| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము |
| తే. |
‘వినుము సంజయ! ధృతరాష్ట్ర విభుని పెద్ద | కొలువునందుఁ దత్పుత్త్రులు, గురుఁడుఁ, గృపుఁడు, నాపగానందనుఁడు మొదలైన సకల | జనులు వినుచుండఁగా నిట్టు లనుము నీవు. |
124 |
| ఆ. |
అయ్యజాతశత్రుఁ డలుగుట నీళ్ళుల | నగ్ని పుట్టినట్టి దయ్యె; మీకు నార్ప వెరవు లేదు; నేర్పుమై నింకఁ గా | వింపవలయు పనులు వినుఁడు మీరు. |
125 |
| వ. | అవి యెవ్వి యంటేని. | 126 |
| సీ. |
కలయట్టి వివిధార్థములు నశేషంబుగఁ | దగ నొసంగుండు సత్పాత్రములకుఁ, జెలులఁ జుట్టముల నాశ్రితులను రావించి | సత్కరింపుఁడు సంతసం బెలర్ప, నిచ్ఛానుగుణముల నింద్రియసుఖముల | ననుభవింపుఁడు హృదయంబు లలర, నాండ్రను బిడ్డల నయ్యై విధంబుల | గారవింపుఁడు ప్రియపూరితముగ |
|
| తే. |
మఱియు నెవ్వరి చిత్త మెత్తెఱఁగునందు | వాటమైయుండు నది యెల్ల వలయునట్లు సేసి విహరింపుఁ; డిం కెడ సేయ కనికి | నడవుఁ డఱచేతఁ బ్రాణంబు లిడి కడంగి. |
127 |
| వ. | అని చెప్పు; మింత యేమిటి కంటేని. | 128 |
| ఉ. |
ఎందును నెవ్వరుం బడని యెంతయుఁ గష్టముపాటు వచ్చినం గొందల మంది పాండువిభుకోడలు దవ్వుల నున్న నన్ను ‘గో విందుఁడ ! కావు’ మంచుఁ బలవించుట యీఁగఁగరాని యప్పుఁ బో లెం దలపోయ వ్రేఁగయి చలింపకయున్నది యెప్పుడున్ మదిన్. |
129 |
| తే. |
ఇట్టి యేఁ దేరు గడపంగ, నెందు నుతికి | నెక్కు గాండీవ మేడ్తెఱ నెక్కు వెట్టి రెండు దొనలను బూని కిరీటి యనికి | వచ్చు నేఁ డెల్లి; యెందుఁ బోవచ్చు మీకు?’ |
130 |
| వ. | అని పలుకునప్పటి వారి యెత్తికోలును, నీ కొడుకు నిలుపోపమియునుం దలంచి భయం బందితి; నితండు వారల నెఱుంగండు; భీష్మద్రోణుల ప్రాపును, గర్ణు గర్వంబును దన్ను గెలిపించునని నచ్చి తొడరెడు’ ననిన విని ధృతరాష్ట్రుం ‘డర్జునుం డేమనియె?’ నని యడిగిన నతనికి సంజయుం డిట్లనియె: | 131 |