పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము చతుర్థస్కంధము
దేవతలు వీరభద్రాదులచేఁ బరాజితులై బ్రహ్మతో విన్నవించుట
చ. హరభటకోటిచేత నిశితాసిగదాకరవాలశూలము
ద్గరముసలాదిసాధనవిదారితజర్జరితాఖిలాంగులై
సురలు భయాకులాత్ము లగుచున్‌ సరసీరుహజాతుఁ జేరి త
చ్చరణసరోరుహంబులకు సమ్మతిఁ జాఁగిలి మ్రొక్కి నమ్రులై.
124
క. తము ధూర్జటి సైనికు లగు, ప్రమథులు దయమాలి పెలుచ బాధించుట స
ర్వముఁ జెప్పి రనుచు మైత్రే, యమునీంద్రుఁడు విదురుతోడ ననియెన్‌; మఱియున్‌.
125
తే. ఇంతయును మున్ను మనమున నెఱిఁగి యున్న, కతన విశ్వాత్మకుండును గమలలోచ
నుండు నన నొప్పు నారాయణుండు నజుఁడుఁ, జూడ రారైరి తాము దక్షుని మఖంబు.
126
వ. అని చెప్పి సుర లిట్లు విన్నవించినఁ జతుర్ముఖుండు వారల కిట్లనియె. 127
క. ఘనతేజోనిధి పురుషుం, డనయంబుఁ గృతాపరాధుఁ డయినను దా మ
ల్లన ప్రతికారముఁ గావిం, చిన జనులకు లోకమందు సేమము గలదే?
128
వ. అని మఱియు నిట్లనియె. 129
క. క్రతుభాగార్హుం డగు పశు, పతి నీశ్వరు నభవు శర్వు భర్గుని దూరీ
కృత యజ్ఞభాగుఁ జేసిన, యతి దోషులు దుష్టమతులు నగు మీరింకన్‌.
130
సీ. పూని యే దేవుని బొమముడి మాత్రాన లోకపాలకులును లోకములును
నాశ మొందుదు; రట్టి యీశుండు ఘన దురుక్త్యస్త్రనికాయవిద్ధాంతరంగుఁ
డును బ్రియావిరహితుండును నైనవాఁ డమ్మహాత్మునిఁ ద్రిపురసంహారకరుని
మఖపునస్సంధానమతి నపేక్షించు మీరలు సేరి శుద్ధాంతరంగు లగుచు
 
తే. భక్తినిష్ఠలఁ దత్పాదపద్మయుగళ, ఘనపరిగ్రహపూర్వంబు గాఁగ నతని
శరణమొందుఁ డతండు ప్రసన్నుఁడయినఁ దివిరి మీ కోర్కి సిద్ధించు దివిజులార!
131
వ. అని మఱియు నిట్లనియె; న ద్దేవుని డాయం జన వెఱతు మని తలంపకుం; డతనిఁ జేరు నుపాయం బెఱింగింపు మంటిరేని నేను నింద్రుండును మునులును మీరలును మఱియు దేహధారు లెవ్వరేని న మ్మహాత్ముని రూపంబు నతని బలపరాక్రమంబుల కొలఁదియు నెఱుంగం జాల; మతండు స్వతంత్రుండు గావునఁ దదుపాయం బెఱింగింప నెవ్వఁడు సమర్థుండగు? నయిన నిపుడు భక్తపరాధీనుండును శరణాగత రక్షకుండును నగు నీశునిఁ జేరంబోవుద మని పలికి పద్మసంభవుండు దేవ పితృగణ ప్రజాపతులం గూడి కైలాసాభిముఖుండై చని చని. 132
ఉ. భాసురలీలఁ గాంచిరి సుపర్వులు భక్తజనైకమానసో
ల్లాసముఁ గిన్నరీజనవిలాసము నిత్యవిభూతిమంగళా
వాసము సిద్ధగుహ్యక నివాసము రాజతభూవికాసికై
లాసముఁ గాంతినిర్జితకులక్షితిభృత్సుమహద్విభాసమున్‌.
133
సీ. ధాతువిచిత్రితోదాత్తరత్నప్రభాసంగతోజ్జ్వలతుంగశృంగములును
గిన్నరగంధర్వకింపురుషాప్సరోజననికరాకీర్ణసానువులును
మానితనిఖిలవైమానికమిథున సద్విహరణైకశుభప్రదేశములును
గమనీయనవమల్లికాసుమనోవల్లికామతల్లీలసత్కందరములు
 
తే. నమరసిద్ధాంగనాశోభితాశ్రమములు, విబుధజనయోగ్యసంపన్నివేశములును
గలిగి బహువిధపుణ్యభోగముల నొప్పు వినుతసుకృతములకు దండ వెండికొండ.
134
వ. అది మఱియును మందార పారిజాత సరల తమాల సాల తాల తక్కోల కోవిదార శిరీషార్జున చూత కదంబ నీప నాగ పున్నాగ చంపక పాటలాశోక వకుళ కుంద కురవక కన కామ్ర శతపత్ర కింశు కైలా లవంగ మాలతీ మధూక మల్లికా పనస మాధవీ కుటజోదుంబ రాశ్వత్థ ప్లక్ష వట హింగుళ భూర్జ పూగ రాజపూగ జంబూ ఖర్జూ రామ్రాత ప్రియాళు నారికేళేంగుద వేణు కీచక ముఖర తరుశోభితంబును, గలకంఠ కాలకంఠ కలవింక రాజకీర మత్తమధుకర నానా విహంగ కోలాహల నినదబధిరీభూత రోదోంతరాళంబును, సింహ తరక్షు శల్య గవయ శరభ శాఖామృగ వరాహ వ్యాఘ్రకుర్కుర రురు మహిష వృక సారంగ ప్రముఖ వన్యసత్త్వ సమాశ్రయ విరాజితంబును, గదళీషండ మండిత కమల కహ్లార కైరవ కలిత పులినతల లలిత కమలాకర విహరమాణ కలహంస కారండవ సారస చక్రవాక బక జలకుక్కుటాది జలవిహంగకుల కూజిత సంకులంబును, సలిల కేళీవిహరమాణ సతీరమణీ రమణీయ కుచమండల విలిప్తమృగమద మిళిత హరిచందన గంధ సుగంధి జలపూరిత గంగా తరంగిణీ సమావృతంబును నైన కైలాస పర్వతంబు వొడగని యరవింద సంభవ పురందరాది దేవగణంబు లత్యద్భుతానందంబులం బొంది ముందటఁ దారహీర హేమమయ విమాన సంకులంబును; బుణ్యజన మానినీ శోభితంబును నైన యలకాపురంబుఁ గడచి తత్పుర బాహ్య ప్రదేశంబునం దీర్థపాదుండైన పుండరీకాక్షు పాదారవింద రజః పావనంబును, రతికేళీ వ్యాసంగ పరిశ్రమ నివారక సలిల కేళీవిలోల దేవ కామినీ పీనవక్షోజ విలిప్తకుంకుమ పంక సంగత పిశంగవర్ణ వారిపూర విలసితంబునునై, నందాలక నందాభిధానంబులు గల నదీద్వితయంబు దాఁటి తత్పురోభాగంబున వనగజసంఘృష్టమలయజపరిమిళితమలయపవనాస్వాదనముహుర్ముహురున్ముదిత మానస పుణ్యజనకామినీకదంబంబును, వైదూర్యసోపాన సమంచిత కనకోత్పల వాపీ విభాసితంబును, గింపురుషసంచారయోగ్యంబును నగు సౌగంధిక వన సమీపంబు నందు. 135
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - chaturtha skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )