పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము
ద్రుపదుఁడు తన పురోహితుని దుర్యోధనుకడకు దూతగాఁ బంపుట (సం. 5-5-28)
వ. అట్టి సమయంబున నజాతశత్రు ననుమతి వడసి పాంచాలపతి వయోజ్ఞానవృద్ధుండైన తన పురోహితుం గురుపతిపాలికిఁ బుచ్చువాఁడై యతని రావించి. 52
క. ‘హితుఁడవు, మతిమంతుండవు, | చతుర వచన కోవిదుఁడవు, సమయజ్ఞుఁడ, వు
న్నత వంశవర్ధనుఁడ, విం | గిత వేదివి, నెచ్చెలివి, సుకృతి వ ట్లగుటన్‌.
53
తే. నాకుఁ గర్తవ్య మగుపని నీకుఁ జేయఁ | దగవుగావున నెల్లవిధములఁ బూని
పాండవార్థంబు ధృతరాష్ట్రుపాలి కరిగి | నేర్పువాటించి కార్యంబు దీర్పవలయు.’
54
వ. అని చెప్పి యొడంబఱిచి యతనితో మఱియు నిట్లనియె. 55
క. ‘విను కొడుకు గొన్న వేఁదుఱ | కొని కొట్టిన తిండికాఁడు కుటిలుం డతఁ; డా
జనపతి చందము, ధర్మజు | ననుపమ శీలంబు నెఱుఁగు; దది యట్లుండెన్‌.
56
తే. పుడమి పాలు పాండవులకు నడుగఁబోయి, | నీవు ధృతరాష్ట్రుతో ధర్మ నిష్ఠమైన
యుచిత మాడిన, నందుఁ బోటొడ్డియున్న | దొరల భృత్యుల మనములు దిరుగఁబడవె?
57
క. గురుభీష్మాదుల మనములు | దురమునకుం జొరకయుండ దుర్యోధనుఁ డా
తురుఁడై యొడఁబఱుపఁగ ని | ప్పరుసున నెరవైన ఱిచ్చవడు బల మెల్లన్‌.
58
ఉ. పాండుతనూభవుల్‌ వడిన పాటులు బంధులకెల్లఁ దెల్పుచున్‌,
బండిత వృద్ధ సజ్జనుల పాలికిఁబోయి కులోచితంబు గా
కుండుట సూపి చెప్పుచుఁ, బ్రియోక్తులఁ దక్కటివారి ‘నిట్లు మే
లొండొకచంద మొప్ప’ దని యుల్లములం దలపోయఁ జేయుచున్‌.
59
వ. మఱియు సమస్తజనంబుల మనంబుల నిక్కడ వ్రాలునట్టి యుపాయంబు లెన్నిగల వన్నియు నయ్యై తగవులమై నాచరించుచుఁజరియించునది; యిచ్చట విరాటు కొలువు కూటంబునం బుట్టిన కృష్ణాదుల సంవాదంబు తెఱంగును మన యెఱింగినయదియె; తదనురూపంబుగాఁ బలికి పాండవులకుఁ దేజోలాభంబు గావించుట కర్తవ్యంబు; నీవు కరినగరంబున వసియించి ధృతరాష్ట్ర ధార్తరాష్ట్ర గాంగేయ విదుర గురుకృపాదుల కడ కరిగి నానాఁటికి వారి వారి చిత్తంబుల తెఱంగెఱింగి ప్రవర్తింపుము; దైవగతింజేసి నీయొడ్డిన సూత్రంబునకు సుయోధనుం డొడంబడియెనేనియు నదియ సకల జనసమ్మతంబయినవిధంబగు; దాన నజాతశత్రుండును బ్రీతుండగుఁ బోయి ర’మ్మని నిశ్చయంబు సేసిన, నమ్మహీసురవరుండు. 60
క. మును పాంచాలవిభుని వీ | డ్కొని ధర్మజు భీము నరు నకులు సహదేవుం
గని యనుమతుఁడై యందఱు | ననుపఁగ మన్ననలు వడసి యరిగెం బ్రీతిన్‌.
61
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )