| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | ‘ఈ దేవయాని కెద్ది యిష్టంబు దానిన యిత్తు, నడుగు’ మనిన దేవయాని సంతసిల్లి ‘యట్లేని శర్మిష్ఠ గన్యకా సహస్రంబుతో నాకు దాసి గావలయు, నిదియ నా కిష్టంబు; దీనిన యిచ్చునది’ యనిన వృషపర్వుం డప్పు డక్కూఁతు రావించి, కన్యకాసహస్రంబుతో దేవయానికి దాసిగా నిచ్చి శుక్రునకు మనఃప్రియంబు సేసిన, శర్మిష్ఠయు నగ్గురువచనంబునఁ గన్యకాసహస్రంబుతో నిత్యంబును దేవయానిం గొలుచుచుండె; నంత నొక్కనాఁడు. | 153 |
| క. |
వనకేళీ కౌతుకమునఁ | జనియెను శర్మిష్ఠఁ దొట్టి సఖులెల్ల ముదం బునఁ గొలిచిరాఁగ విభవము | దన కమరఁగ దేవయాని తద్వనమునకున్. |
154 |
| వ. | ఇ ట్లరిగి యవ్వనంబునఁ గన్యకలుం దానును బుష్పాపచయంబు సేయుచు, విమలజలప్రవాహ విలసితం బైన యొక్కసెలయేటి కెలన, నవవికచ కుసుమ సుకుమార కోరక నికర భరిత సహకార కురవక వకు ళాశోక తమాల సాల చ్ఛాయాశీతల సికతాతలంబున నిష్టవినోదంబుల నున్న యవసరంబున. | 155 |
| సీ. |
అంగనాజనుల యుత్తుంగ సంగత కుచ | కుంకుమ చందన పంకములయు వారివ ధమ్మిల్లభారావకలిత ది | వ్యామోద నవపుష్పదామములయు వారివ ముఖ సకర్పూరతాంబూలాది | వాసిత సురభి నిశ్శ్వాసములయు వారివ పరిధాన చారుధూపములయు | విలసిత సౌరభావలులు దాల్చి |
|
| తే. |
యనిలుఁ డను దూత వోయి తోడ్కొనుచు వచ్చె | దేవయానిపాలికి మృగతృష్ణఁ జేసి కాననంబునఁ గ్రుమ్మరువాని వీరు | నతిపరిశ్రాంతుఁ డైన యయాతి నంత. |
156 |
| క. |
తరళనయనాబ్జదళములు | నెరయఁగఁ బై మున్న చల్లి నృపసుతుఁ బూజిం చిరి నవకుసుమమయాలం | కరణ విశేషముల నచటి కాంతలు ప్రీతిన్. |
157 |