఁగ - వెలయుచుండుఁ
బ్రత్యేకమయ్యె న\న్‌-పలుకులు వెడలించె
వెళ్లఁ గొట్టెను దోలె - వెలలఁ బన్నెఁ
దఱిమె రొప్పె ననంగఁ - దనరు నుచ్చాటనం
బొనరించె ననుటకుఁ - గనియె జూచెఁ
గనుఁగొనెఁ దిలకించెఁ - గనెఁ గాంచె ననఁ జెల్లు
దర్శించె ననుటకుఁ - దాల్చెఁ బూనె
 
తే. నానె మోచెఁ ననఁగఁ జెల్లు - నధివహించె
ననుట కరికట్టెఁ బోనీక - యంకె చేసె
నాఁగె నిల్పెఁ దటాయించె - నడ్డగించె
నానుకొనె ననఁ దగు వార-ణాఖ్య సాంబ.
27
సీ. అంటుగైకొనియె ము-ట్టయ్యెఁ జెఱఁగుమాసెఁ
గడికేఁగె నింటికిఁ - గాకపోయె
ననఁగ దూరస్థకుఁ - దనరుఁ దానముచేసె
నీళ్లుపోసికొనె ము-నింగెఁ గ్రుంకె
నన నిమజ్జనమయ్యె - ననుటకుఁ దగు మడి
మడుఁగు మడు వనంగ - నడరు శుచికి
మైల కట్టువిడుపు - మా పన మలినాఖ్య
లగుఁ దల్పు వాకిలి - యనఁ గవాట
 
తే. మున కొనరు నేకతంబు మం-తన మనంగ
నంతరంగమునకుఁ జెల్లు - నక్కఱ పని
యొంజలియు బోలి యనఁ గార్య - మొనరు గంజి
వార్పన యవాగునామముల్‌ - వఱలు సాంబ.
28
సీ. ఒకటి యొక్కఁ డొకండు-నొండన నేకాఖ్య
జమి డిమ్మ డిబ్బడి - జంట రెండు
దుగ రెట్టి దువ యన - ద్విగుణాఖ్య కవ జోడు
దంట దోయి యనంగ - ద్వంద్వసంఖ్య
మూ రెండొకటి తిగ - మూఁ డనఁ ద్రయసంజ్ఞ
చౌ యుడ్డ తీవంచ - చౌకము నలు
నాలు గనఁగ జతు-ర్నామముల్‌ చౌవంచ
యరపది యేను నై - దనఁగఁ బంచ
 
తే. కంబు నాఱిత్తిగ యన ష-ట్కంబు చక్కు
పగడ సత యే డనంగ స-ప్తకము దచ్చి
యెనిమి దన నష్టకము తొమ్మి - దనఁగ నవము
పదియు నీరై దన దశాఖ్య - పరఁగు సాంబ.
29
సీ. పదునొకం డనఁగను - బరఁగు నేకాదశం
బీరాఱు పండ్రెండు - బార యనఁగ
రవిసంఖ్య యగు నానెఁ - ద్రాగెఁ ద్రావెను గ్రోలె
ననఁగఁ బానముచేసె - ననుట కొనరు
బనివినియెను బోయెఁ - జనె నేఁగె నరిగె నాఁ
గృతగమనునకుఁ బే - ళ్లెసఁగుఁ గ్రమ్మ
ఱించెఁ ద్రిప్పెను మగి-డించె మరల్చె నా
నావర్తన మొనర్చె - ననుట కొనరుఁ
 
తే. బాఱె వెళ్లెను పరువెత్తెఁ - బఱచెఁ గదలె
నుఱికెఁ దొలఁగె నటమరించె - జరిగె ననఁ బ
లాయితుం డయ్యె ననుటకు - నలరుచుండు
సకలసురచక్రవర్తి శ్రీ-సాంబమూర్తి.
30
సీ. గడుసరి దిట్ట యె-క్కటి వాఁడిగలవాఁడు
వడికాఁడు పోటరి - బంటు మేటి
మనసరి తెంపరి - మొనకాఁడు మిడిమాసి
వడివాఁ డనఁగ శూ-రుఁడు సెలంగు
నని చివ్వ యేడ్తెఱ - యాలము బవరము
పోట్లాట పెనఁకువ - పోరు కలను
కయ్యము దురము జ-గడ మన యుద్ధాఖ్య
లమరు మద్దతు వె-న్నాస తోడు
 
తే. పాటు సావాసము పరాలు - బాసట యన
రాజిలు సహాయమునకు వే-రమ్ము కంటు
సూడు పగ దేస మనఁగఁ బొ-ల్చును విరోధ
నామములు సర్వలోకైక-నాథ సాంబ.
31
సీ. నులిచె వెంపరలాడె - నుగ్గాఁడెఁ దెగటార్చెఁ
జక్కాఁడెఁ బగదెంచెఁ - జంపెఁ జెండె
సదమద మొనరించెఁ - జదిపెఁ బీచమడంచె
నులిమె చాఁగఱలాడెఁ - బిలుకుమార్చెఁ
బరిమార్చె ముగియించె - నుఱుముసేసె నడంచెఁ
ద్రుంచెఁ బొగరుమార్చెఁ - దునిమె మడిపె
మన్నిగొనియె రూపు-మాపె గీటడఁగించె
మడియించెఁ దూలించె - మలిపె ననఁగఁ
 
తే. బొసఁగు వధియించె ననుటకుఁ - బ్రోచెఁ బ్రోవె
సాఁకెఁ గాపాడె బ్రతికించె - సంతరించె
బెంచె మనిపె ననఁగను బో-షించుట కగు
సకలసురచక్రవర్తి శ్రీ-సాంబమూర్తి.
32
సీ. ఇచ్చ తలఁపు మది - యెద మన సనఁ జిత్త
మగుఁ దమకము మేలు - మరులు బాళి
తమి వలపు విరాళి - మమత నా మోహ మౌ
నాఁడాది యదిసుత - నాఁటనుండి
తలనాఁడు నాఁడు మొ-దలు నాఁటఁబట్టి యా
నాఁడున్కి యది మొదల్‌ - నాఁటఁగోలె
యనఁగఁ దదారభ్య - యనుట కౌ మంచి మేల్‌
బాగు లెస్స యన శు-భంబు లలరు
 
తే. వనట యంగలారుపు వెత - వంత గోడు
బాద యంగద వగ పనఁ - బరఁగుఁ బీడ
పదవి సిరి కల్మి యనఁగ సం-పదకు వెలయు
నితము పేరి మిం పన హిత - మెసఁగు సాంబ.
33
సీ. జతవీడె నెడసె నాఁ - జను విరహము పేరు
లెనసెఁఁ బైకొనెఁ బొందె - నేలెఁ గలసె
నన సంగమ మొనర్చె - ననుట కౌఁ బొలయల్క
వెడమోడి యనఁ బేళ్లు - వెలయుఁ బ్రణయ
కలహమునకు జడ - గాంజ గంజా బంగి
యనఁగఁ గళంజాహ్వ-యంబు లలరు
మబ్బు లాహిరి కైపు - మస్తన మత్తత
భాసిల్లుఁ దొడుసు నుం-పడ మనంగ
 
తే. భోగవనితకుఁ దగుఁ దెంపి - ముసుకు కుంక
మాసక మ్మన విధవనా-మములు సెలఁగు
బైరవాసంబు దోవతి - పంచె యనఁగఁ
నిల బహిద్వసనాభిఖ్య - లలరు సాంబ.
34
సీ. విచ్చేసె నేతెంచె - వచ్చెను వేంచేసె
నరుదెంచెఁ జనుదెంచె - ననఁగ నాగ
తునిపేరు లగు మగ-తనము మగంటిమి
గం డనఁ బౌరుషా-ఖ్యలు చెలంగు
గద్దించె నదలించె - గదిమెను నుఱిమె నా
గర్జించె ననుట కౌ - గట్టి యుక్కు
చేగ యూట యుదుటు - చేవ యుఱవు బిగు
వన దృఢత్వముపేరు - లలరు జట్టి
 
తే. విలువ రో వెల యనఁ గ్రయా-ఖ్యలు దనర్చుఁ
గప్రము సిరంబు గంబూర - కప్పుర మన
వెలయుఁ జంద్రంబు వెలిగ్రుక్క - గిలుకుపలుకు
రవపలు కనంగ మణితాఖ్య - లవును సాంబ.
35
సీ. లేమి పేదఱికము - లేమిడి లేవఁడి
నిప్పచ్చర మిడుమ - నెవ్వ యనఁగ
దారిద్ర్యనామముల్‌ - తగు దెస యాత్రము
కడగండ్లు గోరము - కస్తి బెడఁద
యడలు చే టన విప-దాఖ్యలు వర్తిల్లుఁ
డెక్కె మెగురఁగొట్టె - డింకవేసెఁ
బెద్దనిద్దురవోయె - బిద్దె మడిసెఁ జచ్చెఁ
జనె గంతుకొనెఁ ద్రుంగెఁ - సమసె నేఁగెఁ
 
తే. గూలెఁ నీల్గెఁ గెడసెఁ ద్రెళ్లెఁ - గ్రుంకె బ్రుంగె
దెరలెఁ బోయె ముగిసెఁ దేఱెఁ - దొరఁగె ననఁగఁ
బరఁగు మృతునిసమాఖ్యలు - బవిరి చుట్టు
వేడె మన వలయాభిధల్‌ - వెలయు సాంబ.
36
సీ. గమి పౌఁజు మొత్తము - కదుపు చేరువ బారు
పిండు కూటువ పరి - దండు దిమ్ము
గుంపు తుటుము గుమి - గూటు పదు పనంగ
బృందాఖ్య యగు వెళ్లె - వెడలె వెలలె
వెలువడె ననఁ బేళ్లు - వెలయు నిర్గతుఁ డంట
కెన్నఁడు వాలాయ - మెపుడు నిచ్చ
లెల్లప్పు డెప్పటి - కేప్రొద్దు నెడపకే
నా డెప్పు డుడుగక - నాఁ జెలంగు
 
తే. సంతతాఖ్య కొలము వంగ-సమ్ము వంగ
డమ్మనఁ గులాఖ్య వర్తిల్లుఁ - గ్రమ్మర మఱి
మగుడ వెండియుఁ బలుమఱు - మరల సారె
తిరుగ ననఁ బునరాఖ్యలు - పరఁగు సాంబ.
37
సీ. పంద కోఁచ పిఱికి - పాఱుఁబో తనగను
సమరభీరునిపేరు - లమరుచుండు
విడియము వీడెంబు - వీడ్యము వక్కాకు
తములము బాగాలు - తమ్ములంబు
నాఁ జనుఁ దాంబూల-నామముల్‌ గొనియాడె
నగ్గించెఁ బొగడెఁ గొం-డాడె నెంచెఁ
గైవారమొనరించె - నా వినుతికిఁ బేళ్లు
క్రచ్చు కోరిక కోర్కి - యిచ్చ యనఁగ
 
తే. నిచ్చ కగు రోసెఁ బరికించె - నెమకెఁ దడవె
వెదకె నారసె నరసెను - వెతకె ననఁగ
దనరు నన్వేషణాఖ్యలు - తన్నెఁ దాఁచె
నడుగుతాటించెఁ గాళ్లచే - నడిచె ననఁగ
నమరుఁ బదతాడనాభిధా-నములు సాంబ.
38
సీ. కొమరు చొక్కాటమ్ము - గొనబు చొకారము
చొక్కము మేలిమి - జోఁక పొలుపు
నాణెంబు సౌరు వి-న్నాణంబు తిన్నన
పరఁగు చొక్కా చెల్వు - మురువు తనరు
నగు తియ్య పొనరు చె -న్నలరు నలువు తీరు
వఱలు జాను చెలంగు - కొఱలు నొనరు
చను తగు నొప్పు నె-సంగు ననెడు పేళ్లు
తగు మంజులమునకు - దండ యొద్ద
 
తే. చెంత కుఱఁగలి డగ్గఱ - చేర్వ పొంత
దాపు సరస కెలను పజ్జ - ప్రాపు వద్ద
యండ చక్కి గరిడి యన - నమర నౌ స
మీపనామములు మనోజ్ఞ-రూప సాంబ.
39
సీ. పిమ్మటఁ దరువాతఁ - బిదప వెన్క వెనుక
ననఁగఁ బశ్చాదభి-ఖ్యలు చెలంగు
సడలె వదలె వ్రీలె - జాఱె వీడె ననంగఁ
జ్యుతసమాఖ్య లగు లొ-చ్చు కొద కడమ
కుఱుచ యొచ్చెము తగ్గు - కొంచెము తక్కువ
కుందు కొదవ లోను - కొద్ది యనఁగ
మెఱయు న్యూనతపేళ్లు - మిక్కిలి యెక్కువ
యెచ్చు పెల్లుదనము - పెచ్చు మిగుల
 
తే. హె చ్చనఁగ నధికాభిఖ్య - లెసఁగుచుండు
దొలుత ముందర ము\న్‌ మున్ను - తొల్లి మునుపు
ముందు మును తొలి యనఁ జనుఁ - బూర్వమునకుఁ
దడవు జా గన నాలస్య - మడరు సాంబ.
40
సీ. తాఱుమారయ్యెను - దడెఁబడె వీడ్వడె
నన విపర్యాసాఖ్య - లమరు సాము
సగము సాఁబా లనఁ - దగునర్ధ మనుటకు
దూఁకొనెఁ జొరఁబాఱెఁ - దూఱెఁ జొచ్చె
ననఁగఁ బ్రవేశించె - ననుటకుఁ దనరారు
మొత్తెఁ గొట్టెను వ్రేసె - మోఁదె ననఁగఁ
బ్రహరించె ననుట కౌఁ - బనిచెఁ బుచ్చె
నంపెఁ బుత్తెంచెఁ బొ-మ్మనియెఁ బంపె
 
తే. గెలువుమనె ననఁ బ్రస్థితా-ఖ్యలు చెలంగుఁ
జాయ పొంతనఁ జో టనఁ - బాయ యిక్క
చక్కి తా వనఁగఁ బ్రదేశ-సంజ్ఞ దనరు
నంబరనదీలసజ్జటా-డంబ సాంబ.
41
సీ. అచట నయ్యెడ నందు - నచ్చో నదిగొ యట
నచ్చట నక్కడ - నకడ నాడ
నావంక నల్లదె - యనఁ దత్ప్రదేశాఖ్య
లొదవు ముంగల మ్రోల - నెదుట ముందు
ముందట యనఁగ స-మ్ముఖము పేళ్లు రహించు
నిరుదెస లిరువంక - లిరుగెలంకు
లిరుప్రక్క లిరుమైల-లిరుగ్రేవ లిరుగడల్‌
సూరె లనెడిపేళ్లు - మీఱు నుభయ
 
తే. పార్శ్వనామముల్‌ వడసెందె - బాళితాఁకె
మైమఱచెఁ గడపట్టె సొ-మ్మసిలె ననఁగ
మూర్ఛ కౌఁ గికురించెను - మోసపుచ్చెఁ
బిక్కుచేసె నా వంచన - పేళ్లు సాంబ.
42
సీ. వెఱ బీతు దిగు లళ్కు - వెఱ పదరు బెదరు
జళు కెద జడు పన - వెలయు భయము
కత్తి వా లడిదము - కైదువ నన ఖడ్గ
మెసఁగు బల్లెము గడ - యీటె చివ్వ
యనఁగఁ గుంతాఖ్య లౌ - నామెత పండుగ
పబ్బం బనఁగ నుత్స-వమున కలరు
వంక వంకర సొట్ట - డొం కన వక్రత
చెలఁగు దుడుకు లూటి - జులిమి దుండ
 
తే. గ మ్మనఁగ నుద్దతాఖ్య లౌఁ - గాని వల్లె
మంచిది యనంగఁ దగు సమ్మ-తించుటకును
గుఱుచ యరచుట్ట దుత్తాయి - కుబుస మనఁగ
నమరుఁ గూర్పాసనామ ధే-యములు సాంబ.
43
సీ. పావాలు పావలు - పావుకోళ్లనఁ జెల్లు
బాదు కాభిఖ్యలు - పాయపోసు
లూడ్పులు పాపోసు - లుద్దముల్‌ మెట్లు చె
ప్పు లనఁగఁ బాదర-క్షలకుఁ దనరు
నంగడి బాజా ర-నంగ విపణి పొల్చు
గొన మల్లె నారి నా - గుణము పరఁగు
మొన యొడ్డనఁగ వ్యూహ-మున కగుఁ బెడబొబ్బ
యా ర్పన నట్టహా-సాఖ్య లెసఁగు
 
తే. లావు సత్తువ యనఁగ బ-లంబు చెలఁగు
నట్ట మొండె మనఁగ గబం-ధాఖ్య లలరు
దూల నవ తీఁట యనఁగఁ గం-డూతి కొనరు
శంబరాహితమదభిదా-డంబ సాంబ.
44
సీ. విలు విల్లు సింగాణి - విల్‌ సింగిణియనంగఁ
గోదండమున కగుఁ - గోవు కొప్పు
నాఁ జను ధనురగ్ర-నామంబులు లకోరి
యంపఱ నారస - మమ్ము తీరు
ములికి సరము కోల-చిలుకు తూ పన శరా
ఖ్యలు మించు మైమర్వు - కమరు జోడు
దగళా జిరాయి బొం-దళము దుప్పటమును
జిలుకత్తు బం దనఁ - జెలఁగు గవచ
 
తే. మరద మనఁ దే రనఁగ రథం - బమరుఁ హొయలు
బండి కొల్లారుబండినాఁ - బరఁగుఁ గోశ
తాంగనామముల్‌ మునికోల - యారెకోలె
ముల్లుకో లనఁ దోత్రంబు - మొనయు సాంబ.
45
సీ. దీపట్లు పంజులు - దివ్వటీల్‌ దివటీలు
దివియ లనం గర-దీపిక లగు
నొగ కాఁడిమ్రాఁఁకనఁ - దగుఁ గూబరము కాన్క
కానుక సూడిదె - కప్ప మనఁగఁ
గరము పేళ్లగు గద్దె - గద్దియ యనఁగ సిం
హాసననామంబు - లమరు గొఱిజ
గొల్లెనయు గుడారు - గూడార మనఁ దగుఁ
బటకుటీరము నొప్పి - బాద యలఁత
 
తే. తెగులు తెవు లన రోగాఖ్య - లగును వెజ్జు
మందరి యనంగ వైద్యనా-మంబు లెసఁగు
దండ చేరు సరము పేరు - తావడంబు
సరి యనఁగ హారనామముల్‌ - పొరయు సాంబ.
46
సీ. సోబె సిబ్బె మనఁ బొ-ల్చును గిలాసము కొంగు
చెఱఁగు చుం గన నొప్పుఁ - జేలముతుద
నెయ్యి నే చమురన - నెగడు నాజ్యము పేళ్లు
తైలాఖ్య యగు నూనె - తలచమురన
దివ్వెచమురు నామి-దెము నాముదం బన
నేరండతైలాఖ్య - లెసఁగుఁ గోవు
సారాయి యనఁ జెల్లు - వారుణీనామముల్‌
తిలపిష్టమున కగుఁ - దెలికపిండి
 
తే. గాన్గపిండి యనంగఁ ద-క్రంబు వెలయుఁ
జల్ల మజ్జిగ యన దధి-సంజ్ఞ దనరుఁ
బెరుఁగు కలు పన గోరండ - బెల్ల మచ్చు
నా గుడాభిఖ్యలగు జగ-న్నాథ సాంబ.
47
సీ. ఒడమెలు సొమ్ములు - తొడవు లనఁగఁ జెల్లు
భూషణాఖ్యలు విత్త-మునకు రూక
ధనము రొక్క మనంగఁ - దనరు మేలుతరంబు
మేల్బంతి కన్నాకు - మీసరంబు
తలకట్టు నాఁగ భా-సిలు శ్రేష్ఠనామంబు
లనవుడు నాఁగ నా-ననఁగ నావు
డనఁగఁ జెల్లు ననంగ - ననెడిపేరులకు విం
జామరము లన విం-జామర లన
 
తే. జమిడివీచోపు లనఁ జామ-రముల కౌ న
వాతు కల్కండ చక్కెర - పంచదార
కండచక్కెర మేల్పుల-కండ మనఁగ
శర్కరాభిఖ్య లగు శైల-చాప సాంబ.
48
సీ. సైకము తోడెము - సన్న మన్నున జిల్గు
వలిపెము చిఱు లేఁత - కొలఁది యలఁతి
యసదు లేజీ బన - నమరు స్వల్పమునకుఁ
బెను గొప్ప బలు పేరు - పెద్ద దొడ్డ
గన మన నధికాఖ్య - లొనరుఁ దోరము హొమ్ము
గమక మొ మ్మనఁగ స్థూ-లము చెలంగు
డస్సెఁ గుందె ముడింగె - దాఁకె నుబ్బడఁగెను
మ్రగ్గె గ్రుంకెను డొంకె - సగ్గె స్రుక్కెఁ
 
తే. దగ్గె నన క్షీణదశ కగు - డబ్బు బద్దు
పొల్లు దబ్బర తాటోటు - బొంకు ఠవళి
కల్ల జూ దన ననృతంబు-పేళ్లు వెలయు
నిలుకడ యనంగ నిరతాఖ్య - నెగడు సాంబ.
49
సీ. ఎంచె గణుతిచేసె - నెన్నికనిడె నెన్నె
ననఁగ గణించుట - కమరుఁ దాల్మి
సైరణ యోర్పన - శాంతతపేళ్లగు
నెమ్మి నెమ్మది హాయి - నిమ్మళంబు
నాఁగ నిరాతంక-నామము లగు వెడ
యలయిక బడలిక - యలపు సేద
యనఁగ శ్రమాఖ్య లౌ - నగ్గలం బాయెను
మేరతప్పెను మట్టు-మీఱె మించె
 
తే. వెక్కసం బయ్యె నుఱవయ్యె - గ్రిక్కిఱిసెను
ననఁగ నుత్కృష్ట మనుట కౌ - నావరించె
నిండె నెగడె వెలసెఁ బర్వె - నిగిడె ననఁగ
వ్యాప్త మయ్యె ననెడి పేళ్ల-కలరు సాంబ.
50
సీ. అవసడి యాడిక-యాఱడి సడి ఱట్టు
నగడు దూ ఱన నింద - కమరు మాల్మి
యలవాటు వాడుక - యలవడు టనఁ బొల్పుఁ
బరిచయాభిఖ్యలు - పన్నిదంబు
పందెము జూద మ-నం దగు ద్యూతంబు
నిబ్బది నిక్కము నిలువరంబు
నిజము నిక్కువ మన - నెగడు సత్యము పేళ్లు
గోర్వంక నెలకూన - గోటినాటు
 
తే. నా నఖక్షత మగును దం-తక్షతములు
కెరలు పలునొక్కు వాతెఱ-కెంపు పెదవి
గంటి కెమ్మోవిగుఱి యనఁ - గౌఁగిలి యనఁ
గవుఁగి లనఁగ నాలింగనా-ఖ్య లగు సాంబ.
51
సీ. నాగకేసరులు చె-న్నంగులు కురువులు
భోజనప్రియములు - రాజనములు
గన్నేరు లిప్పపూల్‌ - గంగాజలంబులు
మట్టకారులు పూల-మంజరీలు
పెద్దవంకలు పాల-వెల్లులు ముత్తెపు
సరులు సంభావులు-చంద్రవంక
లేనుఁగుకొమ్ములు - మానికములు వన్నె
పూలు సీతాభోగ-ము లన శాలి
 
తే. ధాన్య మొసఁగును దూము ముం-త ముకుసంబు
బల్ల కుం చన సోల త-వ్వ పడి యడ్డ
గరిసె పుట్టి సెలగ మెడా-కల మనంగ
ధాన్యములు గొల్చువానికిఁ - దగును సాంబ.
52
కం. ఇమ్మనుజవర్గుఁ జేసితి
సమ్మదమున దీని వినిన - జనులు భళా చొ
క్క మ్మనఁగా నెంతయు నన
ఘ మ్మనఁగా మహిని వెలయుఁ - గావుత సాంబా
53
AndhraBharati AMdhra bhArati - sAMbanighaMTuvu - bhAshha - nighaMTuvulu - sAMba nighaMtuvu AMdhranAmanighaMTuvu ( telugu andhra )