| ఇతిహాసములు | మొల్ల రామాయణము | బాల కాండము |
| అయోధ్యాపుర వైభవము | ||
| వ. |
అని వితర్కించి, ముదంబున నిష్టదేవతా ప్రార్థనంబును బురాతన కవీంద్ర స్తుతియునుం జేసి నా యొనర్పంబూనిన మొల్ల రామాయణ మహా కావ్యమునకుఁ గథా క్రమం బెట్టు లనిన. |
1 |
| సీ. |
సరయూనదీతీర సతత సన్మంగళ-ప్రాభవోన్నత మహా వైభవమ్ము, కనక గోపుర హర్మ్య ఘన కవాటోజ్జ్వల-త్ప్రాకార గోపుర శ్రీకరమ్ము, గజ వాజి రథ భట గణికాతపత్ర చా-మర కేతు తోరణ మండితమ్ము, ధరణీ వధూటికాభరణ విభ్రమ రేఖ-దరిసించు మాణిక్య దర్పణమ్ము, |
|
| తే. |
భానుకుల దీప రాజన్య పట్టభద్ర-భాసి నవరత్న ఖచిత సింహాసనమ్ము నాఁగ నుతి కెక్కు మహిమ సనారతమ్ము-ధర్మ నిలయమ్ము, మహి నయోధ్యాపురమ్ము. |
2 |
| సీ. |
మదనాగ యూధ సమగ్ర దేశము గాని-కుటిల వర్తన శేష కులము గాదు, ఆహవోర్వీజయ హరి నివాసము గాని-కీశ సముత్కరాంకితము గాదు, సుందర స్యందన మందిరంబగుఁ గాని-సంతత మంజులాశ్రయము గాదు, మోహన గణికా సమూహ గేహము గాని-యూధికా నికరసంయుతము గాదు, |
|
| తే. |
సరస సత్పుణ్యజన నివాసమ్ము గాని-కఠిన నిర్దయ దైత్య సంఘమ్ము గాదు కాదు కాదని కొనియాడఁ గలిగి నట్టి-పురవరాగ్రమ్ము సాకేత పురవరమ్ము. |
3 |
| సీ. |
భూరి విద్యా ప్రౌఢి శారదా పీఠమై-గణుతింప సత్యలోకమ్ము వోలె మహనీయ గుణ సర్వమంగళావాసమై-పొగడొందు కైలాస నగము వోలె లలిత సంపచ్ఛాలి లక్ష్మీనివాసమై-యురవైన వైకుంఠ పురము వోలె విరచిత ప్రఖ్యాత హరిచందనాఢ్యమై-యారూఢి నమరాలయమ్ము వోలె |
|
| తే. |
రాజరాజ నివాసమై తేజరిల్లి-నరవరోత్తర దిగ్భాగ నగరి వోలె సకల జనములు గొనియాడ జగములందుఁ-బొలుపు మీరును సాకేత పుర వరమ్ము. |
4 |
| క. |
ఇమ్ముల నప్పురి వప్రము కొమ్ములపై నుండి పురము కొమ్మలు వేడ్కన్ దమ్ముల చుట్టము పద జల జమ్ములు పూజింతు రొగి నజస్రముఁ బ్రీతిన్. |
5 |
| క. |
పరువున మురువై యుండును సురపురమునఁ గల్ప తరులు చూపఱ కింపై పరువున మురువై యుండును దురగంబు లయోధ్యఁ గల ప్రతోళికలందున్. |
6 |
| క. |
దాన గుణమ్మున సుర పురి నే నాఁడును నమర రత్న మెన్నిక కెక్కున్; దాన గుణంబున మిక్కిలి యేనుఁగు లా పురములోన నెన్నిక కెక్కున్. |
7 |
| క. |
కవి గురు బుధ మిత్త్రాదులు వివిధార్చనలను సురపురి వెలయుదు రెలమిన్ గవి గురు బుధ మిత్త్రాదులు వివిధార్చనలం బురమున వెలయుదు రెపుడున్. |
8 |
| క. |
భోగానురాగ సంపద భోగులు వర్తింతు రందు భూనుత లీలన్ భోగానురాగ సంపద భోగులు వర్తింతు రిందు భూనుత లీలన్. |
9 |
| సీ. |
ప్రకటాగ్నిహోత్ర సంపన్ను లౌదురు గాని-రమణీయ రుక్మకారకులు గారు, శుభ పవిత్రోజ్జ్వల సూత్రధారులు గాని-టక్కరి హాస్యనాటకులు గారు, ఉభయ సంధ్యాది విధ్యుక్త కర్ములు గాని-చర్చింపఁగా నిశాచరులు గారు, తిలకించి చూడ సద్ద్విజు లౌదురే కాని-తలఁపంగఁ బక్షిజాతములు కారు, |
|
| తే. |
బాడబులు గాని యగ్ని రూపములు గారు-పండితులు గాని విజ్ఞుల పగిదిఁ గారు ధీవరులు గాని జాతి నిందితులు గారు-పరమ పావను లా పురి ధరణిసురులు. |
10 |
| ఉ. |
రాజులు కాంతియందు, రతి రాజులు రూపమునందు, వాహినీ రాజులు దానమందు, మృగ రాజులు విక్రమ కేళియందు, గో రాజులు భోగమందు, దిన రాజులు సంతత తేజమందు, రా రాజులు మానమందు, నగరమ్మున రాజ కుమారు లందఱున్. |
11 |
| సీ. |
తగ దాన విఖ్యాతి ధరఁ గుబేరులు గాని-సతతాంగ కుష్ఠ పీడితులు గారు, నిర్మల సత్యోక్తి ధర్మ సూతులు గాని-చర్చింప ననృత భాషకులు గారు, ప్రకట విభూతి సౌభాగ్య రుద్రులు గాని-వసుధపై రోషమానసులు గారు, కమనీయ గాంభీర్య ఘన సముద్రులు గాని-యతులిత భంగ సంగతులు గారు, |
|
| తే. |
వర్తకులు గాని పక్షు లేవరుసఁ గారు-భోగులే గాని పాము లెప్పుడును గారు, సరసులే కాని కొలఁకుల జాడఁ గారు-వన్నె కెక్కిన యప్పురి వైశ్యు లెల్ల. |
12 |
| క. |
పంటల భాగ్యము గలరై పంటలపైఁ బంట లమర బ్రతుకుదు రెపుడున్ బంటలుఁ బాడియుఁ గల యా పంటలు మొదలైన కాఁపుఁ బ్రజలా నగరిన్. |
13 |
| సీ. |
కలికి చూపులచేతఁ గరఁగింప నేర్తురు-బ్రహ్మచారుల నైన భ్రాంతి గొలిపి, మృదువచోరచనల వదలింప నేర్తురు-ఘన మునీంద్రుల నైనఁ గచ్చడములు, వలపులు పైఁజల్లి వలపింప నేర్తురు-సన్న్యాసులను నైనఁ జలముపట్టి, సురత బంధమ్ములఁ జొక్కింప నేర్తురు-వ్రతములు గైకొన్న యతుల నైన, |
|
| తే. |
నచల మెక్కింప నేరుతు రౌషధముల-మరులు గొలుపంగ నేర్తురు మంత్రములను, ధనము లంకింప నేర్తురు తక్కుసేసి-వాసి కెక్కిన యప్పురి వారసతులు. |
14 |
| సీ. |
శారద గాయత్రి శాండిల్య గాలవ-కపిల కౌశిక కుల ఖ్యాతి గలిగి, మదన విష్వక్సేన మాధవ నారద-శుక వైజయంతి కార్జునులు గలిగి, చంద్రార్క గుహ గిరిసంభవ జయ వృష-కుంభ బాణాదులఁ గొమరు మిగిలి, సుమన ఐరావత సురభి శక్రామృత-పారిజాతముల సొంపారఁ గలిగి, |
|
| తే. |
బ్రహ్మ నిలయమ్ము, వైకుంఠ పట్టణమ్ము-నాగ కంకణు శైలమ్ము, నాక పురము, లలిత గతిఁ బోలి,యే వేళఁ దులను దూఁగి-ఘనత నొప్పారు నప్పురి వనము లెల్ల. |
15 |
| చ. |
కనక విలాస కుంభములు గబ్బి కుచంబుల లీలఁ, జిత్ర కే తనములు పైఁట కొంగుల విధంబునఁ గ్రాల, గవాక్షముల్ రహిన్ గనుఁ గవ యట్ల పొల్పెసఁగఁగా భువి భోగులు మెచ్చ భోగినీ జనముల రీతిఁ జెల్వమరు సౌధ నికాయము పాయ కప్పురిన్. |
16 |
| తే. |
మకర, కచ్ఛప, శంఖ, పద్మములు గలిగి, ధనదు నగరమ్ముపైఁ గాలు ద్రవ్వుచుండు సరస మాధుర్య గాంభీర్య సరణిఁ బేర్చి గుఱుతు మీఱిన యప్పురి కొలఁకు లెల్ల. |
17 |
| గీ. |
అమృత ధారా ప్రవాహమ్మునందు నెపుడు నొక్క ధేనువు దివి నున్న నుచిత మగునె? అమృత ధారా ప్రవాహమ్మునందు నెపుడుఁ బెక్కు ధేనువు లప్పురిఁ బేరు నొందు. |
18 |
| క. |
ఈ కరణి సకల విభవ శ్రీకర మయి తాఁ బ్రసిద్ధిఁ జెలఁగుచు మహిమన్ నాక పురితోడ నొఱయుచు సాకేత పురమ్ము వెలయు జగము నుతింపన్. |
19 |
| వ. | అట్టి మహా పట్టణంబున కధీశ్వరుం డెట్టివాఁ డనఁగ: | 20 |