పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము
భీష్ముఁడు గౌరవసేనలో నతిరథ మహారథాదుల నిరూపణంబు సేయుట (సం. 5-162-15)
వ. అని పలికి మఱియు నిట్లనియె : 217
క. ‘నీ యందు వారి యందుం | జేయంగల మానుసుల విశేషంబులఁ జి
త్తాయత్తంబుగఁ జెప్పుము | నీ యెఱుఁగని యవియు లేవు నిక్కపుఁ దరముల్‌.’
218
క. అనవుడు ‘నీ విట్లడిగిన | విని యూరక యుండఁ దగదు విను మేర్పడ నె
ల్లను నున్న రూపు సెప్పెద | మన వారల వారి వారి మానము లధిపా!’
219
వ. అని గాంగేయుం డిట్లనియె : 220
సీ. ‘నీ వతిరథుఁడవు, నీ తమ్ములందఱు | సమరథశ్రేష్ఠులు సమరమునకుఁ
బరుసని వీరులు పాంచాలసేన ని | ర్జింతురు; నను నేన చెప్పికొనఁగ
నేర; నా యేడ్తెఱ మీరెఱుంగుదురు; భో | జాగ్రణి కృతవర్మ యతిరథుండు
దృఢవేధి యీతండు దీర్చునెంతటి పని | యైనఁ గైకొని; శల్యుఁ డతిరథుండు;
 
ఆ. వాసుదేవుతోడి యీసువాఁ, డల్లుర | విడిచె నిన్నుఁ గూడి; విక్రమమునఁ
బేరుకొనఁగఁ జాలు భూరిశ్రవుం డతి | రథుల మొదలి; యనికి రక్కసుండు.
221
క. విను సైంధవుఁడు మహారథుఁ | డనిఁ బోక పెనంగు; నతని నా ద్రౌపదికై
పెనుపఱఁ బఱిచిరి కుంతీ | తనయులు వారల కెదుర్పఁ దపముం జేసెన్‌.
222
వ. కాంభోజరాజగు సుదక్షిణుండు సమరథుం; డితనిపాల రథబృందంబులు మేలు గలుగుఁ, బాండవ బలంబులం గలంచు; మాహిష్మతీపతి యగు నీలుం డర్ధరథుం డితనికి సహదేవునకుఁ దెగని పగయై యుండు; దానం జేసి యాలంబున నోలమాసగొనం; డవంతిదేశాధీశులగు విందానువిందు లర్ధరథులు; పరస్పర స్నేహంబున సాహసికులై యొకళ్ళొకళ్ళం బెట్టి పోవక పోరుదురు; త్రిగర్త పతులు తోడంబుట్టువులేవురును మహారథులు; గోగ్రహణంబునం బడిన బన్నంబుఁ బాపికొనం గడంగుదురు; వీరికి భుజబలం బగ్గలంబై యుండు. 223
క. సమరథుఁడు బిరుదు లక్ష్మణ | కుమారకుం డేచి మొనలఁ గోల్తల సేయున్‌
మిమునెల్ల మిగులు భుజగ | ర్వము మదముం గలఁడు కొనఁ డరాతుల నధిపా!
224
వ. బృహద్బలుండు సమరథుండు కోసల బలంబుతోడం గడంగి చిచ్చునుం గరువలియునుంగొని తాఁకు; దండధారుం డర్ధరథుండు సేన పఱపు గలండు, బెట్టిదంబుగాఁ గయ్యంబు సేయు. 225
తే. అతిరథోత్తముఁ డివ్వీటియందు మేటి | కృపుడు; తన పెంపు వాటించి గెలుచుఁ జిచ్చుఁ
గాని నాలుగు దెఱఁగుల సేనలకును | దివియఁ డించుకయును నరదేవముఖ్య!
226
క. శకుని విను సమరథుఁడు పాం | డు కుమారులతోడ నెప్పుడుం బగఁగొని వా
రికిఁ గీడురోయు; భృత్యులు | ప్రకట బలులు గలరు; నేర్చు బవరంబునకున్‌.
227
మ. వరదివ్యాస్త్రవిదుండు బాహుఘనుఁ డశ్వత్థామ గాండీవితోఁ
బురుడింపందగువాఁడు; వీని కెన యీ భూలోక సంచారు లె
వ్వరులే; రీతఁడు బ్రాహ్మణుం డనని భావం బూనఁగా నోర్వమిం
దర మూహింపఁగ లేదకాని జముచందం బయ్యెడుం బోరులన్‌.
228
సీ. అతిరథోత్తముఁడు ద్రోణాచార్యుఁ; డందలి | యిందలి విలుకాండ్ర కెల్ల గురుఁడు,
హితుఁడు నీ కెంతయు, నేర్చిన మొన లితం| డడరినఁ జమరినయట్ల మ్రందు;
వృద్ధని యితని భావింపరా; దనిలోన | నంగ విస్ఫురణంబు భంగి చూడ
నర్జునుపైఁ గూర్మి నతని నో నేయఁడు | సచరాచరంబైన జగము లెల్ల
 
తే. నొక్క మొగమై కడంగినఁ జిక్కువఱుచు | దివ్యబాణ జాలంబుల దీటు కొలిపి
ప్రాణములు డాఁపఁ; డీతని పాటి దొరలఁ | గాన మే రాజ్యములయందుఁ గౌరవేంద్ర!
229
క. అతిరథుఁడు బాహ్లికుఁడు విను | మతులిత బలుఁ; డితని యట్ల యాత్మజుఁడును వి
శ్రుతశక్తి సోమదత్తుం; | డితనికి, నీతనికి సమర మెన పెండిలికిన్‌.
230
క. అసురవరుఁ డీ యలంబుషుఁ | డసమాన బలుండు సమరథాగ్రణి; విను పాం
డు సుతులయెడ రోషము గలఁ | డసంఖ్య మాయా బలమున నరులఁ గలంచున్‌.
231
తే. వినుము ప్రాగ్జ్యోతిషాధీశుఁ డనుపమాన | శక్తి యీ భగదత్తుండు సమరథుండు;
గజము నెక్కి తా నేనిక కయ్యమైన | నేర్చు నైరావణము మీఁది యింద్రుఁ బోలి.
232
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )