భాష నిఘంటువులు సాంబనిఘంటువు (ఆంధ్రనామనిఘంటువు)
తిర్యగ్వర్గు
కం. శ్రీగౌరీపతి నీపై
బా గౌరీతి రచియింతుఁ - బటుకవితాధా
రాగతిఁ దిర్యగ్వర్గును
వేగమె నిగిడించి ప్రోవ-వే శ్రీసాంబా.
1
సీ. నెఱసరి సింగంబు - తెఱమొగము మెకంబు
మెకములదొర జడ-మెకము బొబ్బ
మెకము వెడఁదనోటి-మెకము గుబ్బలిపట్టి
గుఱ్ఱ మేనుంగుల - గొంగ యనఁగఁ
జెలఁగు సింహముపేళ్లు - పులి చాఱలమెకంబు
దెరువుఁగాపరి పసి-తిండిపోతు
మువ్వన్నె మెక మనఁ - బొలుపొందు వ్యాఘ్రంబు
వావురము పటాణి - వారువంబు
 
తే. జిక్కి మావు గుఱ్ఱము తేజి - యెక్కిరింత
తత్తడి రవాలు నడగఁడు - కత్తలాని
తురికి బాబా యనఁగ నొప్పుఁ - దురగమునకుఁ
గొ మ్మనఁగఁ దనమేరు శృం-గమ్ము సాంబ.
2
సీ. సిబ్బెమేనిమొకంబు - గబ్బు చెంపమెకంబు
గొప్పయజ్జమెక మె-క్కుడుమెకంబు
గౌరు చెయ్యిగలమె-కము రెండు త్రాగు డే
నుఁగు పలుగొమ్ములు - దిగినమెకము
హత్తి బల్తలమెకం - బన దంతి పేళ్లగుఁ
బుట్టకూటిమెకంబు - బొచ్చుమెకము
వెనుచూపు మెక మెల్గు - వెలినోటిమెక మన
భల్లూకనామముల్‌ - పరఁగు గొరిజ
 
తే. గొరిసె యన ఖర మమరును - గో రనంగ
నఖము తగు జోడనలు రవ-నడలు నడ్డ
వేడెములు పర్వు లనఁ జుట్టు వేడెము లనఁ
బంచధారలనామముల్‌ - పరఁగు సాంబ.
3
సీ. పసి గిడ్డి మొద వాపు - పసరము తొడు కనఁ
బశువుపే ళ్ళగు గిబ్బ - బసవఁ డాల
పోతు నాఁబోతు మూ-పురముదా ల్పెద్దు ము
క్కంటిమా వన వృషా-ఖ్యలు దనర్చుఁ
గోడె గిత్త యనంగఁ - గొఱలు నుక్షాఖ్యలు
క్రేపు పడ్డయు దూడ - లేఁగ పెయ్య
యన వత్సనామంబు - లలరును నెనుపెంటి
బఱ్ఱె నా మహిషికిఁ - బరఁగు దుంత
 
తే. దున్న పో తన మహిషమౌ - దొడ్లు తొఱ్ఱు
పట్టు లనఁగ గోస్థానముల్‌ - పరఁగు మంద
కదుపు పదు వనఁ జెలఁగు గో-గణము పాగ
లాయ మన నొప్పు వాజిశా-లకును సాంబ.
4
సీ. సింగంబుదొంగ ద-చ్చియడుగులమెక మ
నఁగ శరభాఖ్య లౌఁ - దగరు జంట
మొగమువేలుపుతేజి - పొట్టేలు గొఱియపో
తేడిక యన మేష - మెసఁగు నిఱ్ఱి
నులికొమ్ముమెక మన - వెలయుఁ గృష్ణమృగంబు
జింక లే డన మృగి - చెలఁగుఁ బిల్లి
చీలి యనంగ మా-ర్జాల మౌఁ గుందేలు
చెవులపో తనఁగ రం-జిలు శశంబు
 
తే. నొంటె లొట్టిపిట్ట యనఁగ - నుష్ట్ర మమరుఁ
గణితి కణఁ జనఁ దనరు గో-కర్ణ మృగము
పిక్కు మెక మెండ్రిమేఁతరి - నక్క బుద్ధి
మెక మనఁగ జంబుకాఖ్యలు - మెఱయు సాంబ.
5
సీ. కొమ్మటెంకిమెకంబు - తిమ్మఁడు వెకిరింత
కోఁతి నాఁ గపిపేళ్లు - కొఱలుచుండు
జల్లితోఁక మెకంబు - సవరంపు మెక మనఁ
జమిరికిం జనుఁ బంది - చప్పరింత
కొమ్ముకాఁ డూటమె-కమ్ము వేపులమిత్తి
ముస్తెలమేపరి - మోటుమెకము
వాలుమెకంబు రో-బంటరి యొంటరి
ముట్టెమెకము పీఁట-వెట్టుమెకము
 
