| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
‘దేవ! నీదగు దివ్యదేహంబునందు సు | రాసురగంధర్వు లాది గాఁగఁ గల దేవమౌనులుఁ గమలాసనుండును | సచరాచరం బైన జగము నాకు దోఁచె; మొగంబులు దోర్దండములును బా | దములుఁ గన్నులు ననేకములు గంటి, మకుటాది భూషణనికరంబుఁ జక్రగ | దాద్యాయుధములు మాల్యాంబరములుఁ |
|
| ఆ. |
బెక్కు గానవచ్చె; నక్కజమై యిది | నడుము మొదలు తుది యనంగ రాదు; తేజ మప్రమేయదేదీప్యమాన ని | ర్వికృతి మహిమ దుర్నిరీక్ష మయ్యె. |
211 |
| క. |
జగములకు నాది కారణ | మగు పరమజ్ఞేయ మీవ యని కనియెద భూ గగనదిగంతర మంతయు | నగణితమూర్తీ! భవన్మయం బై తోఁచెన్. |
212 |
| వ. | చంద్రార్కులు లోచనంబులు గాఁ గలిగి దంష్ట్రాకరాళంబులైన నీ ముఖంబులు ప్రజ్వరిల్లుచున్నయవి; నిన్ను రుద్రాదిత్య మరుద్వసువులు ప్రవేశించెదరు; సంఘంబు లై వచ్చి మహామునులు ప్రస్తుతించెదరు సిద్ధసాధ్యవియచ్చరులు వెఱఁగంది వీక్షించెద; రిట్లు దీప్తోగ్రంబగు భవదీయ దివ్యరూపంబు గనుంగొని నాకు విభ్రాంతి వొడమి ధృతి దూలి సుఖంబు వడయ నేరక చిక్కువడి యున్నవాఁడఁ; బ్రసన్నుండ వగుము రక్షింపుము. | 213 |
| చ. |
అనలజ్వాలలు పర్వు నీ ముఖములం దా ధార్తరాష్ట్రవ్రజం బును భీష్మాదులు నిద్దెసం గలుగు నీ భూపాలలోకంబు గ్ర క్కున నొక్కుమ్మడి వచ్చి చొచ్చెదరు; నాకుం జెప్పవే యెవ్వరో యని శంకించెద నిన్ను భూరికరుణాయత్తైకచిత్తుండవై.’ |
214 |
| వ. | అనవుడు నప్పరమేశ్వరుం ‘డేను లోకక్షయకర్త యగు కాలుండ; నిచ్చో జనసమాజ సమాహరణంబునకుఁ బ్రవృత్తుండ నైతి; నీవు సంపవలయు, నని లే; దీ గురుభీష్మాదు లెట్లును లేకుండువార; నాచేతం జచ్చిన వీరి నెల్లను జయించినవాఁడ వగుటకు నిమిత్తమాత్రమ్ము గమ్ము; లెమ్ము! రాజ్యమ్ము గైకొను!’ మనిన విని వడవడ వడంకుచుం జేతులు మొగిడ్చి గద్గదకంఠంబుతో గాండీవి యిట్లనియె. | 215 |
| తే. |
అంబు పవమాన సూర్య చంద్రానలాది | వివిధ తత్త్వంబులును నీవ; విశ్వలోక సంప్రవర్తనకరుఁడవు శాశ్వతుండ | వచ్యుతుండవు పుండరీకాక్ష! నీవు. |
216 |
| క. |
నిను నెఱుఁగకుండి యాదవుఁ | డని సఖుఁడని మేనబావ యని యే సహభో జనములు సల్లాపంబులు | నొనరించుచు మేలమాడుచుండుదు నెపుడున్. |
217 |
| తే. |
మఱియుఁ బెక్కులు లోకసామాన్యభంగు | లాచరించితి నీదెస, నంతవట్టుఁ దల్లిదండ్రులు ప్రజలకుఁ దప్పుదారు | లెల్ల సైరించునట్లు సహింపవలయు.’ |
218 |
| వ. | అని సంప్రార్థనంబు సేసి పార్థుండు వెండియు నిట్లను ‘నదృష్టపూర్వం బైన భవదీయరూపంబు గనుంగొనం బడయుటం బ్రమోదంబును, బిట్టు చూచిన వెక్కసంబును, హృదయవ్యథయునుం బుట్టియున్నయది; నీతొంటి సౌమ్యాకారంబు గైకొని నిలిచి నాకు నాహ్లాదంబు సేయుము.’ | 219 |
| చ. |
అనుడు దయార్ద్రచిత్తుఁ డగు నప్పరమేశ్వరుఁ డక్కిరీటి కి ట్లనుఁ ‘దపమాచరించి నిగమాధ్యయనం బొనరించి కానరా దనఘ! మదీయదివ్యపరమాకృతి; పేర్చిన ఏకభక్తి భా వనమునఁ దోఁచు; దీని జనవర్గము గానదు; నీక చూపితిన్. |
220 |
| వ. | నీకు హృదయవ్యథం బొంద నేల? మూఢత్వంబు విడిచి విగతభయుండ వై సంప్రీతచేతస్కుండవు గ’ మ్మని చెప్పి పూర్వప్రకారరూపంబు దాల్చి నిల్చినం గనుంగొని , కౌంతేయుం డా సౌమ్యరూపంబు సూచి ‘సచేతనత్వంబు నొందితిఁ బ్రకృతిస్థుండ నైతి, నని పలుకుటయు, వాసుదేవుండు ‘మత్కర్మపరుండును మద్భక్తుండును నైనవానికి నన్నుఁ బడయవచ్చు’ నని యతని నాశ్వాసించి. | 221 |
| తే. |
అతఁడు మఱియును బ్రహ్మవిద్యాన్వయమునఁ | దనకు సందిగ్ధ మైనట్టి దాని నెల్ల నడుగఁగా నమ్మహాత్ముఁ డత్యంతకరుణఁ | దెలియఁ జెప్పుచు హృదయసంచలత మాన్చె. |
222 |
| వ. | ఇవ్విధంబునఁ బార్థున కుపనిషదర్థజాతం బవగతంబు సేసి, మనసుకసటు వాపి, వివేకంబునకుం జేవ గలిగించి కృష్ణుం ‘డీ గుహ్యతరజ్ఞానం బుపదేశించితి; దీని నెఱింగికొని నీ కెట్లు సూడం బోలె నట్లు ప్రవర్తింపు మను పలుకు పలికి, యింతకంటెం బరమరహస్యం బొక్కటి సెప్పెద విను’ మని యతని కిట్లనియె. | 223 |
| తే. |
‘క్రందుకొను సర్వధర్మవికల్పములను | నెడల విడిచి దృఢంబుగ నే నొకండ శరణముగ నాశ్రయింపుము సకలదురిత | ములకుఁ దొలఁగింతు నిన్నుఁ బ్రమోద మొంద. |
224 |
| వ. | ఇప్పరమోపాయంబు. | 225 |
| క. |
నియతియుఁ దపమును నా దెస | భయభక్తులు గలిగి నాకు భక్తుం డై ని శ్చయనిపుణుఁ డయినవానికిఁ | బ్రియమున నెఱిఁగింపు వలదు పెఱవారలకున్.’ |
226 |
| వ. | అని వెండియుఁ బుండరీకాక్షుండు ‘నాచెప్పిన యది లెస్సగా నాకర్ణించితే? నీయజ్ఞాన సమ్మోహం బంతయుం బాసెనే?’ యనవుడు నర్జునుండు. | 227 |
| ఉ. |
‘మోహ తమంబు వాసెఁ; దుది ముట్టిన నీదు ప్రపత్తి వీత సం దేహుఁడనైతి; గాఢపరిదీప్త మహాకృతిఁ గాంచి బోధ స న్నాహనిరామయస్థిరమనస్స్థితిఁ బొందితి; సర్వలోక ని ర్వాహవినోద! నీ విమల వాక్యము చొప్పున నెల్లఁ జేసెదన్.’ |
228 |
| వ. | అని పలికి యప్పరమపురుషునకు సభక్తిక సాష్టాంగ దండ ప్రణామంబు సేసి పార్థుండు గృతార్థుండై ధృతాయుధుం డయ్యె’ ననిచెప్పి సంజయుండు వెండియు నిట్లనుం ‘గురుకులేశ్వరా! యేను మునిగణేశ్వరుండైన పారాశర్యు కారుణ్యంబునఁ గృష్ణార్జునుల యద్భుతపుణ్యసంవాదంబు వినుటకు మహాయోగీంద్ర హృదయానందకరుం డైన యద్దేవుని దివ్యరూపంబు గనుటకుం బాత్రభూతుండ నైతి; నమ్మహాత్ముండు దన మధురవాక్యంబుల నుపదేశింప నత్యంతగుహ్యం బైన యోగప్రకారంబు విశదంబుగా ననుసంధించితి; నమ్మహానుభావుల సంభాషణములు నవ్విశ్వరూపుని మహనీయాకారంబునుం దలంచి తలంచి యచ్చెరు వందుచుఁ బ్రియం బందుచు నుండుదు’ నని మఱియును. | 229 |
| తే. |
‘అధిప! యోగీశ్వరేశ్వరుం డైన కృష్ణుఁ | డును ధనుర్ధరవర్యుఁ డర్జునుఁడు నెచట నిలిచి రచ్చట విజయంబు నీతి సిరియు | భూతి నిత్యంబు లగు; నిది నా తలంపు.’ |
230 |
| వ. | అనిన విని ధృతరాష్ట్రుం డిట్లనియె. | 231 |
| క. |
‘ఇవ్విధమున నాయిత మై | క్రొ వ్వెలరారంగ నిలిచి కురుపాండవులం దెవ్వరు మును గడఁగిరి? రణ | మెవ్విధి నూలుకొని చెల్లె? నెఱిఁగింపు తగన్.’ |
232 |