ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము
రావణ సుగ్రీవుల కథనము
వ. ఇట్లు చతురంగబలంబులు గొల్వ లోకవిద్రావణుం డగు రావణుండు సమరం
బొనర్పనరుదేరం గని రాఘవేశ్వరుం డతనికి దండనాయకులం బనిచిన
వారుని దరుగిరిపాషాణపాణులై యెదురు నడిచి సింహనాదంబులు సేయ నుభయ
బలంబులుం దలపడి పోరాడు సమయంబున నమరవైరులు శస్త్రాస్త్ర వర్షంబులు
గురియించి నొప్పించి నంత వానరవీరులు మరల దానవులపైఁ బాషాణపాదపంబు
లడరింప నరిబలంబులు విఱిగి పికాపికలై పఱచునత్తఱిఁ బంక్తి కంధరుండుదగ్రుండై
కెరలుచుఁ గ్రూరనారాచంబులు చాపంబునం దొడిగి పనసపవనతనయ నల
నీల ద్వివిదశరభ కుముదగజ గవయగవాక్ష గంధమాదనాంగద మైందాదుల నొక్కొక్కరిఁ
బదేసిబాణంబుల గుదిగొన నేసిన విఱిగి యగచరసేనలు సురుగున య్యవసరంబున.
7
క. చేరి విరూపాక్షుని దగు
తేరిపయిని నొక్కకొండ ధీరతతోడన్‌
సూరజుఁ డప్పుడు మిక్కిలి
శూరత్వం బడరనేసి చూర్ణము సేసెన్‌.
8
ఆ. రథము విఱిగినంత రణమధ్యమున నొక్క
వారణంబు నెక్కివచ్చు నెడను
వాలికొడుకు దాని పటురోషమునఁ దోల
నుఱికి ప్లవగుఁ గోల నఱికె వాఁడు.
9
క. అక్షయబలుఁ డగు రవిసుతుఁ
డాక్షణమున నుగ్రుఁ డగుచు నద రంట విరూ
పాక్షుని వక్షముఁ బొడిచిన
రక్షోవీరుండు కూలి రణమునఁ బడియెన్‌.
10
వ. ఇట్లు కూలిన. 11
క. హుమ్మని యాతనికూరిమి
తమ్ముండును గనలి వచ్చు తపనజు నత్యు
గ్రమ్ముగ మార్కొని జడిగా
నమ్ముల వర్షంబుఁ గురియ నాలోఁ బెలుచన్‌.
12
చ. శరములు తాఁకకుండ నొకశైలమునం దగ నోసరించి యా
యరదము నుగ్గుగాఁ గపికులాగ్రణి వైచిన వాఁడు నేలకున్‌
వరభుజశక్తి దాఁటి కరవాలున నేసినఁ దప్పఁ గ్రుంకి వా
నరపతి కొట్టె నప్డు మహినాథుఁడు సంతసమంది చూడఁగన్‌.
13
క. కదనమున నొచ్చిదానవుఁ
డదలింపుచు భానుసుతుని యౌదల వగులన్‌
గదచే నడిచిన వానినిఁ
గుదియంగాఁ బట్టి వైచెఁ గుంభినిమీఁదన్‌.
14
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - dvitIyAshvAsamu ( telugu andhra )