తే. ఏకలము గుర్గురిం తన-నెసఁగు దంష్ట్రి
పొడమెకము దుప్పి యనఁ బొలు-పడరు రామ
మృగము మనుఁబో తనఁగ ఋశ్య-మృగము దనరు
బల్లి గౌ ళన ముసలికిఁ - బరఁగు సాంబ.
6
సీ. తోఁడేలు గొఱియల-సూ డన వృక మొప్పు
ముంగిస వెంట్రువ - ముంగి యనఁగ
బభ్రువు తగుఁ గొక్కు - పందికొ క్కన మూషి
కకుఁ బొల్చు గాడిద - గాలిగాఁడు
చలువగుఱ్ఱము ఱేపు-జక్కి యన ఖరాఖ్య
లగు మొఱుఁగుడు జాగి-లమ్ము గుక్క
వేపి నా శునకంబు - వెలయును దొండ యూ
సరవెల్లి యనఁ దగు - సరటమునకుఁ
 
తే. జిట్టెలుక యన బాలమూ-షికకుఁ బొల్చు
నుడుము తేళ్ల మేపరి యన - నొసరు నుండు
నవని గౌధేరనామధే-యములు మహిత
సకలసురచక్రవర్తి శ్రీ-సాంబమూర్తి.
7
సీ. తంతువాయ మగుఁ బా-దట్టుపురుగు సన్న
పిల్లి సాలీఁ డన - రాళ్లరాసి
గాఁడు గరిమిడియె-ల్క యన నాఖువు దగు
నెఱకలు చట్టుపల్‌ - గఱులు ఱెక్క
లనఁ బక్షములు పొల్చు - లావు లీక లనంగఁ
బర్ణంబు తగు గువ్వ - పక్కి పిట్ట
పులుఁ గనఁ బక్షికి - వెలయు మదికొలంకు
పులుఁగు తెల్లనిపిట్ట - నలువతేజి
 
తే. పాలు నీరును వెలిసేయు-పక్కి యంచ
యన మరాళంబు తగుఁ గెంపు-కనులపులుఁగు
తలిరు మేఁతరి సాఁకుడు-పులుఁగు మావి
కొమ్మయిలుపుల్గు కోవెల - కోయి లనఁగఁ
బభృతమునామధేయముల్‌ - పరఁగు సాంబ.
8
సీ. పచ్చఱెక్కలపుల్గు - పచ్చవిల్తునితేజి
పలుకులపులుఁగు నాఁ - జిలుక చిల్క
యనఁగ శుకాభిఖ్య - లగు బట్టికాఁడు గో
ర్వంక గోరింక గో-రంక యనఁగ
శారికాహ్వయము లె-సంగు నట్టువపిట్ట
నెమ్మి జుట్టుబులుఁగు - నెమిలి నమిలి
పురివిప్పియాడెడి-పులుఁగు కన్నులుగల
పులుఁ గన బర్హికి - వెలయుచుండు
 
తే. జంటపిట్ట బటువుగువ్వ - జక్కవ యనఁ
గోకనామంబు లగు మంచు-గ్రోలుపుల్గు
నిప్పులను మ్రింగుపులుఁగు వె-న్నెలపులుఁ గన
నమరును జకోరనామధే-యములు సాంబ.
9
సీ. విరితేనెత్రావుడు - మరునల్లె బమిపుర్వు
తుమ్మెద తేఁటి ము-ద్దుగలకాళ్ల
పురు గన భ్రమరంబు - పొలుచు లకోరీలు
బకదారు లొడ్డీలు - పల్లటీలు
పావురములు నేల-పల్లటీల్‌ కూకీలు
పావురా లంతర-పల్లటీలు
సురటీ లనంగ బొ-ల్చును గలరవములు
కొక్కెర కొంచయుఁ - గొక్కరాయి
 
తే. యనఁగఁ గ్రౌంచాఖ్య లగుఁ గొంగ - యన బకంబు
జాలె జలకట్టె యణుజు వే-సడము లగుడు
జావడము వారణము బైరి - సాళువంబు
కనిసెరము చెంచడము డేగ - యనఁగఁ దనరు
శ్యేనమునకు మునీశ్వరా-ధీన సాంబ.
10
సీ. కరువలిమేఁతరి - కంటివిన్కరి పాము
పుట్టకాఁపరి త్రాఁచు - చుట్టుపురుఁగు
విసముతాలుపు చిల్వ - బుసపుర్వు నా భోగి
వెలయుఁ జిలువఱేఁడు - వెన్నుపాన్పు
తడవులనిడుపఁడు - తరిగట్టుత్రాఁ డన
నహిపతి కగు నజ్జ-యలుఁగుపులుఁగు
కోడి పుం జన నొప్పుఁ - గుక్కుటనామముల్‌
గుడ్లగూబ పగటి-గ్రుడ్డి గూబ
 
తే. యనఁగ ఘూకాభిధానంబు - లగు లకుముకి
మీనవల్లంకి పొదలిక - మాలగొంగ
యనఁగఁ జను వర్తితకుఁ బేరు - లమరు దివ్వె
యార్పు మిడుతన శలభాఖ్య - లమరు సాంబ.
11
సీ. కాటుకపిట్ట కూఁకటి-గువ్వ యేట్రింత
పులుఁగులగదుమరి -పోలిగాఁడు
నాఁగ భరద్వాజ-నామముల్‌ తగు గబ్బి
లము గబ్బిడా గబ్బి-లాయి చీకు
రా యనంగనుఁ దైల-పాయి కాఖ్యలు చెల్గు
మ్రానుదొలుచుపిట్ట - మ్రానుపోటు
వనఁగ దార్వాఘాట-మున కగు బెగ్గుర
మన సారసమ్మున - కలరు నీరు
 
తే. కట్టె నీరుపా మన నల-గర్ద మలరుఁ
బుడమి చెవి పాములబిడారు - పుట్ట యనఁగ
మించు వల్మీక నామముల్‌ - మెట్టుతాప
మెట్టిక యన సోపానాఖ్య - మెఱయు సాంబ.
12
సీ. గుమికాఁడు కాకి నాఁ - గొఱలుఁ గాకముపేళ్లు
గ్రద్ద యనఁగ గృ-ధ్రంబు వెలయు
జరగు గుబ్బిలికాఁడు - సకినాలు వెలయించు
పక్కి పగటిచీకు - పైఁడికంటి
యనఁ గనకాక్షికిఁ - దనరు జవాది జ
వ్వాజి యనఁగ సాంక-వము దనర్చు
కస్తూరి వీణెయుఁ - గస్తురి యనఁ బొల్చు
మృగనాభి చట్టపు-మెకము పునుఁగు
 
తే. బిల్లి యొత్తెడుపిల్లి నాఁ - బేళ్లు వెలయు
గంధిలమునకుఁ జాతకా-ఖ్యలు దనర్చు
వానకోయిల మబ్బునీ-రానుపిట్ట
యనఁగఁ గైలాసశైలవి-హార సాంబ.
13
సీ. పొడకోడి కానపుం - జడవిపుం జన వన
కుక్కుటం బగు బొల్లి-కోడి నీరు
కోడి యనఁగ జల-కుక్కుటంబు దలిర్చు
పిట్ట పిచ్చిక యూరఁ - బిచ్చిక యనఁ
దగుఁ జటకమున కౌ - దాఁటరి చలికాపు
కప్ప యనఁగ భేక - మొప్పు జలగ
నల్లత్రాగు డన రా-జిల్లు జలూకము
మొగటిపురువు గోడ-పురువు నల్లి
 
తే. నాఁగ మత్కుణ మగు నీవ - యీఁగ యనఁగ
మక్షికకు నొప్పు ములుపుర్వు - మంటితిండి
తే లనఁగ వృశ్చికంబు వ-ర్తిల్లు ఱొచ్చు
పురుగు దో మన మశకంబు - పరఁగు సాంబ.
14
క. ప్రీతిని భవదంకిత మౌ
నీ తిర్యగ్వర్గు జగము - లెన్నఁగ లోకా
తీతంబై పూతంబై
ఖ్యాతంబై ధరను వెలయుఁ - గావుత సాంబా.
15
AndhraBharati AMdhra bhArati - sAMbanighaMTuvu - bhAshha - nighaMTuvulu - sAMba nighaMtuvu AMdhranAmanighaMTuvu ( telugu andhra )