పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ప్రథమస్కంధము
కృతిపతి నిర్ణయము
ఉ. ఇ మ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్‌
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి, కాలుచే
సమ్మెటవ్రేటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరా జొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్‌.
13
తే. చేతులారంగ శివునిఁ బూజింపఁడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ, గలుగ నేటికిఁ దల్లుల కడుపుచేటు.
14
వ. అని మఱియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణకథా ప్రపంచ విరచనా కుతూహలుండనై యొక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబు రాకఁగని సజ్జనానుమతంబున నభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ యగు గంగకుం జని క్రుంకులిడి వెడలి మహనీయ మంజుల పులినతలంబున మహేశ్వర ధ్యానంబు సేయుచుఁ గించిదున్మీలితలోచనుండనై యున్నయెడ. 15
సీ. మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి నువిద చెంగట నుండ నొప్పువాఁడు,
చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు,
వల్లీయుతతమాలవసుమతీజము భంగి బలువిల్లు మూఁపునఁ బరఁగువాఁడు,
నీలనగాగ్రసన్నిహితభానుని భంగి ఘనకిరీటము దలఁ గలుగువాఁడు.
 
ఆ. పుండరీకయుగముఁ బోలు కన్నులవాఁడు, వెడఁద యురమువాఁడు, విపులభద్ర
మూర్తివాఁడు, రాజముఖ్యుఁడొక్కరుఁడు నా, కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.
16
వ. ఏను నా రాజశేఖరుం దేఱిచూచి భాషింప యత్నంబు సేయునెడ నతడు దా ‘రామభద్రుండ మన్నామాంకితంబుగ శ్రీమహాభాగవతంబుఁ దెనుంగు సేయుము. నీకు భవబంధంబులు దెగు’నని యానతిచ్చి తిరోహితుండయిన సమున్మీలితనయనుండనై వెఱఁగుపడి చిత్తంబున. 17
క. పలికెడిది భాగవతమఁట!, పలికించెడి వాఁడు రామభద్రుండఁట! నేఁ
బలికిన భవహర మగునఁట!, పలికెద వేఱొండు గాథ పలుకఁగ నేలా?
18
ఆ. భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు!, శూలికైనఁ దమ్మిచూలికైన
విబుధజనుల వలన విన్నంత కన్నంత, తెలియ వచ్చినంత తేటపఱుతు.
19
క. కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ, గొందఱకును సంస్కృతంబు గుణమగు, రెండుం
గొందఱికి గుణములగు నే, నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్‌.
20
మ. ఒనరన్‌ నన్నయ తిక్కనాది కవు లీయుర్విం బురాణావళుల్‌
తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్‌ దీనిం దెనింగించి నా
జననంబున్‌ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్‌.
21
మ. లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతాశోభితమున్‌, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్‌, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్‌ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్‌ సద్ద్విజశ్రేయమై.
22
వ. ఇట్లు భాసిల్లెడు శ్రీమహాభాగవతపురాణ పారిజాతపాదపసమాశ్రయంబునను, హరికరుణా విశేషంబునను, గృతార్థత్వంబు సిద్ధించెనని బుద్ధి నెఱింగి లేచి మరలి కొన్నిదినంబులకు నేక శిలానగరంబునకుం జనుదెంచి యందు గురువృద్ధ బుధబంధుజనానుజ్ఞాతుండనై. 23
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - prathama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )