ఇతిహాసములు ఉత్తరరామాయణము కపిలమునియైన నారాయణుండు రావణునకు స్వస్వరూపంబుఁ జూపుట
కపిలమునియైన నారాయణుండు రావణునకు స్వస్వరూపంబుఁ జూపుట
కం.నేనెవ్వఁడని తలంచితొ?
నా నిజరూపంబుఁజూచి నా మహిమంబున్‌
నా నామ మెఱిఁగికొమ్మని
యానన మొకయింత దెఱచి నంతటిలోనన్‌
63
సీ.జ్వలనకీలాసహస్రము లర్కకరలక్ష - లైందవరుచికోటు లచటఁదోఁచె
నరసురాసుర వియచ్చర సిద్ధ సాధ్యరు - ద్రాహి గుహ్యక తతు లచటం దోఁచె
నఖిల సముద్రంబు లఖిలాంతరీపంబు - లఖిల సరిద్వన్య లచటఁదోఁచె
నభము భూమియు గాడ్పు నక్షత్రములు గిరు - లామ్నాయముఖ్య విద్య లచటఁ దోఁచె
 
గీ.నట్టి ముఖములు పెక్కు వే లమితకర్ణ
నయన నాసాపుటంబు లనంతపదము
లమితబాహువు లమితభూషాంబరాదు
లమితశస్త్రంబు లమ్మూర్తియందుఁ దోఁచె
64
కం.ఆ యద్భుత తేజోనిధి
చాయన్‌ గరియొద్ది దోమచందంబున దై
తేయుండు హీనుఁడై తన
కాయము గంపింప వెఱచి కన్నులు మొగిచెన్‌
65
వ.ఇవ్విధంబున66
తే.గీ.కన్ను లన్నియు మొగిచి నక్తంచరేంద్రుఁ
డమ్మహామూర్తి కానతు లాచరించి
యంజలు లొనర్చి దేవ! నీ వని వధించు
నంతకంటె శుభంబేది? యనుచుఁ బలికె
67
కం.ఆదట గిరితో గుహతో
నా దేవుఁ డదృశ్యుఁ డయ్యె నద్భుతభయస
మ్మోదములు వెలయ మారీ
చాదులతో నచటు వాసి యతఁ డరిగె నృపా!
68
తే.గీ.రామ! గుహలోన గిరిచెంత రావణునకుఁ
గనఁబడిన దేవుఁ డెవ్వఁడో యనఁగనేల?
యతఁడె కపిలావతారుఁడౌ నాదివిష్ణుఁ
డాయనకు నీకు భేద మింతైనఁగలదె?
69
వ.అని పల్కి యగస్త్య మునిచంద్రుడు వెండియు రామచంద్రున కిట్లనియె70
సీ.స్నానసంధ్యాజప స్వాధ్యాయ తపముల - నెవ్వాని స్మరియింతు రెల్లఋషులు
జగదుద్భవస్థితిసంహారకృత్యంబు - లెవ్వాని క్రీడలై నివ్వటల్లుఁ
బ్రాఁబల్కు కల్కి పాపటకు సిందూరమై - యెవ్వాని పదకాంతి యెసకమెసఁగు
దేశికోచ్చరితోపదేశమంత్రంబులై - యెవ్వాని నామంబు లింపొనర్చుఁ
 
గీ.బద్మజేంద్రాది దేవతాప్రభువు లేమ
హామహు నమేయమాయాబ్ధిలో మునింగి
దరియు దాపును గానక తల్లడింతు
రట్టి హరి వీవకావె? పట్టాభిరామ!
71
సీ.పదపంకజరజఃప్రభావంబుచే రాతి - నతివఁగా నొనరించినందువలన
సాక్షాన్నిటాలతటాక్షుండు దాల్చు వి - ల్లవవీల విఱిచిన యందువలన
ధనువు గైకొను నెపంబున జామదగ్న్యు బా - హాశక్తి హరియించినందువలన
నినజుతోఁబ్రతిన చేసినలీల నొకకోల - నమరేంద్రసుతుఁ గూల్చినందువలన
 
గీ.నబ్ధి బాణాగ్రమున నిల్పినందువలన
నని నజయ్యాసురులఁ ద్రుంచినందువలన
నాది నారాయణస్వామి వగుట దెలిసె
నరయ నరుఁడవె? నీవు పట్టాభిరామ!
72
మ.పదిమోముల్‌ గల దండి రక్కసు ననిన్‌ భంజింప నీలాగు నీ
వుదయం బొందిన, నీ పనుల్‌ నడుప నుద్యోగించి, రుద్రాబ్జ గ
ర్భ దినేంద్రాబ్జముఖామరుల్‌ పవనభూభల్లూక రాడ్భానుజాం
గదముఖ్యాగచరత్వముల్‌ గనిరిగా కాకుత్‌ స్థవంశాగ్రణీ!
73
ఉ.అందఱు నందఱౌనె కదా! యందఱిలోఁ బవనాత్మజుండు నీ
యందుఁ బ్రపత్తి గల్గిన మహాత్ముఁ డుదాత్తగుణోత్తరుండు సం
క్రందనజిద్దశాస్యముఖ రాక్షసముఖ్యుల నొక్కరుండె పో
రం దెగఁజూడనోపు బలరాశి నుతింపఁ దరంబె యాతనిన్‌
74
మ.అకలంకాత్ముఁ డపాయశూన్యుఁ డఖిలోపాయాధికుండం చెఱిం
గికదా యెవ్వరి లెక్కసేయక లతాంగింజూచి రమ్మంచు ము
ద్రిక యీ మారుతి చేతి కిచ్చితివి భూరిస్తోత్రపాత్రంబుగా
సకలజ్ఞుండవు రామ! నీ వెఱుఁగవే సామీరి మాహాత్మ్యముల్‌!
75
సీ.కదలఁ డీతఁడు వజ్రకఠిన విగ్రహుఁ డంచుఁ - బోలఁగా మైనాకశైల మెఱుఁగు
వెఱవఁ డీతఁడు మహావీర శేఖరుఁ డంచు - శోధింపవచ్చిన సురస యెఱుఁగు
కలఁగఁడీతఁడు భూరిగాంభీర్యనిధి యంచు - వడిఁబాయ యిచ్చిన వనధి యెఱుఁగుఁ
బలిమి నీతఁడు మహాబలు నంతవాఁ డంచుఁ - గెరలి మార్కొనిన లంకిణి యెఱుంగు
 
గీ.జీవదాయకుఁ డితఁడని సీత యెఱుఁగు
రాక్షసాంతకుఁ డితఁ డని యక్షుఁ డెఱుఁగు
నధికుఁ డితఁ డని రావణి యస్త్ర మెఱుఁగు
సిద్ధమిది యని రామ! నీ చిత్త మెఱుఁగు
76
సీ.అవనిజాహృదయ శోకాంధకారము మాన్పఁ - గపిరూపుఁ గనిన భాస్కరుఁ డితండు
దశకంధరోద్యాన తరువులు గూల్ప మైఁ - దాల్చు ఝంఝామారుతం బితండు
సైన్యేశపంచక సప్తమంత్రిజగిరుల్‌ - వ్రాల్పఁ బ్రాణము లొందు వజ్ర మితఁడు
పరపలాశి కులంబు భస్మంబు గావింప - వాల మూనిన దవజ్వాలి యితఁడు
 
గీ.రావణుని ధైర్యలతఁ ద్రుంప ఱంప మితఁడా
దైత్యుల కకాలమునఁ దోఁచు మృత్యు వితఁడు
సకల కపిలోచన చకోర చంద్రుఁ డితఁడు
ఖరకరాన్వయ! మీ కేడుగడయు నితఁడు
77
ఉ.రావణపుత్రుకంటె నల రావణుకంటెను వాలికంటె ని
ప్పావని బాహు విక్రమవిభాసితుఁ డించుక యల్గెనేని లో
కావళి హావళిం గను మహర్షుల శాపముచే స్వకీయ మౌ
లా వెఱుఁగండు మత్తకరిలాగున నుండు నితండు రాఘవా!
78
తే.గీ.అని ప్రసంగవశంబున ననిలసుతునిఁ
బ్రస్తుతించిన కుంభసంభవుని మాట
లమృతధారలవలె వీనులార నలరి
యెలమితో జానకీజాని యిట్టు లనియె
79
మ.కలశీసంభవ! నీవు పల్కినది నిక్కం బంజనాపుత్రుఁడన్‌
బలు తెప్పం గొనికాదె దాఁటితి విపత్పాథోధి? యీ భానుజా
దులు నన్‌ గొల్వ నొనర్చె నీతని మృదూక్తుల్గావె? యిమ్మేటి కే
వలభక్తిన్‌ ననుఁగూర్చి చేసినపనుల్‌ వర్ణింపఁగా శక్యమే?
80
సీ.తన వాగమృతధార ధరణిజాప్రాణముల్‌ - నిలిపి నా మదిలోని నెగులు దీర్చె
శరణు సొచ్చిన విభీషణుఁ గూర్చుకొమ్మని - తెలిపి మాకుఁ బ్రతిష్ఠ గలుగఁజేసె
బవరంబులోఁ బేర్చి పంక్తికంఠుని యుర - స్థలి ముష్టిహతి నొంచి సగముసంపెఁ
బరులచే హతులైన ప్లవగోత్తములకు జీ - వము లిచ్చి మా ప్రాభవంబు నిలిపెఁ
 
గీ.బడిన లక్ష్మణు బ్రదికించి భానుకులము
నిలిపె నంతటఁ జననీక నిర్వహించె
వేయు నిఁకనేల? నాకొఱకై యనేక
దనుజవీరులఁద్రుంచె నీ యనిలసుతుఁడు
81
ఉ.తమ్ముల బంధులం గలసి తల్లులనుం గని నేను సీతతోఁ
గ్రమ్మఱ నీయయోధ్య కధికారము గాంచి సుఖించుటెల్ల స
త్యమ్ము సమీరసూనుని సహాయతఁ గాదె మునీంద్ర! యెన్ని జ
న్మమ్ములకైన నీతని ఋణం బెడఁబాపుకొనంగ నేర్తునే?
82
చం.అది యటులుండె నీయన మహామహుఁ డర్కజు చెంతనుండి బ
ల్లిదుఁడగు వాలి నేల విదళింప కుపేక్ష యొనర్చె? నాత్మ శ
క్తి దెలియకుండుఁగాక యని కిన్క వహించి మహర్షు లేటికీ
సదమలమానసాబ్జునకు శాపమొసంగి రెఱుంగఁ దెల్పవే!
83
మ.జననం బాదిగ నీ మహాత్ముని భుజాశౌర్యప్రభావోన్నతుల్‌
వినఁ గాంక్షించెదఁ దెల్పుఁ డంచు హనుమద్వీరావతంసంబు మూఁ
పున నాత్మీయ కరంబు సాచి జగతీపుత్త్రీమనోభర్త వేఁ
డినఁ బల్కెన్‌ ముని నానటద్భవజటాటీకాభ్రగంగార్భటిన్‌
84
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju