పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - తృతీయాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకు దీర్ఘదర్శి మొదలగు మత్స్యముల తెఱం గెఱింగించుట (సం. 12-135-1)
వ. అని చెప్పి భీష్ముండు వెండియు నిట్లను ‘దీర్ఘదర్శియుఁ బ్రాప్త కాలజ్ఞుండును దీర్ఘ సూత్రుండును ననుమత్స్య ంబులు మూఁడు జలచర బహుళంబగు నొక్కయేటి మడువునఁ దమలోనం బొందుగలిగి యుండునవి; వేసవిసొచ్చిన దీర్ఘదర్శి దక్కటి రెంటిని గూడం బిలిచి. 185
క. ‘మడు వింకఁగఁ బాఱెడు; నీ | రెడ త్రెవ్విన నొండు సోటి కేఁగఁగ రా దె
ప్పుడు నింకని నీళ్ళులు గల | మడువునకుం బోవవలదె మన కిట్టి యెడన్‌?’
186
తే. అనినఁ బ్రాప్తకాలజ్ఞుఁ డిట్లనియె ‘నేది | ప్రాప్తమయ్యె నక్కార్యంబు భంగి నెఱిఁగి
యప్పటికిఁ దగునట్లు సేయంగవలయు | మానితోపాయవృత్తి నేమఱుట లేక.
187
వ. అనిన నయ్యిరుదెఱంగుల పలుకులు విని దీర్ఘసూత్రుం డిట్లనియె. 188
క. ‘జడనిధి చందంబున ని | మ్మడు వొప్పఁగ నిప్పు డేమి మాఁడెనె? యిమ్మై
నడిచిపడ రిత్త నెవ్వగ | లుడుగుఁడు; మఱి చూచికొంద మొయ్యన తఱితోన్‌.’
189
క. అనుటయు ‘నిది కర్జము గా’ | దని పల్కుచు దీర్ఘదర్శి అంబుస్రోతో
జనితాభయ మగు పథమునఁ | జని జొచ్చెం బెద్ద మడువు సమ్మదలీలన్‌.
190
వ. తక్కిన రెండును నంద నిలిచె; నిట్లు నిలిచిన యమ్మత్స్య ద్వయంబునకు భయంబు జనియింపం గతిపయది వసంబులకు. 191
క. పాఱెడు నీ రెడ త్రెవ్వఁగఁ | దాఱ బెడిద మైన యెండ దనుకఁగ నివురం
బాఱె మడు; వంత వేడుక | కాఱులు జాలరులు సొచ్చి క్రందుకొనంగన్‌.
192
క. వెరవున నూఁతల నెత్తెలఁ | గరముల మత్స్యములఁ బట్టి కడు సంతసముం
బొరయుచుఁ ద్రాళ్ళం గ్రువ్వఁగఁ | గర మూహించి మదిఁ బ్రాప్తకాలజ్ఞుండున్‌.
193
క. ‘ఇందొక త్రాడు గఱచి యే | నొందంగా గ్రుచ్చినట్ల యుండెద; వీ రీ
క్రందుకొనుట మానంగ న మందత | నది యెడల విడిచి మడువు దఱిసెదన్‌.’
194
క. అని యొక గుదిమీల నడుమ | నెనయంగాఁ దూఱి కఱచి యిరుదౌడలఁ ద్రా
డొనరంగ బట్టుకొని గ్రు | చ్చిన చందము దోఁప మూర్ఛఁ జెందిన భంగిన్‌.
195
వ. ఉన్నంత వేఁట దీఱి యగ్గుదిగల యతండు. 196
క. తెలినీట రొంపివోవం | దొలుచు నెడం ద్రాడు విడిచి దురితంబునకుం
దొలఁగి పొరదప్పి యందొక | జలచర మున్న యెడకేఁగె సంభ్రాంతగతిన్‌.
197
క. ముట్టఁబడి దీర్ఘసూత్రుం డిట్ట | ట్టరుగఁగ నుపాయ మేది యొకనిచేఁ
బట్టువడెఁ దనదు డెందము | పట్టు వదలి చకిత వికల భావేంద్రియుఁడై.
198
క. విను దౌదవ్వులఁ గార్యము | గనికొని వలయుపని మున్న కావింపఁగ నే
రనిజడుఁడు దీర్ఘసూత్రుం | డను నమ్మత్స్య ంబు భంగి నాపద నొందున్‌.
199
తే. అప్పటికిఁ దోఁచినట్టులు దప్పకుండ | ననువుతో ధృతి గల్గి కార్యంబు నడపు
నతఁడు ప్రాప్తకాలజ్ఞాఖ్యు నట్లపోలెఁ | బరమ సంశయ మయ్యెడు బ్రదుకు గాంచు.
200
క. ధుర్యత ననాగతము లగు | కార్యము లూహించి పని తగం జేయు నయా
చార్యుఁడు సౌఖ్యముఁ బొరయును | నార్యస్థితి దీర్ఘదర్శి యను మీను క్రియన్‌.’
201
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )