| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ప్రథమస్కంధము |
| శా. |
కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజముం గాలక్రోధుఁడు దండహస్తుఁడు నృపాకారుండు క్రూరుండు జం ఘాలుం డొక్కఁడు శూద్రుఁ డాసురగతిం గారుణ్య నిర్ముక్తుఁడై నేలం గూలఁగఁ దన్నెఁ బంచితిలఁగా నిర్ఘాతపాదాహతిన్. |
411 |
| వ. | మఱియును. | 412 |
| శా. |
ఆలోలాంగక నశ్రుతోయకణ జాలాక్షిన్ మహాంభారవన్ బాలారూఢ తృణావళీకబళలోభ వ్యాప్త జిహ్వాగ్ర నాం దోళస్వాంత నజీవవత్స నుదయద్దుఃఖాన్వితన్ ఘర్మ కీ లాలాపూర్ణ శరీర, నా మొదవు నుల్లంఘించి తన్నెన్ వడిన్. |
413 |
| వ. | ఇ ట్లా ధేనువృషభంబులు రెంటిం గంటకుండై తన్నుచున్న రాజ లక్షణ ముద్రితుం డయిన శూద్రునిం జూచి సువర్ణ పరికర స్యందనారూఢుండగు నభిమన్యునందనుండు గోదండంబు సగుణంబు సేసి మేఘగంభీర రవంబులగు వచనంబుల నిట్లనియె. | 414 |
| శా. |
నిన్నుం గొమ్ములఁ జిమ్మెనో? కదిసెనో? నిర్భీతివై గోవులం దన్నం గారణమేమి? మద్భుజసనాథక్షోణి నే వేళలం దు న్నేరంబులు సేయ రా; దెఱుఁగవా ధూర్తత్వమున్ భూమిభృ త్సన్నాహంబు నొనర్చె దెవ్వఁడవు? నిన్ శాసించెదన్ దుర్మతీ! |
415 |
| క. |
గాండీవియుఁ జక్రియు భూ, మండలిఁ బెడఁబాసి చనిన మదమత్తుఁడవై దండింపఁ దగని వారల, దండించెదు నీవ తగుదు దండనమునకున్. |
416 |
| వ. | అని వృషభంబు నుద్దేశించి యిట్లనియె. | 417 |
| మ. |
కురుధాత్రీశ్వర బాహు వప్ర యుగళీ గుప్తక్షమా మండలిం బరికింపన్ భవదీయనేత్రజనితాంభశ్శ్రేణిఁ దక్కన్ జనుల్ దొరఁగం జేయ రధర్మసంజనిత జంతుశ్రేణి బాష్పంబులన్ గురుశక్తిన్ విదళింతుఁ జూడు మితనిన్ గోమూర్తిదేవోత్తమా! |
418 |
| క. |
జాలిఁ బడ నేల? నా శర, జాలంబుల పాలు సేసి చంపెద వీనిన్ భూలోకంబున నిపుడే, నాలుగు పాదముల నిన్ను నడిపింతుఁ జుమీ! |
419 |
| ఉ. |
వాచవియైన గడ్డిఁ దిని వాహినులందు జలంబు ద్రావఁగా నీ చరణంబు లెవ్వఁడిటు నిర్దళితంబుగఁ జేసె; వాఁడు దా ఖేచరుఁడైన, వాని మణి కీలిత భూషణ యుక్త బాహులన్ వే చని త్రుంచివైతు వినువీథికి నేగిన నేల డాఁగినన్. |
420 |
| వ. | అని మఱియు గోరూప యయిన భూదేవితో నిట్లనియె. | 421 |
| చ. |
అగణితవైభవుం డగు మురాంతకుఁ డక్కట! పోయె నంచు నె వ్వగలఁ గృశించి నేత్రముల వారికణంబులు దేకు మమ్మ! లో బెగడకు మమ్మ! మద్విశిఖబృందములన్ వృషలున్ వధింతు నా మగఁటిమిఁ జూడవమ్మ! వెఱ మానఁ గదమ్మ! శుభప్రదాయినీ! |
422 |
| క. |
సాధువులగు జంతువులకు, బాధలు గావించు ఖలుల భంజింపని రా జాధము నాయుస్స్వర్గ, శ్రీధనములు వీటిఁబోవు సిద్ధము తల్లీ! |
423 |
| క. |
దుష్టజన నిగ్రహంబును, శిష్టజనానుగ్రహంబుఁ జేయఁగ నృపులన్ స్రష్ట విధించెఁ బురాణ, ద్రష్టలు సెప్పుదురు పరమధర్మము సాధ్వీ! |
424 |
| వ. | అనిన ధర్మనందన పౌత్త్రునకు వృషభమూర్తినున్న ధర్మదేవుం డిట్లనియె. | 425 |
| ఉ. |
క్రూరులఁ జంపి, సాధువులకున్ విజయం బొనరించునట్టి యా పౌరవ వంశజాతుఁడవు భాగ్యసమేతుఁడ వౌదు తొల్లి మీ వా రిటువంటి వా రగుట వారిజనేత్రుఁడు మెచ్చి దౌత్య సం చారము సేసెఁ గాదె నృపసత్తమ! భక్తిలతానిబద్ధుఁడై. |
426 |
| వ. | నరేంద్రా! యేము ప్రాణులకు దుఃఖహేతువులము గాము; మావలన దుఃఖంబు నొందెడు పురుషుండు లేఁడు; వాదివాక్య భేదంబుల యోగీశ్వరులు మోహితులై భేదంబు నాచ్ఛాదించి, తమకు నాత్మ సుఖదుఃఖంబుల నిచ్చు ప్రభువని చెప్పుదురు. దైవజ్ఞులు గ్రహదేవతాదులకుఁ బ్రభుత్వంబు సంపాదింతురు; మీమాంసకులు గర్మంబునకుం బ్రాభవంబుం బ్రకటింతురు;లోకాయతికులు స్వభావంబునకుఁ బ్రభుత్వంబు సంపాదింతురు; ఇందెవ్వరికిని సుఖదుఃఖ ప్రదానంబు సేయ విభుత్వంబు లేదు; పరులవలన దుఃఖంబు వచ్చిన నధర్మంబు పరులు సేసిరని విచారింప వలదు; తర్కింపను నిర్దేశింపను రాని పరమేశ్వరునివలన సర్వంబు నగుచుండు ననిన ధర్మదేవునికి ధర్మనందన పౌత్త్రుం డిట్లనియె. | 427 |
| ఆ. |
ధర్మమూర్తి వయ్య ధర్మజ్ఞ వృషరూప, పరమధర్మ మీవు పలుకు త్రోవ పాపకర్మ చేయు పాపంబు సూచింపఁ, బాపకర్ముఁ డేఁగు పథము వచ్చు. |
428 |
| వ. | మఱియు దేవమాయవలన భూతంబుల వాఙ్మానసంబులకు వధ్యఘాతుక లక్షణంబగు వృత్తి సులభంబునం దెలియరాదు; నీవు ధర్మదేవతవు; కృతయుగంబునం దప శ్శౌచ దయా సత్యంబులను నాలుగు నీకుం బాదంబు లని చెప్పుదురు; త్రేతాయుగంబునఁ బూర్వోక్తపాద చతుష్కంబునం దపశ్శౌచదయా సత్యంబులం దొక్క పాదంబు క్షీణం బయ్యె; ద్వాపరంబునం బాదద్వయంబు నశించెం; గలియుగంబందు నివ్వడువున నిప్పుడు నీకుఁ బాదత్రయంబు భగ్నంబయ్యె, నవశిష్టంబగు భవదీయ చతుర్థ పాదంబున ధర్మంబు గల్యంతంబున నిగ్రహింప గమకించుచున్నయది, విను మదియునుంగాక. | 429 |
| మ. |
భరముం బాపి రమావిభుండు గరుణం బాదంబులం ద్రొక్కఁగా స్థిరయై వేడుక నింతకాలము సుఖశ్రీ నొందె భూదేవి; త చ్చరణస్పర్శము లేమి శూద్రకులజుల్ శాసింతు రంచున్ నిరం తర శోకంబున నీరు గన్నుల నిడెన్ ధర్మజ్ఞ! వీక్షించితే. |
430 |