| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | సప్తమస్కంధము |
| వ. | అని మెత్తంబడని చిత్తంబున గద నెత్తికొని తత్తఱంబున నార్చుచు నకుంఠిత కంఠీరవంబు డగ్గఱు గంధసింధురంబు చందంబున నక్తంచర కుంజరుండు నరసింహదేవున కెదురు నడచి తదీయదివ్యతేజోజాల సన్నికర్షంబునం జేసి దవానలంబు డగ్గఱిన ఖద్యోతంబునుం బోలెఁ గర్తవ్యాకర్తవ్యంబులు దెలియక నిర్గత ప్రభుండయి యుండె, నప్పుడు | 288 |
| మ. |
ప్రకటంబై ప్రళయావసానమున మున్ బ్రహ్మాండభాండావరో ధకమై యున్న తమిస్రమున్ జగము నుత్పాదించుచోఁద్రావి సా త్త్విక తేజోనిధియైన విష్ణునెడ నుద్దీపించునే? నష్టమై వికలంబై చెడుఁగాక తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమా! |
289 |
| వ. | అంత నద్దానవేంద్రుండు మహోద్దండంబగు గదాదండంబు గిరగిరం ద్రిప్పి నరమృగేంద్రుని వ్రేసిన నతండు దర్పంబున సర్పంబు నొడిసిపట్టు సర్పపరిపంథి నేర్పున దితిపట్టిం బట్టికొనిన మిట్టిపడి దట్టించి బిట్టు కట్టలుక న య్యసుర వరుండు దృఢబలంబున నిట్టట్టు మిడిసి పట్టు దప్పించుకొని విడివడి దిటవు దప్పక కుప్పించి యుప్పరం బెగసి విహంగ కులరాజచరణ నిర్గళిత భుజంగంబు తెఱంగునం దలంగ నుఱికి తన భుజాటోపంబున నరకంఠీరవుండు కుంఠితుం డయ్యెడి నని తలంచి కలంగక చెలంగుచుఁ దన్ను నిబిడ నీరద నికరంబుల మాటున నిలింపులు గుంపులు గొని డాఁగి మూఁగి క్రమ్మఱ నాత్మీయ జీవన శంకా కళంకితులై మంతనంబులఁ జింతనంబులు సేయుచు నిరీక్షింప నక్షీణ సమర దక్షతా విశేషం బుపలక్షించి ఖడ్గ వర్మంబులు ధరియించి భూనభో భాగంబుల వివిధ విచిత్ర లంఘనా లాఘవంబులం బరిభ్రమణ భేదంబులఁ గరాళవదనుండయి యంతరాళంబునఁ దిరుగు సాళువడేగ చందంబున సంచరించిన సహింపక. | 290 |
| సీ. |
పంచాననోద్ధూత పావక జ్వాలలు భూనభోంతరమెల్లఁ బూరితముగ దంష్ట్రాంకురాభీల ధగధగాయిత దీప్తి నసురేంద్రు నేత్రము లంధములుగఁ గంటక సన్నిభోత్కట కేసరాహతి నభ్రసంఘము భిన్నమై చలింపఁ బ్రళయాభ్రచంచలాప్రతిమభాస్వరములై కరనఖరోచులు గ్రమ్ముదేర |
|
| తే. |
సటలు జళిపించి గర్జించి సంభ్రమించి, దృష్టి సారించి బొమలు బంధించి కెరలి జిహ్వ యాడించి లంఘించి చేత నొడిసి, పట్టె నరసింహుఁడా దితిపట్టి నధిప! |
291 |
| క. |
సరకుగొనక లీలాగతి, నురగేంద్రుఁడు మూషకంబు నొడిసిన పగిదిన్ నరకేసరి దను నొడిసిన, సురవిమతుఁడు ప్రాణభీతి సుడివడియె నృపా! |
292 |
| క. |
సురరాజవైరి లోఁబడెఁ, బరిభావితసాధుభక్తపటలాంహునకున్ నరసింహునకు నుదంచ, త్ఖరతరజిహ్వునకు నుగ్రతరరంహునకున్. |
293 |
| వ. | అంత. | 294 |
| మ. |
విహగేంద్రుండహి వ్రచ్చుకైవడి మహోద్వృత్తిన్ నృసింహుండు సా గ్రహుఁడై యూరువులందుఁజేర్చి నఖసంఘాతంబులన్ వ్రచ్చె దు స్సహు దంభోళికఠోరదేహు నచలోత్సాహున్ మహాబాహు నిం ద్రహుతాశాంతకభీకరున్ ఘనకరున్ దైత్యాన్వయశ్రీకరున్. |
295 |
| శా. |
చించున్ హృత్కమలంబు, శోణితము వర్షించున్ ధరామండలిం, ద్రెంచుంగర్కశనాడికావళులు, భేదించున్ మహావక్షముం, ద్రుంచున్ మాంసము సూక్ష్మఖండములుగా, దుష్టాసురున్ వ్రచ్చి ద ర్పించుం, బ్రేవులు కంఠమాలికలు గల్పించున్ నఖోద్భాసియై. |
296 |
| సీ. |
వక్షఃకవాటంబు వ్రక్కలు సేయుచో ఘనకుఠారంబులకరణి నొప్పు, గంభీరహృదయపంకజము భేదించుచోఁ గుద్దాలములభంగిఁగొమరుమిగులు ధమనీవితానంబు దవిలి ఖండించుచోఁ బటులవిత్రంబుల పగిది మెఱయు జఠరవిశాలాంత్రజాలంబుఁద్రెంచుచోఁ గ్రకచసంఘంబుల గరిమఁజూపు, |
|
| తే. |
నంకగతుఁడైన దైత్యుని నాగ్రహమున, శస్త్రచయముల నొంపక సంహరించి యమరు నరసింహు నఖరంబు లతివిచిత్ర, సమరముఖరంబులై యుండె జనవరేణ్య! |
297 |
| క. |
స్ఫురిత విబుధజనముఖములు, పరివిదళితదనుజనివహపతి తనుముఖముల్ గురురుచిజితశిఖిశిఖములు, నరహరిఖరనఖము లమరు నతజనసఖముల్. |
298 |
| వ. | ఇట్లు కేవల పురుషరూపంబును మృగరూపంబునుం గాని నరసింహ రూపంబున రేయునుం బవలునుం గాని సంధ్యాసమయంబున, నంతరంగంబును బహిరంగంబునుం గాని సభాద్వారంబున, గగనంబునుం భూమియునుం గాని యూరుమధ్యంబునఁ, బ్రాణసహితంబులును బ్రాణరహితంబులును గాని నఖంబులం ద్రైలోక్యజన హృదయ భల్లుండయిన దైత్యమల్లుని వధియించి మహాదహన కీలాభీల దర్శనుండును, గరాళవదనుండును లేలిహానభీషణ జిహ్వుండును శోణిత పంకాంకిత కేసరుండునునై ప్రేవులు కంఠమాలికలుగా ధరించి కుంభి కుంభ విదళనంబుసేసి చనుదెంచు పంచాననంబునుంబోలె దనుజకుంజర హృదయకమల విదళనంబు సేసి తదీయ రక్తసిక్తంబులైన నఖంబులు సంధ్యారాగ రక్తచంద్రరేఖల చెలువు వహింప సహింపక లేచి తన కట్టెదుర నాయుధంబు లెత్తుకొని తత్తరంబున రణంబునకు నురవడించు రక్కసులం బెక్కుసహస్రంబులం జక్రాదిక నిర్వక్ర సాధనంబుల నొక్కనిం జిక్కకుండం జక్కడిచె, ని వ్విధంబున. | 299 |
| శా. |
రక్షోవీరుల నెల్లఁద్రుంచి రణసంరంభంబు చాలించి దృ ష్టిక్షేపంబు భయంకరంబుగ సభాసింహాసనారూఢుఁడై యక్షీణాగ్రహుఁడై నృసింహుఁడు కరాళాస్యంబుతో నొప్పెఁ దన్ వీక్షింపంబలికింప నోడి యితరుల్ విభ్రాంతులై డాఁగఁగన్. |
300 |
| క. |
సురచారణవిద్యాధర, గరుడోరగయక్షసిద్ధగణములలో నొ క్కరుఁడైన డాయ వెఱచును, నరహరి నయ్యవసరమున నరలోకేశా! |
301 |
| క. |
తర్షంబుల నరసింహుని, హర్షంబులఁజూచి నిర్జరాంగనలు మహో త్కర్షంబులఁగుసుమంబుల, వర్షంబులు గురిసి రుత్సవంబుల నధిపా! |
302 |
| వ. | మఱియు న య్యవసరంబున మింట ననేక దేవతా విమానంబులును, గంధర్వగానంబులును, నప్సరోగణనర్తన సంవిధానంబులును, దివ్యకాహళ భేరీపటహ మురజాది ధ్వానంబులును, బ్రకాశమానంబు లయ్యె, సునందకుముదాదు లయిన హరి పార్శ్వచరులును మహేశ్వరవిరించి మహేంద్ర పురస్సరులగు త్రిదశకిన్నర కింపురుష పన్నగ సిద్ధ సాధ్య గరుడ గంధర్వ చారణ విద్యాధరాదులును బ్రజాపతులును నరకంఠీరవదర్శనోత్కంఠు లయి చనుదెంచి. | 303 |