ఇతిహాసములు ఉత్తరరామాయణము పులస్త్య బ్రహ్మ వృత్తాంతము
పులస్త్య బ్రహ్మ వృత్తాంతము
చం.పదములు నాల్గు కల్గి కవి పద్యము కైవడిఁ జెందు ధర్మ మెం
దది కృత మయ్యుగంబునఁ దదంచితధర్మగుఁడై పులస్త్యుఁడన్‌
మొదలిటివేల్పుపట్టి ముని ముఖ్యులకున్‌ గమికాఁడు జ్ఞానసం
పదల బిడారు శాంతుఁడు కృపానిధి యొప్పు నహఃపతిప్రభన్‌
114
కం.శ్రీమించు సత్య మెనసి పి
తామహునకు సాటియై యుదంచితకరుణా
సామగ్రి సత్త్వయుక్తిఁ బి
తామహునకు సాటి యన నతఁడు విలసిల్లున్‌
115
సీ.అకలంక సుగుణ మౌక్తిక జన్మదేశమై - యే మౌని హృదయాబ్జ మింపు గులుకుఁ
ద్రిభువన విమల వారిజవనీహంసియై - యే తపోధనుకీర్తి యెమ్మెగాంచు
నజమనః కమలహర్షాపాదియై యే మ - హర్షి మహాతపం బతిశయిల్లు
సకలమౌని వతంసులకు మేలుబంతియై - యే పుణ్యు దినచర్య యేపుఁ జెందు
 
గీ.వినతదేవకిరీట భావిత సరోజ
రాగరుచిచక్ర చక్ర చంక్రమణగతుల
నే ముని పదాంబుజము లొప్పు నా మహాత్ముఁ
డతఁడు సాధారణుఁడె పులస్త్యాహ్వయుండు
116
ఉ.ఆ మునిచక్రవర్తి దన యంచిత ధైర్యము పోల్కి మించు నా
హైమనగంబు చెంతఁ జెలువౌ తృణబిందుని యాశ్రమంబునం
దామస ముజ్జగించి వనితావిముఖత్వముఁ గాంచి క్రోధుతోఁ
గాము జయించి నూత్నశివుకైవడి నుగ్రతపంబు సేయఁగన్‌
117
సీ.వలరాజుకోసమై యల వసంతుఁడు గుంపు - సేసిన చిలుక తేజీ లనంగ
వనరాశి నావరించిన కరంజక మేఘ - తతి మించు చంచలాలత లనంగ
భువనముల్‌ భ్రమియించు పూవిల్తు నెలయింప - రతి దాల్చు రూపాంతరంబు లనఁగ
ముని చిత్తముల నొంప మనసిజుం డపు - డంపవచ్చు మంత్రాధిదేవత లనంగ
 
గీ.బెళుకుఁ జూపులు నొయ్యార మొలుకు నడలుఁ
దళుకుఁ దొడలును సిబ్బెంపుఁ గులుకు గుబ్బ
లమరు నమరాహి ఖచరకన్యలు సఖీ స
మాజములతోఁ బులస్త్యాశ్రమంబుఁ జేరి
118
సీ.పాటఁ బాడుదు రొక్కచోట మోటులు పల్ల - వించి కోయిలలకు విందుసేయ
నాట లాడుదు రొక్కచోటఁ గాంచనఘంటి - కలు మ్రోయ మరుమదావళము లనఁగ
మాటలాడుదు రొక్కచోట జక్కెర వింటి - జాణ తేజికిఁ దియ్య ఖాణ మొసఁగ
నీటు సేయుదు రొక్కచోటఁ గేళిని మనో - హరుఁ డేడ వలచునో యని చలింప
 
గీ.నగుదు రొకచోటఁ గుముదసంతతులు విరియ
నిలుతు రొకచోట మెట్టతమ్ములు జనింప
ఖచర గంధర్వ కిన్న రాంగనలు మీఱి
బ్రహ్మ కొడుకు తపోవనాభ్యంతరమున
119
సీ.గణిక సోఁకఁ గురంటకము కంటక మిషంబు - నను గగుర్పాటొందె వనిత! చూడు
సరసమాధవిసేర విరితేనె నెపముతోఁ - జెమరించె సురపొన్న చెలియ! చూడు
లతకూన గదియఁ బల్లవదంభమున రసా - లము రక్తిఁ గనిపించె రమణి! చూడు
తన జాతి కొమ్మ సెందిన మరుద్గతి బంధు - జీవంబు వడఁకె నెచ్చెలువ! చూడు
 
గీ.మల్లికా యోగమంది సంపఁగి సువర్ణ
పుష్పములు పెక్కు మొనయించెఁ బొలఁతి! చూడు
మనుచు సకలర్తు శోభితం బైన ముని త
పోవనంబున మెలఁగి ర ప్పువ్వుఁబోండ్లు
120
చం.ఇటువలె జవ్వనంపు మద మెచ్చఁగ నెచ్చెలు లిచ్చ మెచ్చఁగా
నటునిటుఁ జెంత వారు చెరలాడఁగఁ గందువ మాటలాడఁగా
జిటిపొటి గుబ్బచేల లిలఁ జీఱఁగఁ బల్మఱుఁ జేరఁ జీరఁగా
జటి జపవిఘ్న మోరువఁగఁ జాలక చాలఁ గలంగి యిట్లనున్‌
121
శా.ఓ లీలావతులార! నేఁడు మొద లే యొయ్యారి వీక్షించు న
న్నా లోలేక్షణ యా క్షణంబునన కన్యాత్వంబు దూష్యంబుగాఁ
జూలా లౌ ననుచున్‌ శపింప మునిరాజుం జూడ శంకించి యిం
దేలా యాటలు సాలుఁ జాలు నిఁక రారే యంచు వా రేఁగుచున్‌
122
సీ.మగఱాల చికిలికమ్మలు డాయఁ దెలుపెక్కెఁ - జెక్కి లేమని యోర్తు చెలియ నడిగె
నీలకాంచీచ్ఛాయ నెరయ నీ నూఁగారు - మెఱసె నేమని యోర్తు మెలఁత నడిగెఁ
గస్తూరి గరఁగి పైఁ గ్రమ్మ నేటిదె చూచు - కముల నల్పని యోర్తు కాంత నడిగె
నళుకుచేఁ బరుగెత్తి యలసి రానేమొ యీ - యలసత్వమని యోర్తు కలికి నడిగె
 
గీ.దారి నడచుచు నల జడదారి కినుక
దారితోత్సాహలై తప్పి తారి యతనిఁ
జొచ్చితిమె యంచుఁ జూలాండ్ర సొబగు లెంచి
బ్రమసి యొండొరు నడగుచుఁ బడఁతు లరుగ
123
వ.అంత124
ఉ.బిందునిరోధమందుఁ దృణబిందునిఁ నందిని తత్తపోవనం
బిందునిభాననంబు గల యిష్టసఖీమణితోడఁ జేరి యం
దంద చరించుచుండె భయ మన్న దొకింతయు లేక మౌనిసం
క్రందనుఁ డప్పు డాడిన తెఱం గది విన్నది గాదు గావునన్‌
125
వ.ఇవ్విధంబున్‌126
సీ.తన తనూసురభిళత్వము ఘుమ్ముమనఁ గ్రమ్ము - కొన గంధవహభావ మనిలుఁ డొందఁ
దన కాంతిలత లల్లుకొన వనీతరులెల్లఁ - గనకసాల శ్రీలఁ గని వెలుంగఁ
దన మందహాసకుందములకై విరియు నా - రిని గూర్ప మరుఁడు సారెకును దిరుగఁ
దన కరారుణరుచుల్‌ ఘనలతాదులఁ దార - సిలి నవ్య కిసలయావళుల నింపఁ
 
గీ.దన పలుకు చిల్కపలుకుతోఁ ద్రస్తరింపఁ
దన నడలు నెమ్మికొమ్మలఁ దప్పు వట్టఁ
దన నఖాంశువు లిలకు గందంబు వూయ
రాజఋషిపుత్త్రి వన విహారంబు సలిపె
127
వ.ఇ వ్విధంబున నవ్వనంబులోన న జ్జవ్వని విహరించుచుఁ దనతోఁడి ముద్దులాడిం బొడగానక యవ్వాలుగంటి యెటు వోయెనో యని యొంటిగా నవ్వలం జని జని128
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju