| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము |
| రామ రావణుల భీకర సంగ్రామము | ||
| క. |
తన కట్టెదురను గూలిన దనుజులఁ బెక్కండ్రఁ జూచి దశకంఠుఁడు దాఁ గనలుచు సూతున కనియెను జననాయకుమీఁద రథముఁ జన నిమ్మనుచున్. |
19 |
| ఆ. |
అధిపుఁ డానతిచ్చినట్టుగా సూతుండు రామచంద్రుమీఁద రథము వఱపె నపుడు శంఖకాహళాదిరవంబులు వందిజనులనుతులు సందడింప. |
20 |
| వ. |
ఇట్లు శతాంగతురంగ హేషారవంబులును బహుళకింకిణీ ఘంటికా నినదంబులును రణనేమిస్వనంబులును దనుజభటాట్టహాసంబులును బోరుకలంగ సంగరరంగంబున కరుగుదెంచు నక్తంచరేశ్వరుండు ధనుర్ధరుండై ప్రతిఘటించు సమయంబున. |
21 |
| క. |
తన కెదిరించిన రామునిఁ గని దనుజవిభుండు కినుక గదురఁగ నటఁ జ య్యన నాగాస్త్రములను దన ధనువునఁ గీలించి యేసెఁ దనభుజశక్తిన్. |
22 |
| క. |
అవి లెక్కఁ గొనక పొరిఁబొరి నవనీనాయకుఁడు గినుక నసురాధిపుపై దివిజారు లులికి పాఱఁగఁ బవిసన్నిభ మైన తీవ్రబాణము లేసెన్. |
23 |
| సీ. |
లంకేశుఁ డవి యెల్ల లక్ష్యంబు సేయక-తిమిరాంబకములు సంధించి నిబిడమై చీఁకటి నిండంగఁ బర్వినఁ-గపు లెల్ల నంధులై కళవళింప నుర్వీశ్వరుం డంప నుగ్రబాణంబుల-నంధకారం బంత నడఁగఁ జేసి వాసవారాతిపై వహ్నిబాణము నేయ-నాతండు రౌద్రాస్త్ర మడర నేసె |
|
| తే. |
రెండు బాణంబులును గూడి గం డెసంగఁ-బెనఁగి యాకాశమున నుండి పృథ్విమీఁదఁ బడియె నద్భుతగతి జగత్ప్రళయముగను-సురలుఁ గపులును దైత్యులుఁ జోద్యపడఁగ. |
24 |
| వ. | అట్లు మహాద్భుతకరంబుగా సమరంబు జరుగుచున్న సమయంబున. | 25 |
| క. |
రామునిమేనను బాణ స్తోమంబులు నాట నేసె సురరిపుఁ డలుకన్ రాముఁడు ఘననారాచ స్తోమంబులు నాట నేసె సురరిపుమీఁదన్. |
26 |
| చ. |
ధరణిపుమీఁదనుం గనలి దానవనాయకుఁ డేసె నంత భీ కరశరభోష్ట్ర కాకఫణిగండకఘూకబలాకభేకసూ కరకిరిఋశ్యకూర్మశుకగర్దభ భల్లుకనీలకంఠకే సరివృకగృధ్రకీటబకసైంధవసైరిభవక్త్రబాణముల్. |
27 |
| వ. | ఇట్లు నిరంతరంబుగాఁ బ్రయోగించిన. | 28 |
| చ. |
పరువడి మీదవచ్చు పటుబాణచయంబులఁ జూచి రాఘవుం డరుదుగ వాని నన్నిటి వియత్తలవీథిని ద్రుంచి క్రమ్మఱన్ సురరిపుమీఁద నేసె బలసూదనముఖ్యులు సూచి మెచ్చని బ్బరముగ నగ్నిబాణము నభంబునఁ గీలలు పర్వుచుండఁగన్. |
29 |
| వ. | అమ్మహాస్త్రంబువలన. | 30 |
| క. |
దహన ముఖంబుల శరములు గ్రహముఖములు గలుగునట్టి ఘనతరశరముల్ మిహిరముఖంబుల శరములు బహుళముగాఁ గల్గి దైత్యపతిపైఁ బర్వెన్. |
31 |
| ఆ. |
అంత దానవేంద్రుఁ డాబాణతతు లెల్ల దృణములట్లు నడుమఁ ద్రించి వైచి మయునిచేతఁ గొన్న మహనీయ మగునట్టి శంబరాఖ్య మైనశరము వైచె. |
32 |
| క. |
ఆశరమున బహుశస్త్రము లాశుగతిం గలిగి గవియ నన్నిటి నొకటన్ నాశము చేసెను రాముం డాశాపతు లలర మన్మథాస్త్రముచేతన్. |
33 |
| ఆ. |
శంబరాఖ్యశరము జగదీశుబాణంబు వలనఁ జెడక రామువక్ష మడర నాటె నంతలోన నాకారిపై నేసె విశిఖతతులు వేయి వేయునెడను. |
34 |
| క. |
రావణుఁ డాబాణములకు వేవేగను ప్రతిఘటించి వేసినశరముల్ చేవ మెయిఁ దాకిఁ వడి ధా త్రీవలయంబునను బడి ధరిత్రి వడంకెన్. |
35 |