| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | రాక్షసవంశోత్పత్తిక్రమము |
| మ. | హరినాభీకుహరారవింద మకరం దానంద నేందిందిరం బు రహిన్ మించి విరించి యంచితతపస్ఫూర్తిన్ జగత్ సృష్టివై ఖరిఁ బ్రాపించి మహాజలంబు దొలుతన్ గల్పించి తద్రక్షణా కరకాంక్షన్ సృజియించె సత్త్వముల సంకల్పం బనల్పంబుగన్ | 192 |
| శా. | ఆ సత్త్వంబులు క్షుత్తృడాతురత బ్రహ్మన్ జేరఁగావచ్చి వి శ్వాసంబుల్ గనుపింప నేమి యొనరింపన్ మమ్ముఁ బుట్టించి తీ వో సామీ యిపు డేమి సేయుదుము నా సూక్తీశుఁడున్ నవ్వుతో మీ సామర్థ్యముఁ జూత మిజ్జలము నెమ్మిన్ బ్రోవుఁడీ నావుడున్ | 193 |
| మ. | జలసంరక్ష యొనర్తు మంచుఁ జని యా సత్త్వావళుల్ క్షుత్తృడా విలభావంబు వహింప కంబుహృతి గావింపంగ నుంకించి యం చల బ్రహ్మన్ గని కొంచి కొన్ని యనె ‘జక్షా’ తి ధాత్వర్థ వా క్కలనన్ నీళ్ళ వసించుకొన్ని యనె ‘రక్షా మే’ తి వాగ్వైఖరిన్ | 194 |
| తే.గీ. | అపుడు పరమేష్ఠి జక్షింతు మని పలికిన జంతువుల యక్షు లగుచుఁ బ్రశస్తిఁ జెందుఁ డనియె రక్షింతు మని పల్కినట్టివారి రాక్షసులు గం డనుచుఁ బల్కె రఘువరేణ్య! | 195 |