| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - పంచమాశ్వాసము |
| క. |
తన సుతులు పాండు సుతు లని | మనమున భేదింప కతిసమంజసభావం బున నొక్క రూపకాఁ జే | కొని యుండెం బాండురాజుకొడుకులఁ బ్రీతిన్. |
162 |
| క. |
ధృతరాష్ట్రునెయ్యమున సం | తతవర్ధితు లగుచుఁ బాండుతనయులు వినయా న్వితులు కుమారక్రీడా | రతు లయి యొడఁగూడి ధార్తరాష్ట్రులతోడన్. |
163 |
| క. |
గిఱుపునెడ నేయునెడ వడిఁ | బఱచునెడం బెనఁగునెడ నపార బలంబుల్ మెఱయునెడ భీమునకు నం | దొఱుఁ గీడ్పడఁ దొడఁగి రుద్ధతులు రాజసుతుల్. |
164 |
| క. |
వదలక పెనఁగి పదుండ్రం | బదియేవుర నొక్కపెట్ట పట్టి ధరిత్రి జెదరఁ బడవైచి పవనజుఁ | డదయుండయి వీఁపు లొలియ నందఱ నీడ్చున్. |
165 |
| సీ. |
కూడి జలక్రీడ లాడుచోఁ గడఁగి యా | ధృతరాష్ట్రతనయుల నతులశక్తి లెక్కించియుఁ బదుండ్ర నొక్కొక్క భుజమున | నెక్కించుకొని, వారి యుక్కడంగఁ గ్రంచఱ నీరిలో ముంచుచు నెత్తుచుఁ | గారించి తీరంబు చేరఁ బెట్టుఁ; గోరి ఫలార్థు లై వారల యెక్కిన | మ్రాఁకుల మొదళుల వీఁకఁ బట్టి |
|
| ఆ. |
వడిఁ గదల్చుఁ బండ్లు దడఁబడువారల | తోన ధరణిమీఁదఁ దొరఁగుచుండ; నిట్టిపాట గాడ్పుపట్టిచే దుశ్శాస | నాదు లెల్ల బాధితాత్ము లైరి. |
166 |
| వ. | దాని సహింపనోపక యొక్కనాఁడు దుర్యోధనుండు శకుని దుశ్శాసనాదులతో విచారించి యి ట్లనియె. | 167 |
| పృథ్వీవృత్తము |
ఉపాంశువధఁ జేసి మధ్యము మదోద్ధతుం జంపి ని స్సపత్నముగ ధర్మనందను నశక్తు బంధించి యే నపాండవముగా సముద్రవలయాఖిలక్షోణి మ త్కృపాణపటుశక్తి నత్యధికకీర్తి నై యేలెదన్. |
168 |