పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము
అర్జునుఁడు భగదత్తునిదెస రథంబు దోలు మని కృష్ణునితోఁ జెప్పుట (సం. 7-26-1)
క. అంతకు మును భగదత్తుని | దంతి యసమ సమరకేళిఁ దాఁ గని హరితోఁ
గుంతీసుతుఁ డిట్లను ‘మన | మెంతయు వెస బలములోని కేఁగఁగ వలయున్‌.
335
వ. అది యెట్లంటేని. 336
చ. బిరుదు జితశ్రమంబు బలభేదనశాలి మహాస్త్ర శస్త్ర పా
తరయము సైఁపనోపు భగదత్తుని యేనుఁగు; దాని కోల్తలం
దిరుగక పోర నెవ్వరికిఁ దీఱదు; నీవును నేను లేనిచో
భరమగు నేఁడు రాజునకుఁ బావనికిం దలఁకొందెడున్‌ మదిన్‌.’
337
ఆ. అనిన నట్లకాక యని శౌరి యరదంబు | ద్రిప్పి యాత్మసేన దిక్కువోవ
నిచ్చుటయును వెనుక నెయిది సంశప్తకు | లార్చిపేర్చి కురిసి రస్త్రసమితి.
338
వ. ఇట్లు చతుర్దశసహస్ర రథిక ముఖ్యులు బెట్టు ముట్టిన. 339
క. ‘బలములఁ గావఁగఁ జనుటయు | నలవు మెఱయ మగిడి వీరి నడఁగించుటయున్‌
వలయు పనులయం దిప్పుడు | దలఁకొని యెద్దానిఁ జేయఁ దగవో నాకున్‌.’
340
వ. అని వితర్కించి వివ్వచ్చుండు సంశప్తక వధంబ యుచితంబుగా నిశ్చయించి, మరలి గాండీవ గుణక్వణ మేదుర రోదసీకుహరుండును,దేవదత్త ధ్వాన విదళిత దశదిశా సందోహుండునునై దివ్యబాణంబులు పరఁగించినం గేత నాతపత్ర చామర వ్యజనంబులును, భేరీ శంఖ కాహళ మృదంగంబులును, యుగాక్ష రథాంగ కూబరంబు లును, దంతశుండాల కుంభవంశ దండంబులును, ఖురస్కంధ వాలంబులును, ధనుశ్శర ముసల ముద్గర, క్షురి కాకుంతంబులును, దనుత్రాణ కంకట మస్తక చ్ఛేదంబులును, మకుట కేయూర హార కంకణాంగు ళీయంబులును, శిరః కరవక్షః కుక్షి కటి చరణంబులును, దునియలుం బఱియలుం దుముళ్ళుం బొళ్ళు నైరాలిన నన్నేల ఘోరంబును, నభిరామంబునునై యుండె; సర్వభూతంబులును బీభత్సుం బ్రశంసించెఁ; గంసారి విస్మయ ప్రమదమగ్న మానసుండయి కిరీటిం గరతలంబున నప్పళించి యగ్గించె; నివ్విధంబుననవ్వీర రథికులం బిలుకు మార్చి పేర్చి రథాంగపాణిం జూచి ‘రథం బింక రయంబున నక్కడకు నడపు’ మనుటయు. 341
ఆ. ఆతఁ డట్ల చేయ నరవాయి గొనక సు | శర్మ దాను ననుజచయముఁ బెలుచ
నెయిది ‘పార్థ పార్థ యిట్లు వోఁదగునె యే | మనికిఁ బిలువఁ బిలువ’ ననిన నతఁడు.
342
క. ‘పిలిచిన మరలమి దగ ద | బ్బలములఁ గాచుటయు వలయు; పని; యైనది; నీ
వలసిన విధంబు సేసెదఁ | దలఁకొను మొక తెఱఁగు దైత్యదర్పధ్వంసీ!’
343
చ. అనుచు మురారిఁ జూచుటయు నాతఁడు దేరు మరల్ప మోమునం
గినుక మునుంగు న వ్వొలయఁ గ్రీడి త్రిగర్తుని చాపదండకే
తనములు ద్రుంచి పైపడిన తమ్ముల నంతకు ప్రోలి కన్చి యా
తని నవలీల నొంచిన నతండు వెసంబడి మూర్ఛవోవుడున్‌.
344
వ. మగిడి యట నిరూపించి నారాయణు నుద్దేశించి. 345
సీ. ‘పాఱెడు మన సేన పరఁగెడుఁ బెంధూళి | నభము గోలాహల క్షుభిత మయ్యె
భగదత్తు శుండాల మెగచుచు నున్నది | పఱపుము వెస దానిపై రథంబు’
నావుడు నతఁడు మహావేగమున రథ్య | ములఁ దోలఁగఁ గిరీటి యలవుఁ జలము
మెఱయంగ నీమొన మెఱుఁగు వాలమ్ముల | నఱుము సేయుచు సింహనాదమునకుఁ
 
తే. బ్రాపులై దేవదత్తంబు రవము గుణము | రావమును దిక్తటంబుల వ్రయ్యఁ జేయ
వచ్చి వివ్వచ్చుఁ డడ్డంబు సొచ్చె వీఁకఁ | జండచేష్టితోద్దండ వేదండమునకు.
346
క. అన విని ధృతరాష్ట్రుం డి | ట్లను సంజయుతోడ ‘భీషణాటోపత న
ర్జునుఁ డి ట్లెయిదిన భగద | త్తుని కతనికి నేమి భంగి దురమయ్యె నొకో!’
347
ఉ. నావుడు నాతఁ డా ధరణినాథున కిట్లను‘నట్లు దాఁకినం
జేవ దలిర్ప విక్రమవిశృంఖలుఁడై భగదత్తుఁ డుగ్ర బా
ణావలిఁ బార్థుపైఁ బఱపె; నన్నియు నవ్వుచుఁ ద్రుంచివైచి య
ద్దేవసముండు నొంచె దృఢ దీప్తశరంబుల దంతి నాతనిన్‌.
348
తే. అలుఁగుటమ్ములు దాఁకిన నలిగి భద్ర | కుంభి రౌద్రంబు సొంపారఁ గొలిపె నతఁడు
వారి సేనల గోపికావరుఁడు నరుఁడు | దెగిరి తెగి రను పలుకుల దిగులు వుట్ట.
349
క. బలువిడిఁ గరి గవియుఁడు వెసఁ | దొలఁగించె రథంబు వెరవుతో హరి యదియి
ట్టలమగు రయమునఁ జని త | ద్బలము బడల్పడఁగఁ జేసెఁ బార్థివముఖ్యా!
350
క. హరి నేమియు నననేరక | కరిదెసఁ గనుఁగొనుచు నవుడు గఱచుచుఁ ‘బో ని
మ్మరద’మని పలికెఁ గవ్వడి | హరులను సమ్ముఖము సేసె నతఁడుఁ గరటికిన్‌.
351
క. శౌరి మెయిని భగదత్తుఁడు | నారసములు నినిచి యేసె; నరుఁ డల్గి మహో
దారోద్ధతిఁ దచ్చాపవి | దారణ మొనరించి గ్రుచ్చెఁ దనువునఁ దూపుల్‌.
352
సీ. కోపంబు గదిరి ప్రాగ్జ్యోతిషపతి చతు | ర్దశ తోమరము లింద్రతనయు మీఁద
నడరించుటయు, నవి పొడిసేసి క్రీడి యే | నుంగు పక్కెర చిఱునుగ్గు సేయ
నది గప్పియున్న మేఘావలి విచ్చిన | కొండ చందంబున నుండె; శక్తి
గొని భగదత్తుండు దనుజభంజను వైవ | నడుమ ముత్తునియగా నఱకెఁ బార్థుఁ;
 
తే. డాతపత్రంబు దునిమిన నతని మకుట | మతఁడు ఘన తోమరంబున నగలఁ జేయ
మెచ్చుఁ గినుకయుఁ బొడమ వివ్వచ్చుఁ డుగ్ర | విశిఖసప్తతిఁ జొనిపె నవ్వీరుమేన.
353
మ. రభసోదగ్రతఁ బూన్చి దీప్తు లడరం బ్రాగ్జ్యోతిషాధీశ్వరుం
డభిమంత్రించి నిజాంకుశంబు దివిజేంద్రాపత్యవక్షంబు సూ
చి భుజోల్లాస విభాసియై పెలుచ వైచెం దద్బలం బెల్ల భూ
రి భయోద్రేక తరంగితం బగుచు ఘూర్ణిల్లంగ రౌద్రాకృతిన్‌.
354
ఉ. అప్పుడు శౌరి పార్థునకు నడ్డముగాఁ దన మే నమర్చి ను
న్గ ప్పెసలారు పేరురమునం ధరియించిన నమ్మహాస్త్ర మం
దొప్పె నవారుణాంబుజ కృతోజ్జ్వల మాలికయై చిరస్థితిం
జొప్పడి నూతనాభ్రతల శోభితమైన మెఱుంగు చాడ్పునన్‌.
355
చ. కనుఁగొని ఫల్గునుండు ‘మురఘస్మర! యి ట్లగునయ్య సొంపు నొం
దిన కరుణా విశేషమునఁ దేరికి సారథి వైతి గాక యే
పనులును బూని చేయు టిది పాడియె? తేజము నీవు దప్పఁ జూ
చినఁ జెడదే? ననుం జులుకఁ జేసితి మాటలు వేయు నేటికిన్‌?
356
వ. అని దూఱినం గృష్ణుండు ‘దొల్లి భూమిదేవి గామించి యోగనిద్రా సమయావసాన సుప్రబుద్ధుండై యున్న విష్ణుకడకుం జనుటయు, నతండు తత్సంగతిం బ్రీతుండై యన్నాతికి వరంబిచ్చుటయు, నవ్వరంబున నవ్వెలంది యం దుదయించిన నరకునకు వైష్ణవాస్త్రంబు విధేయం బగుటయు, నది భగదత్తాయత్తంబై యునికియుం, దద్ఘోర సాధనంబు దనకుఁ దక్క నొరులకు నోర్వరామియు నెఱింగించి, యిది యట్లకాక దీన నేమి యని మఱియుం దగు మాటలం గిరీటి ననునయించి విరోధిం జూపి వీఁ డిప్పరమసాధనంబు వృథయగుటం జేసి వెఱంగు పడియున్నవాఁడు ; వీని తండ్రిని నేను దెగఁజూచిన ట్లీ క్రూరకర్మునిఁ బిలుకు మార్పు మనినఁ గొండొకతేఱి యాతండు గాండీవ గుణంబు సారించి దృఢముష్టి నేయుటయు. 357
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )