| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అనుటయు నా సూతనందనుం డతని కిట్లను సూర్యోదయ సమయంబునఁ బాండుసూనులు సేనా సమేతులై వెడలి మోహరించునప్పుడు ముందట శిఖండిని నిలిపి యతనికెలంకుల భీమార్జునులును, వెనుక నభిమన్యు ద్రౌపదేయులును వారియిరువంకలం జేకితాన శైనేయులును, నట పిఱుంద ధృష్టద్యుమ్నాది పాంచాల కుమారుల మున్నిడుకొని కవల నుభయపార్శ్వంబులం బెట్టికొని, యుధిష్ఠిరుండును వీరి సూరెలం బొదివికొని విరాటద్రుపదముఖ్యులగు పృథ్వీపతులును గేకయపంచక ధృష్టకేతులును నిలిచి రిత్తెఱంగున గట్టి మోహరంబు దీర్చుకొని నడచి రంతకు మున్న మనవారును వెడలి భీష్ముం డగ్ర భాగంబున నుల్లసిల్ల నీ కుమారు లమ్మహాత్ముం బరివేష్టింపఁ గుంభసంభవతత్సంభవులుం దక్షిణవామభాగంబులను, గృపకృతవర్మ భగదత్తపురస్సరుండై కురురాజు మధ్యభాగంబునను, బృహద్బల కాంభోజ ముఖ్యు లైన మహీపతు లమ్మనుజేంద్రు చుట్టును, ద్రిగర్తు లపరభాగంబునను, బన్ని బలుమొన యమర్చి కొని త్రోచి నడచి రి ట్లిరువాఁగునుం గవిసి వివిధతూర్యస్వనంబులు నింగిముట్ట నొండొంటిం దాఁకిన. | 316 |
| క. |
సమరం బప్పుడు దనుజులు | నమరులునుం బెనఁగుచందమై తోఁపఁగ భూ రమణ! విను మేమిసెప్పుదు? | జముపురమున నగ్గలంపుసందడి యయ్యెన్. |
317 |
| వ. | అట్టియెడ. | 318 |
| మ. |
కవ లుద్దామపరాక్రమస్ఫురణమైఁ గౌరవ్యసైన్యంబు సి క్కువడంజేయఁగ భీమపార్థులును గోకొమ్మంచు నొక్కుమ్మడిం గవియం బాండవసేన యుబ్బి యడరంగాఁ జూచి కల్పాంతభై రవభీమాకృతి నేచి భీష్ముఁడు శరవ్రాతంబు గుప్పించినన్. |
319 |
| ఆ. |
కాలుకాలు పెనఁగి కాలుబలంబులు | నొడ్డగెడవుగా రథోత్కరంబు మ్రొగ్గతిలఁగ గుఱ్ఱములు నేల యద్రువ మా | తంగఘటలు గూలెఁ దత్‌క్షణంబ. |
320 |
| క. |
కనుఁగొని శిఖండి వెస మా | ర్కొని భీష్ముని నేసె మూఁడు క్రూరాస్త్రములం గని యతఁడు మరల చూడ క | తని నుద్దేశించి పలికె దరహాసముతోన్. |
321 |
| ఉ. |
‘ఎవ్వత నేని ధాత సృజియించెఁ దగన్ మగవానిఁ గాఁగ నా కొవ్వమిఁ జేసి యట్టి నిను నుగ్మలి నేయఁగ నొల్ల నాపయిం గ్రొవ్వెసలార నీవు శరకోటి వెసం బరగించితేని నే నవ్వుదుఁ గాని కోపము మనంబునఁ బుట్టదు సూ శిఖండినీ!’ |
322 |
| వ. | అనినం గోపించి శిఖండియు నతని కిట్లనియె. | 323 |
| క. |
‘గెలిచితి రాజుల నెల్లను | బలియుండగు పరశురాముప్రతివీరుఁడవై యలవుకలిమి నెఱపిన | నీ చలము బలము నాకుఁ జూపఁ జాలవు కంటే? |
324 |
| క. |
ఏయు మొకనేర్పుమై ని | ట్లేయక క్రీడించి యరుగు మెట్లయినను మ త్సాయకముల నినుఁ గూల్చెదఁ | జూ యెవ్వత నైతి నేమి సూచెదు? నన్నున్. |
325 |
| క. |
నేఁ డెమ్మెయి నైనను నీ | పోఁడిమిఁ సెడఁ దోన తవిలి పొదువుదు నిన్నున్ వాఁడిమగఁ డనుట యుడుపుదు | వేఁడిమి సొం పెసఁగ నస్త్రవిద్య మెఱయుదున్. |
326 |
| వ. | అనుచు మఱియు నైదమ్ము లేసె నప్పలుకులు విని ఫల్గునుం డాత్మగతంబున నేఁడు శిఖండి చందంబు వింత యయియున్న యది. నదీనందనుండు సమయుటకు సమయం బైన దైవదత్తోత్సాహంబున నేచి పలికెం గావలయు’నని యూహించి యుపోద్బలంబుగా నతని కిట్లనియె. | 327 |