| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | బ్రహ్మ యింద్రునితో గౌతముం డతని కిచ్చిన శాపకథఁ జెప్పుట |
| శా. | నే నిర్మించిన కామినీమణులలో నీ టొందు నీలాలకన్ నే నింకొక్కరితన్ సృజింతు ననియున్ నిష్కర్షఁ గావించి యీ నానాదివ్య విశేష వస్తువుల సౌందర్యాంశముల్ గూర్చి లో కానందాకృతిగా సృజించితి నహల్యానామభామామణిన్ | 24 |
| తే.గీ. | హలము నాఁగలిరూప మా హలము భావ మరయ హల్యంబు నాఁజను నట్టి హల్య మన్నెలంతకు లేమి నహల్యయనుచు నేను బలికితి నెఱుఁగవే యింద్ర! నీవు | 25 |
| సీ. | కమలవైఖరి సుధాకర కళావిభవంబు - లొకటియై చెలువొంది యుండుటకును భ్రమరసంపదలు సంపఁగె పువ్వు విలసనం - బొకటియై చెలువొంది యుండుటకును దాడిమీ బీజసంతతి శుకమణి ముఖం - బొకటియై చెలువొందియుండుటకును శంఖసౌభాగ్యంబుఁ జారు వీణాస్వనం - బొకటియై చెలువొంది యుండుటకును | |
| గీ. | నేఁ బ్రయత్నంబు సేసి యన్నెలఁత కన్నుఁ గవ మొగము, చూపుగమి నాసికయు, రదములు మోవి, కంఠంబు సుస్వరమును - సృజించి కాంచితి సురేంద్ర! యఘటనాఘటన పటిమ | 26 |
| సీ. | పూర్ణేందుబింబ మెప్పుడు నిల్వలేదాయె - ననుదూఱు దీని యాననమువలనఁ గవ జక్కవలఁ బాయఁగాఁ జేసెనౌ నను - సడి దీని కుచలికుచముల వలనఁ బగలు కల్వల చెల్వుఁ బ్రబల నీ యండను - దూషణ దీని కందోయి వలన మించు నించుక సేపు మించి నిర్మింపతేఁ - డను రట్టు దీని దేహంబువలనఁ | |
| గీ. | బాపుకొన లెస్స సృజియించె బ్రహ్మయనుచుఁ గొలువ వచ్చిన దేవతకోటి తలఁప నీ వెలఁది నిమ్మనుచు నన్ను నీవు వచ్చి వచ్చి యడుగుదు మఱచితే? వజ్రపాణి! | 27 |
| చం. | పలుమఱు నీవు వేఁడిన నభశ్చరు లెందఱు వచ్చివేఁడినన్ గలికి నొసంగ కెవ్వరికి గౌతమమౌనికి దాని నిచ్చినన్ గళవళ మంది నీవు రతికాంత కృతాంత లతాంతకుంతముల్ బలువిడి మానసాంబుజము బ్రద్దలు వాప నధైర్యమూర్తివై | 28 |
| కం. | నను దూఱుచు గౌతమముని వని దూఱుచుఁ గుసుమరచిత వల్లీవిలస ద్వనిఁదారుచు నచ్చెలిఁ బెనఁ గొనఁగోరుచుఁ బొంది ప్రొద్దుగ్రుంకినయంతన్ | 29 |
| ఉ. | ఆ నడిరేయి కోడివలె నార్భటిసేసి మునీంద్రునిన్ నదీ స్నానము సేయఁబంచి కుహనామునివై చని గౌతమాంగనా నూన రతోత్సవాంబుధి మునుంగుచు నుండితి వంతలోన న మ్మౌనియు వచ్చి నిన్నుఁగని మచ్చర మల్కయు నిచ్చ హెచ్చఁగన్ | 30 |
| మ. | కపటాకారముఁ బూని మౌనిసతులన్ గాంక్షించి యీలాగు గా ని పనుల్ సేయఁ గడంగినాఁడవె? బళా! నీ కండ గర్వంబు! దే వపతీ! శత్రుఁడు పట్టి కట్టికొనిపోవన్ దీఱుఁబొమ్మంచు నిన్ శపియించెంగద! నాఁటి శాపమిదిగో సంధిల్లె నీ నాఁటికిన్ | 31 |
| కం. | నినుఁ గలిసిన నిజకాంతం బెను చట్టైయుండుమని శపించి జగతిఁ జ క్కని సతులు తఱుచుఁ గలిఁగెద రని ముని యనె నటుల నయిరి యది మొదలు సతుల్ | 32 |
| వ. | కావున | 33 |
| చం. | వగవకు మీ యఘంబు చన వాసవ! వైష్ణవయాగ మంచితం బుగ నొనరింపు నీ యనుఁగుఁబుత్రుఁ బులోముఁడు వార్ధివైరిచే నగపడనీక దాఁచె వల దాతనికై వెతఁజెంద నంచు న న్నగరిపు నూరడించి నలినప్రభవుం డపుడేఁగె వీటికిన్ | 34 |
| చం. | కమలజుఁ డానతిచ్చిన ప్రకారమునన్ గ్రతు వాచరించి ఖే ద ముడిగి వాసవుండు నిజధామముఁజేరె నృపాల! రావణ ప్రముఖులకంటె రావణి పరాక్రమ మెక్కువ యన్నమాట ని క్క మవుఁగదా యటం చల యగస్త్యమహాముని యాన తిచ్చినన్ | 35 |
| తే.గీ. | ఆ పురావృత్తమున రావణాత్మజన్ము విక్రమము పెద్ద యనుమాట విని రఘుప్ర వీరుఁ డరుదందె సభనున్నవారలెల్ల నింద్రజిద్వైరి లక్ష్మణు నెంచి రపుడు | 36 |
| ఉ. | శ్రీరఘురాము చెంగట వసించి విభీషణుఁ డగ్రజక్రమం బా ఋషి దెల్పఁగా విని ప్రహర్షముతో నృపుఁ జూచి మున్ను క న్నారఁగ జూచినట్లు ముని యానతియియ్యఁగ నేఁడు వింటి న య్యారె! యగస్త్యుఁ డెంత మహిమాధికుఁ డంచు నుతించె నయ్యెడన్ | 37 |
| కం. | మైత్రావరుణి ధరిత్రీ పుత్రీవరునిఁ గని యనియెఁ బుంభావకళా ధాత్రానందకరోక్తి సు గాత్రీపదపుటిత కటక ఘటితార్భటులన్ | 38 |
| చం. | జడధిమదాంధకార హరశౌర్యదినేశ్వర! రామ! మున్ను నీ వడిగిన మాట కింక నొక యద్భుత మున్నది యాలకింపు మి వ్వడువున రావణుండు బలవంతుల మార్కొను వేడ్క నొక్కనాఁ డెడపక పశ్చిమాబ్ధి దరి కేఁగి తదంతికకాననంబునన్ | 39 |