పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము
శ్రీకృష్ణుఁడు పాండవులు సెప్పిన మాటలు ధృతరాష్ట్రునితోఁ జెప్పుట (సం. 5-93-36)
తే. పాండవులు తండ్రి సచ్చిన ప్రజలు వారి | నరసి ప్రోచితి శైశవ మాదిగాఁగ
నడుమ నిష్కారణమ దిగవిడువఁ దగునె? | పారమొందంగ రక్షింపు గారవమున.
271
వ. పాండుకుమారులు నీకుం బరమభక్తిం బ్రణమిల్లి యందఱు నొక్కమాటగా నీతోఁ జెప్పుమని నాకుం జెప్పిన విధంబు వినుము: తన పంపునం బండ్రెండు వత్సరంబులు వనంబున వసియించితిమి. పదుమూఁడగునేఁడు జనపదంబున నజ్ఞాతవాసంబునుం జలిపితిమి; మా తండ్రి సమయంబు పరిపాలించి యే మర్ధరాజ్యం బెట్లునుం బడయుదు మని కృతనిశ్చయులమై పడితిమి; తల్లియుఁ దండ్రియు నెల్ల చుట్టంబులు నేడుగడయును మాకుఁ దాన; మావలన నేరమి గల్గినం గినిసి యిట్లుగా దట్లని చక్కం బెట్టునది; తనగల పది వేలేండ్లకుం దన్నకాని మఱియెఱుంగ మెట్టివారమైనను మమ్మును దుర్యోధనాదులనుం దలంపరు తనయందుఁదెఱంగు గలిగిన నెవ్వరు గొఱగాకున్నను గులంబుపాడి సెడక చెల్లునని’ రని పలికి మఱియు నిట్లనియె: 272
ఉ. ‘సారపు ధర్మమున్‌ విమల సత్యముఁ బాపముచేత బొంకుచేఁ
బారముఁ బొందలేక చెడఁ బాఱినదైన యవస్థ దక్షు లె
వ్వార లుపేక్ష సేసి రది వారల చేటగుఁగాని ధర్మని
స్తారక మయ్యు సత్యశుభ దాయక మయ్యును దైవ ముండెడున్‌.’
273
వ. అని యీ సభ్యులకుం జెప్పుమనిరి; నీవును సభాసదులైన రాజులు నేమనియెద రనుం; డేను ధర్మంబును నీతియుఁ జుట్టఱికంబును మున్నిడుకొని మనోవాక్ప్రకారంబు లేక రూపంబైన సత్యంబకాఁ జెప్పితి; నిత్తెఱంగు మీకు మేలు; క్రోధమాన మత్సరంబులు విడిచి యిట్లు సేయుండు. 274
ఆ. పాండవులకుఁ దగిన పాలు మేదిని బంచి | యిచ్చుకంటెఁ గార్య మెద్ది గలదు?
ధర్మమెద్ది? సముచితంబగు విధమెద్ది? | శక్యమెద్ది? చెపుఁడ వాక్యవిదులు!
275
క. అని పలికి మహారాజా | వినుమని ధృత రాష్ట్రు తోడ వెండియుఁ దా ని
ట్లని చెప్పె వాసుదేవుఁడు | తనమది నఱలేక కార్యదశ దెలియంగన్‌.
276
ఆ. ‘వారి తండ్రిపాలు వారికి నిచ్చి నీ | పాలు నీవుఁ బుత్త్ర పౌత్ర చయము
ననుభవించి సుఖులరై యుండుఁ డిది బంధు | మిత్త్ర సుజనకోటి మెచ్చు తెఱఁగు.
277
క. ఎఱుఁగవె యజాతశత్రుని | నెఱియును ధర్మంబు సత్యనిష్ఠయు మిము నె
త్తెఱఁగున ననువర్తించెనొ | యెఱుఁగవె? తగు చేవ గలుగు టెఱుఁగవె? యధిపా!
278
వ. అది యెల్ల నీ వెఱుంగు; దైనను దెలియఁ జెప్పెద విను; మింద్రప్రస్థపురంబున నుండి పాండవాగ్రజుండు నీకుం బెంపునుం బేరునుం జేయం గోరి. 279
చ. మద మడఁగించి భూపతిసమాజము నెల్లను నిన్నుఁ గొల్వఁజే
యుదునని పూని దిగ్విజయ మున్నతిఁజేసి మహావిభూతితో
మదిమదినుండ నీ సుతుఁడు మంత్రులు సౌబలు జూదమార్చి సం
పద గొని యంతఁ బోవక సభన్‌ ద్రుపదాత్మజ భంగపెట్టరే.
280
ఉ. దానికి నీ వొడంబడితి; ధర్మజుఁ డంతయుఁ జూచి సత్యముం
బూని వృకోదరార్జునులు భుగ్నులుగాఁ బెడచేతఁ గన్ను నీ
రూనఁగ నొత్తుకొంచుఁ జని యుగ్ర వనంబున దుఃఖమగ్నుఁడై
దీనత నుండి పూన్కి దగఁ దీర్చియుఁ గూడి మనంగఁ గోరెడిన్‌.
281
క. తనుఁ దాన పోలుఁగా కే | మనవచ్చు? నజాతశత్రు నతిశాంతతయున్‌
వినయము సత్యము ము న్నే | జనపతులకుఁ గలవు సెపుమ? సౌజన్యనిధీ!
282
క. ఏ నిం తాడితి నీ సం | తానం బిరుదెఱఁగునకు హితము గోరి భవ
త్సూనుని మతి యతిలోభము | మానిచి పాండవులఁ దెమ్ము మనుజాధీశా!
283
ఉ. వారలు శాంతశూరులు; భవచ్చరణంబులు గొల్వఁబూని యు
న్నా;రటుఁగాక మీ కది మనంబున కప్రియమేని నింతకుం
బోరికి వచ్చుచుండుదురు; భూవర! రెండు దెఱంగులందు నీ
కారయఁ బథ్యమేది యగు నవ్విధ మేర్పడ నిశ్చయింపుమా!’
284
చ. అనవుడు రోమహర్షణము లంగములం బొడమన్‌ సదస్యు లె
ల్లను బ్రియమంది నెమ్మనములం ‘బురుషోత్తముఁ డింత యొప్పఁ బ
ల్కునె? మఱుమాటలాడ నయకోవిదుఁ డెవ్వఁడు? ధీరుఁడెవ్వఁ? డిం
దనువరి యెవ్వఁ’ డంచు నచలాకృతులై నెఱి నూరకుండఁగన్‌.
285
వ. జామదగ్న్య మహాముని సుయోధనునితో నిట్లనియె : 286
సీ. వినుము దంభోద్భవుం డనురాజు దన కెదు | రెవ్వరు లేరంచు గ్రొవ్వి నరుఁడు
నారాయణుం డనువారలు గంధమా | దనమను నగమునఁ దపము సేయ
వారిపైఁ జని యాహవమునకుఁ బిలిచిన | నమ్మునీంద్రులు వలదని యనేక
విధములఁ జెప్పంగ వెండియుఁ బోకున్నఁ | గుశముష్టి నుజ్జ్వల విశిఖ వృష్టిఁ
 
ఆ. గురిసి నరుఁడు సేనఁ గూల్చి యాతని భంగ | పెట్టి పట్టి విడిచె నట్టి యమ్మ
హాత్ము లిపుడు పార్థుఁడనఁ గృష్ణుఁడనఁగ లీ | లార్థ కలిత జన్ములైరి సూవె!
287
వ. కావున నీవా దంభోద్భవు చందంబున నుద్ధతి వాటించుటయు, నరనారాయణులతోడఁ దొడరుటయు మీఁద మేలయి యుండదు; పాండవులతోడి పొందు మేలనిన యనంతరంబ కణ్వుండు దుర్యోధనున కిట్లనియె: 288
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )