| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - పంచమాశ్వాసము |
| వ. | ఇట్లు సర్వభూతసమ్మోహనంబయిన వసంతసమయంబునం బాండురాజు మదనసమ్మోహనమార్గణబందీకృత మానసుం డై మద్రరాజపుత్త్రి దైన మనోహరాకృతియందు మనంబు నిలిపి యున్నంత; నొక్కనాఁడు కుంతీదేవి బ్రాహ్మణభోజనంబు సేయించుచుండి మాద్రీరక్షణంబునం దేమఱియున్న యవసరంబున. | 140 |
| ఉ. |
చారుసువర్ణహాసినవచంపకభూషయు సిందువారము క్తా రమణీయయున్ వకుళదామవతంసయు నై యపూర్వ శృం గారవిలాసలీల యెసఁగం దనముందట నున్న మాద్రి నం భోరుహనేత్రఁ జూచి కురుపుంగవుఁ డంగజరాగమత్తుఁ డై. |
141 |
| క. |
కిందముశాపము డెందము | నం దలఁపక శాపభయమునన్ మాద్రి గడున్ వందురి వారింపఁగ బలి | మిం దత్సంభోగసుఖసమీహితుఁ డయ్యెన్. |
142 |
| వ. | దానం జేసి విగతజీవుం డైన యప్పాండురాజుం గౌఁగిలించుకొని మాద్రి యఱచుచున్న, దాని యాక్రందన ధ్వని విని వెఱచి కుంతీదేవి గొడుకులుం దానునుం బఱతెంచి పతియడుగులపయిం బడి యేడ్చుచున్న నెఱింగి, శతశృంగ నివాసులగు మునులెల్లం దెరలివచ్చి చూచి శోకవిస్మయాకులితచిత్తు లయి; రంతఁ గుంతీదేవి మాద్రి కి ట్లనియె. | 143 |
| ఉ. |
‘నా కెడ యిమ్ము, లెమ్ము, కురునాథుమనఃప్రియధర్మపత్ని నే నేకత మెట్టు లుండుదు? మహీపతితోడన పోదుఁ; బుత్త్రులం జేకొని పెన్పు; నా పసుపుఁ జేయుము’ నావుడు మాద్రి దద్దయున్ శోకపరీతచిత్త యగుచుం బృథ కి ట్లనియెం బ్రియంబునన్. |
144 |