పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ప్రథమాశ్వాసము
దుర్యోధనుఁడు గర్ణునకు సర్వసేనాధిపత్యంబు గట్టుట
వ. నన్ను సర్వసైన్యాధిపత్యంబునకుఁ బట్టంబు గట్టు’ మనవుడుఁ బొంగి రారాజు దగు రాజులుం దానును శాత కుంభకుంభంబులం బవిత్రజలంబులు దెప్పించి మహనీయమణి కుసుమౌషధిగంధాక్షత మంత్రకలనం బాచరించి సమున్నతౌదుంబరపీఠంబునం బరమాస్తరణం బొనర్చి యంగపతి నందు నిలిపి పుణ్యాహ ఘోషంబులుఁ దూర్యనినదంబులు వందిజనస్తుతులును జెలంగ నభిషేకించి యలంకరించి పట్టంబు గట్టిన నతండు భూసురోత్తములకు నర్థిజనంబులకును వివిధార్థంబులు దానత్యాగరూపంబున నొసంగుచు వెలింగె నప్పు డుబ్బిన శూరయోధుల జయ జయ శబ్దంబులును భూపతుల యభినందన వాక్యంబులును గృష్ణ సమేతు లగు పాండవుల గెలువుమని దీవన లిచ్చు మాగధుల యెలుంగులును నింగిముట్ట నవోదితుండైన భానుండునుం బోలె శోభిల్లు నా కర్ణుండు సముదీర్ణుండై య క్కురుపతి యాననం బాలోకించి. 56
తే. ‘బంధు మిత్ర యుతంబుగఁ బార్థు రూపు | మాపి యే నిత్తు నీకు సామ్రాజ్యలక్ష్మి
ధాత్రిఁ బాలింపు సుస్థితిఁ బుత్త్ర పౌత్త్ర | గాఢభోగార్హమగునట్లు గాఁగ నధిప!
57
క. విను సత్య ధర్మ రతుఁ డగు | మనుజునకుం గార్యసిద్ధి మసలక యగు చా
డ్పున శౌర్య బాహువిక్రమ | ఘనుఁడగు నా కాజి జయము గలుగుం జులుకన్‌’
58
వ. అని పలికె నిత్తెఱంగున రాధేయు సర్వ సైన్యముఖ్యుం జేసి యతని మందిరంబునకు మహావిభవ సమేతంబుగాఁ బుచ్చి సమస్త పరిజనంబులను నిజనివాసంబులకుఁ బోవం బనిచి సంతోషం బంతరంగంబు నిండి వదనంబున వెల్లిగొన నీ కొడు కభ్యంతరావాసంబున కరిగె. రాత్రి యే నిట వచ్చి ద్రోణు వృత్తాంతం బంతయు నీకుం జెప్పి నీ వనుప మగిడి చని సూర్యోదయ సమయంబున మన శిబిరంబు ప్రవేశించితి న య్యవసరంబున. 59
సీ. తళతళ మనియెడు దంతప్రభలతోడ | ఘనకేతువున హస్తి కక్ష్య మెఱయ
హంసవర్ణములైన హయముల పటుగతి | నర్కప్రభం బగు నరదమొప్ప
దీప్తకాంచనరసలిప్తమై చెలువొందు | సజ్యకార్ముకము హస్తమున వెలుఁగ
వీటికి సమర సమాటోపమొదవ నా | భీలశంఖము దనమ్రోల మ్రోయ
 
తే. రణసముత్సాహలక్ష్మి వక్త్రమున వింత | చెన్ను వెలయింప నాప్తులు సేరి రెండు
పక్కియల యందు బవరంపుఁ బలుకు లెసఁగ | నడవ సొంపారి కర్ణుండు వెడలె నధిప!
60
వ. అతండు పడవాళ్ళం బనిచి వెడల నియమించిన నెల్ల దొరలును దురంబునకు వెడలి రట్లు సకల బలంబులు కలనికి నడవం దొడంగిన. 61
సీ. తురగ రింఖా ముఖోద్ధూత ధూళీపట | లములు నల్దిక్కు లలంకరించె
మాతంగ కటిగళన్మదజల బహుల ప్ర | వాహ విలాసంబు వాని నడఁచె
బహువిధవాదిత్ర భైరవారావంబు | పె ల్లంబరము పిక్కటిల్లఁ జేసె
శింజినీటంకార సింహనాదంబుల | పెక్కువ యామ్రోఁతఁ బిలుచుకొనియె
 
ఆ. రథిక భూషణముల రశ్ములఁ గేతన | చ్ఛత్త్ర చామరోపసక్త మణుల
రుచుల సుభటహేతి రోచులఁ బవలింటి | దివియచందమయ్యె దినకరుండు.
62
వ. అట్టియెడ. 63
క. జనములు భీష్మద్రోణులు | సనిన వగలు డిగ్గఁ ద్రావి సంతోషము నె
క్కొనియెడు మనములతోఁ గ | ర్ణునిఁ గనుఁగొని రతివికాసరుచిరనయనులై.
64
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )