| పునఃప్రతిష్ఠా పర్వము |
| క. | శ్రీకలితాయుర్నిగమ క ళాకౌశల సముపగత ఫలత్కేదారా! స్వీకృత నిజమితభోగ వ్యాకృత హిత మిత్త్ర బాంధవాద్యుపకారా! | 1 |
| ఆ.వె. | కాకతీయ సవితృ కమనీయ తేజమ్ముఁ బుణికికొన్న రెడ్డి భూమిపతుల విక్రమానలమ్ము విమతాంధకారమ్ము వెడలఁద్రోలెఁ; దెలుఁగుఁ బుడమి నేలె. | 2 |
| చ. | ఎడమడువైన కాకతిమహీశులయేల్బడి నాదుకొన్న నా థుఁ డొకఁడు లేకపోయెఁ; బగతోఁ బెఱఱేండ్లు తెనుంగుదుర్గముల్ కడుకొని చిక్కఁబట్టిరి; వికాసవిశేషముఁ దక్కి పెంపునె ద్దడిఁగొనె నోరుఁగల్లు సులతానుపురంబను మాఱుపేరునన్. | 3 |
| గీ. | కడలిగట్టునఁ దెనుఁగుదుర్గమ్ములైన కొలనువీడును నెల్లూరు కొండవీడు రాణ్మహేంద్రవరమ్ము తీవ్రతరమయిన ముస్లిము వరూథినీధాటి మునుఁగనయ్యె. | 4 |
| సీ. | సప్తతంతు క్రియాచరణవేళా కృత । ప్రత్యూహములను గప్పఁబడరాని భగ్న భుగ్న మనోజ్ఞపరమాలయాంతర । దైవతప్రతిమల దాఁపరాని యానువంశిక భుజ్యమానాగ్రహారాళి । విధ్వంసముల నిహ్నవింపరాని ధేనుమాంసాదనోద్రిక్త శీధూత్సిక్త । వదనంబుల మఱుంగుపఱుపరాని | |
| గీ. | భారతీయ సతీజన స్వచ్ఛధర్మ । భూరిదూషణములఁ గప్పిపుచ్చరాని యొక భయావహపరధర్మ ముదయమందెఁ । గాకతిమహేశ్వరుఁడు లేనికాలమందు. | 5 |
| సీ. | అలనాఁడు కాకతీయుల యేలుబడిక్రిందఁ । బొదలె దుర్గములు డెబ్బదియురెండు నొకనినాయకతచే నొకసీమ యరిభూప । దురవాప మగుసిరి నురవడించు నటులు డెబ్బదియిర్వు రరిగాఁపులయుప్రాపు । తనకుఁ జేకుఱ ధరాతలము బెగడ బల కోశ ముఖమహోజ్జ్వలిత రాజ్యాంగముల్ । పెంచి పెంపులు గడియించియుండి | |
| గీ. | కాకతీయసామ్రాజ్య దుర్గప్రబంధ । మంతలో నింతయయ్యె నాయకతకొఱఁత; నాయపశ్రుతి ధార్మికస్వాంతములను । గలఁచె; మ్రుక్కడిసిరి మఱొక్కనిని వలచె. | 6 |
| గీ. | బెండపూడన్న - కొలనిరుద్రుండు మఱియు వెలమ సింగమనీడును దెలుఁగునేల రక్షణమునకు వీరరుద్రక్షితీశ దర్శితంబైన యోధనేత్రత్రయంబు. | 7 |
| గీ. | ఓరుఁగలునందుఁ బాలనోద్యోగమునకు “నలుగుఖానుఁడు” ముక్తియారులను నిలిపెఁ దెలుఁగునాఁ డస్వతంత్రతానిల కరాళ గరళశిఖి సోఁకినట్లు త్రొక్కటము వడఁగ. | 8 |
| ముసునూరి ప్రోలయ వీరోద్యమము |
| గీ. | హైందవమతావలంబనం బైన బుద్ధి కలిమి ముసునూరి కుల దీపకళికయైన ‘రేకపలి’పతి ప్రోలయాఖ్యాక సుకృతి తనకుఁ దాన మనం బిటు త్రవ్వుకొనియె. | 9 |
| మ. | అవురా! యిట్టియకాండపాతమఁటె! ద్రోహవ్యూహసన్నాహమై యవనోద్వాహిని చుట్టవైచుకొనె నట్లయ్యోరుఁగల్కోట; వీ ర విహారోద్ధతు రుద్రసింహమును గారాబంధితుం జేయు దు ర్వ్యవసాయంబున నయ్యరాతిసమవాయం బింత మున్నాడునే! | 10 |
| మ. | అతిసంధానము చండతాండవముసేయన్, హైందవమ్ముల్ లస న్మతధర్మంబులు గౌరవంబుసెడి డిందన్, సాధువాక్కుల్ తిర స్కృతి నందన్ మనధాత్రి నెన్నొసట వ్రాసెంబోలు దైవంబు; త త్ప్రతికారం బొనరించు పౌరుషము నిర్వర్తింపగా నొప్పదే! | 11 |
| గీ. | కాకతివిభుత్యమున నోరుఁగలు పతాక యవని శాశ్వతముగ నిల్చు ననియెకాని యల కళంకిత చంద్రధ్వజాంకురములు నాటు ననుకొంటిమే! తెన్గుకోటమీఁద. | 12 |
| వ. | కడచినజలమ్మున కానకట్ట కట్టి లాభ మేమి? కర్తవ్యమున విక్రమించెదంగాక! కాకతీయసామ్రాజ్యసామంతులైన దుర్గాధిపతుల మునుముందఱం గూడఁగలుపుకొని వారి నెల్లర నొక్కత్రాట నడపించి పరాక్రాంతమైన యోరుఁగంటికోటపై విక్రాంతిమెయిఁ దెనుంగుబావుటా పునఃప్రతిష్ఠితము సేఁత కావలయును - | 13 |
| క. | అని భావించుచు దర్పం బును గిన్కయు వేడ్కయును గుబుర్కొన జాతీ య నవోదయ పరిలిప్సా ఘనుండు ప్రోలయ స్వకార్యకరణోన్ముఖుఁడై. | 14 |
| ఉ. | కూటికి గుడ్డకుం గఱవుగొల్పి ‘ఖురాను’నకుం బ్రణామముల్ చాటనివారిఁ బట్టుకొని చట్టలుచీలిచి ధేను దేవతా ఘాట మదల్చి హైందవులఁ గాఱియవెట్టెడివారికిం బరో చ్చాటనమంత్ర మౌత మనిశమ్మును బ్రోలయపేరు ధారుణిన్. | 15 |
| ఉ. | వాలిన పౌరుషంబుమెయి వాదరలెత్తి యరిచ్ఛటారుణ క్షాళనసేయు నాంధ్రయువసంఘము తోడుగ సాఁగనున్న యీ ప్రోలయనూతనోద్యమము పోఁడిమి లెస్సగఁ బండి తెల్గుజెం డా లల యోరుఁగంటఁ బ్రకటస్ఫుటభంగిఁ దలిర్పఁగావలెన్. | 16 |
| క. | అనునాత్మ ప్రత్యయమున ననల్ప భవితవ్య రణజయారుణ విలసద్ ఘృణి యొకఁడు తోఁచి ప్రోలయ కు నేదో యిరులతెరఁ దొలఁచికొన్న ట్లాయెన్. | 17 |
| వ. | అతండు పెక్కురు తెలుఁగుజోదులం గలసికొని వారియెడల దేశభక్తి రక్తి కెక్కునట్లు చేయుచు నవిరతవ్యవసాయంబు నెఱుపుచుండె; మఱియు - | 18 |
| సీ. | తెలుఁగుధాత్రికి వీరకళ దిద్దిన ప్రతాప । రుద్రవల్లభునితీర్పుల నెఱింగి పయి నేడుగడలేమిఁ బల్లటించెడి దుర్గ । పతులకు ధీరభావమ్ముఁ గఱపి ప్రాపుండి నడప దర్పమున బెబ్బులిగొంతు । గుప్పిటంగొను యువకులను జేర్చి తనపినతండ్రి సంతానరత్నములైన । కాపయప్రముఖులదాపు చూచి | |
| గీ. | యవనసేనాంబుధి మునింగి యంగలార్చు । నవని నెత్తు పురాణదంష్ట్రాంకురముగ ధర్మసామ్రాజ్యహిత సముద్ధరణచణుఁడు । నాయకత మించెఁ బ్రోలయనాయకుండు. | 19 |
| క. | ఊరూరఁ బ్రజాసేనలు గూరిచి పరు లాక్రమించుకొన్నవి దుర్గ ద్వారములు తెఱచి వీరవి హార మ్మొనరించెఁ బ్రోలయ జయప్రియుఁడై. | 20 |
| క. | ఒక యుత్సాహముతో నొ క్కొకదుర్గము ముట్టడించి యుత్తేజితుఁడై సకలస్వదేశమున నొరు లకు నిలఁబడ నెలవులేనిలాగునఁ జేసెన్. | 21 |
| గీ. | నడుమ విసరిన వడగాడ్పునకుఁ దొణంకి తలలువాల్చు సనాతనధర్మలతలు తేఱుకొని యప్పుడపుడె నర్తింపఁదొడఁగెఁ బ్రోలయమనీషి కృషివర్షమునకుఁ దనిసి. | 22 |
| వ. | దుర్గవిజయానంతరము ప్రోలయనాయకుం డీవఱ కెవం డేలుకొను చుండినదుర్గంబు వాఁడ పాలించుకొనున ట్లేర్పఱచి తోడిదుర్గనాయకులలోఁ దాను నొక్కండయి కలసిమెలసి “రేకపలి” రాచవీడుగ గోదావరీపరిసరవిశ్వంభర నేలుబడి సాగించుచుండె - | 23 |
| గీ. | తఱుగువట్టిన దేశీయధర్మమునకుఁ బెరుగుదల నీయఁ బరుల నొవ్వించి తఱిమె; నంతియేకాని, సర్వరాజ్యమ్ముఁ దానె కరుడుగాఁజేసి మ్రింగెడి కాంక్షఁబోఁడు. | 24 |
| గీ. | తనబరువుపడ్డ దొడ్డయత్నమ్ముకంటె నాయకుల సాయమునకంటెఁ బ్రాయమిచ్చి పోరుసలిపిన ప్రజల గెల్పునకు మురిసి యది ప్రజారాజ్య మనుచుఁ బ్రోలయ తలంచు. | 25 |
| వ. | ఎన్నిదుర్గంబుల నాక్రమించినను బ్రధాననగరంబైన యోరుఁగల్లు స్వాయత్తంబుఁ గావించుకొననివాఁ డగుట ప్రోలయ తనవార్ధకంబునకుఁ దలంకుచు - | 26 |
| గీ. | “కడఁగి డెబ్బదిమించు దుర్గములయందుఁ దెనుఁగునేల్బడి వైజయంతికల నెత్తి యొక్క యోర్గలుకోటపై నున్నయట్టి యబ్జవైరిధ్వజము దింప నయితి కాదొ!” | 27 |
| వ. | అనుకొని యొకనాఁడు నిజపితృవ్యపుత్రుండును గార్యాకార్యపరిజ్ఞాతయు నింగితవేదియు నగు “కాపయ”ను గానిపించుకొని సముచితకృతజ్ఞతారచితశుభాశంసనుం డతని కిట్లనియె. | 28 |
| గీ. | తెనుఁగుధారుణి నొరులపెత్తనము దరల ననుఁగుఁదమ్ముఁడు నీవు చేసినది సాయ మమృతకాయముతో నుండుననుటకంటె నోచిరంజీవి! యేమి చేయుటకుఁ గలదు. | 29 |
| ఉ. | తీసినదారికిన్ గరుణదేఱినదైవము సంగడీఁడుగా వేసినయంగకుం బ్రజలవేడుకపోఁడిమి తోడునీడగా దూసినకత్తికిన్ బగఱతోరపునెత్తురు నిండుజోడుగాఁ జేసిన యస్మదుద్యమము సిద్ధికివచ్చెఁ గొఱంత కొంతగన్. | 30 |
| మ. | తలయేరుం బొడిదగ్గు నెక్కొనిన వృద్ధత్వమ్మునం జిక్కి దూ పిలి కోఱల్ కఱపించు మృత్యువునకున్ భృత్యుండనై యున్న నా కలనన్ గాఁగలకార్య మేమికల; దింకన్ గల్యకల్యాణరే ఖలు నీ సాయుధపాణిపద్మమున వ్యక్తం బౌత! రక్తద్యుతిన్. | 31 |
| చ. | సుఖపడుకోర్కివెంట మనసున్ మఱివేఱొకదారిఁ జేర్చి యు న్ముఖనిజకర్మపాకఫలముం గొనఁబోయెద; సద్యశో ముహు ర్ముఖరిత దిఙ్ముఖుండవయి ముందు స్వరాజ్యము నిల్పుకొంచుఁ ద న్నిఖిలరమాకిరీటముగ నీవయి యోర్గలుకోటఁ బట్టుమీ! | 32 |
| క. | అని యన్న యనుజునెడఁ దన మనసు నిలిపి జయముపలికి మాటాడినఁ జి క్కని వాక్కుల నెద తడియఁగ విని కాపయ పలికె భక్తివినమత్తనుఁడై. | 33 |
| క. | పొరపొచ్చెము లెఱుఁగని సో దరభావోచ్చయము ప్రతిపదమ్మునఁ దొలఁకన్ గఱపిన నీ యుపదేశ స్ఫురణమ్మున కేను గేలుమోడ్తుం గృతినై. | 34 |
| మ. | అసహాయస్థితి నున్నయీప్రజకు దాపై పాపచర్యాత్ములన్ గసి రాపాడి పునాదివేసితివి చక్కన్ నేలమట్టంబు తా రసిలంగా; నిఁకమీఁదఁ దద్భవననిర్మాణంబు నాబోటి యే పసివాఁడైనను నిర్వహింపఁగలఁ డప్పా! యేల సందేహముల్. | 35 |
| శా. | నీ సంకల్పముచేత నాటఁబడియుండెన్; నీ మహాశీస్సుధా శ్రీసేకంబున మోసుదేఱి చివురించెన్; నీ దయాదాసుఁడౌ నీ సోదర్యుఁడు సేయుదోహదముచే నేతన్నహారాజ్యలీ లాసంతానము పండి నిండు నిఁక నేలన్ స్వర్ణభండారముల్. | 36 |
| క. | శ్రీవిశ్వేశ్వరదేవ ద యావీక్షణ మొప్పుగా సమారూఢమతిన్ భావుకవిజయపతాకను నే వేసెద నాంధ్రపురమహీందిర మురియన్. | 37 |
| గీ. | అని వచింపఁగ విని సోదరుని మనంబుఁ గని మరల నొక్కతూరి జవ్వనము నెంచి పటుతరం బగునిండుకౌఁగిట గదించి యన్న తమ్మునిలో నభిన్నాత్ముఁ డయ్యె. | 38 |
| కాపయనాయని విక్రమము |
| క. | ప్రోలయ యొరవడిలోఁ దన శీలముఁ గౌశలముఁ దీరుచేసికొనిన వి ద్యాలలితుఁ డతఁడు కృతియై కాలము నెదురుకొనె నోరుఁగలు నార్జింపన్. | 39 |
| ఉ. | కాపయవీర నాయకతకల్మిని సంగడికాఁడు వేమపృ థ్వీపతిబల్మి సాగిన యదీన బలోద్ధత జైత్రయాత్రకున్ దాపయి దైవ ముజ్జ్వలవిధా పరిణద్ధ నిశాతహేతి వి ద్యాపటుతన్ ఘటింప దురమయ్యెను బెల్లుగ నోరుఁగల్లునన్. | 40 |
| మ. | చెడుగుంబోకడ మూఁక పైఁబడఁ గురుక్షేత్రంబునన్ నాఁటి క వ్వడినిన్ గృష్ణుఁ దలంచి వేముఁడును గాపానాయఁ డోర్గల్లునన్ గడముట్టించిరి వైరివారము; నడంగంజేసి రవ్వారి సం దడి; సాఁగెన్ నిజపక్షశంఖజయనాదస్ఫోట మాటోపమై. | 41 |
| చ. | తనకనుసన్నకుం గడచిదాఁటిన సింగమునైనఁ బట్టి యూఁ పిన పెనుజోదు; తన్ను వలపించిన యెవ్వనికేనిఁ బ్రాణమి చ్చిన నెఱసాదు; తెల్గుసిరి చిందినఱేఁడు ప్రతాపరుద్రుఁ డె క్కిన మహితాసనంబు చెలఁగెన్ విలసన్మతి కాపనేతకున్. | 42 |
| వ. | ఓరుఁగల్లురాజ్యపీఠాధిష్ఠితుండగు నాఱేఁడు మఱియు విక్రమించి తెలుంగాణెమ్మునఁ బలుసీమలు స్వాయత్తము గావించుకొనియె; మెదుకుసీమ, కైలాసకోట, భువనగిరి మున్నగుప్రాంతము లెల్ల నాకాపావనీశ్వరు నేలుబడికి వచ్చి యందగించెఁ; దన రాజ్యమునకు దక్షిణమునఁ గృష్ణాతరంగిణియు నాగ్నేయమ్మున గుండ్లకమ్మయు సరిహద్దులుగనుండ నిర్ణిరోధంబుగా నాతండు పరిపాలనంబు నెఱపె. | 43 |
| క. | మును గాకతీశ్వరుల దొర తనమునఁ గలనేలయెల్లఁ దనరాచఱిక మ్మున లే దనుకొఱఁత యొకటి వినా వెలితిలేదు కాపవిభునేలుబడిన్. | 44 |
| గీ. | ఎడఁదపండిన యా తెన్గుపుడమిఱేఁడు కడలికరడులఁబోనికాంక్షలకుఁ బోక తాను బట్టినదానఁ బెత్తనము నెఱపి ధరణినెల్ల స్వధర్మతీర్థము నొనర్చె. | 45 |
| వ. | కాపభూపాలునేలుబడి యిట నిట్లు సాగుచుండుటయు నట దౌలతాబాదురాజ్యంబున ‘నలావుద్దీన్ హసన్సా గంగు బహమనీ’ పట్టాభిషిక్తుం డయ్యె; నాతండు - | 46 |
| మ. | తలఁపుల్ పెంపుగ నన్యరాజ్యముల కుద్దండించుచున్ దండయా త్రలు సాఁగించి పరాళినొంచి వెరవారం బెంచె రాజ్యంబు; నం తలు వీరుండును గాపనాయక సముద్యద్రక్షణోదగ్రమౌ తెలుఁగాణెంబును దేఱిచూచుటకు సందేహించె భీ మందుఁడై. | 47 |
| వ. | గడుసరియగు నబ్బహమనీ కాపయతో నెయ్యంబు నెఱపినట్లు మెలంగుచుఁ దూర్పుదెసనుండి యెప్పుడో ముట్టడించుటకు వయిపువాటములు కనిపట్టుచుండె; నంత - | 48 |
| క. | ఒకట నకస్మా దుద్ధృత సకలాయుధకరులు రాజ్యసముపార్జన కౌ తుకులు తెలుంగాణెముఁ బూ నికి ముట్టడిగొనిరి బహమనీవిభునిభటుల్. | 49 |
| వ. | ఆ ముట్టడిలో నిందూరు కైలాసకోట మున్నుగాఁ గొన్ని రాజ్యభాగములు తురుష్కరాజాక్రాంతము లగుటయుం గాపయనాయకుం డధీరుండుగాక యప్పటి కుచితంబగుపాడిమెయి యబ్బహమనీ సులతానుతోఁ బొందుఁగావించుకొనియె - | 50 |
| గీ. | ఎదిరి బలియైనఁ దాను నున్మదుఁడుగాక పొందుగోరుట ధర్మువుపొలుపుగాదె! పిదప నదనెంచి పరునొంచి పేర్మిఁగనుట కాదె రాజులనీతి విక్రమమురీతి! | 51 |
| గీ. | కెరలి సులతాను పట్టిలాఁగిన తెలుంగు పుడమిపడఁతిచెఱంగుఁ గొప్పు విడిపించి వీని దుశ్శాసనతఁ ద్రుంచివేయుదు నను తలఁపు కాపయభీముండు నిలుపుకొనియె. | 52 |
| గీ. | అచిరకాలములో సమయమ్ము నెఱిఁగి పట్టినతలంపుఁ గార్యరూపమునఁ బెట్టెఁ దొలఁగినధరిత్రి కలికిచూపులు తొలంకఁ బోయి కాపయనేత కెంజేయిఁ బట్టె. | 53 |
| ఉ. | నేరుపుపెంపునన్ బహమనీపతి పౌజులతోడఁ జేయు న ప్పోరునఁ బద్మనాయకులు పోటరులై రణధీరులై పుర స్కారపథంబునన్ విజయసాధనసేయుట ముచ్చటించి యిం పారఁగనిల్పెఁ గాపయ శిలాక్షరవాసిత శాసనావళిన్. | 54 |
| చ. | తఱిఁగిన హైందవమ్ములగు ధర్మనిబంధనముల్ పునఃపురా పరిగతవైభవోదయ విభాశుభమూర్తులఁ గందళింప సుం దరముగఁ బెంపుసెందె నమృతప్రతిరూపమనః ప్రవృత్తిభా స్వరుఁ డగు కాపభూవరుని చల్లని చక్కని మేలియేల్బడిన్. | 55 |
| వ. | అక్కాపమహీపాలు ననంతరము త్రిలింగసామ్రాజ్యకమలాగ్రైవేయకంబునం బ్రోలయవేమారెడ్డి యొక సముజ్జ్వల మణి. | 56 |
| ప్రోలయవేముని పాకనాటిరాజ్యస్థాపనము |
| సీ. | సకలాంధ్రమునకు నేలికవీరరుద్రుని । పరిపాలనమునాఁటి పాటవమ్ము తొలియుద్యమమున దారులుచూపి నడపిన । ముసునూరిప్రోలయ్య మొక్కలమ్ము నోరుగల్లున శాత్రవోద్ధతిఁ గెడపిన । కాపావనీపతి కత్తిపదను పాషాణమందుఁ బీయూషమ్ముఁ బొంగించు । గంగదేవుని యంఘ్రికమలరజము | |
| గీ. | సత్త్వమసృణమ్ము శంభుదాసకవికవిత । కలయ నొక్కమనోహరాకార మెనయు రెడ్డిప్రోలయవేము కీర్తి భవనమునఁ । తెలుఁగువారి కిహాముత్రఫలము విందు. | 57 |
| మ. | గణరాత్రంబు లహర్దివంబులును దీక్షాలక్ష్మితుండైన వే మునిడెందంబునఁ జేర దొండొకతలంపున్ నాఁడు; నిండారు ద క్షిణదిగ్భాగము ‘పాకనాట’ ననురక్తిన్ రెడ్డిసామ్రాజ్యసం స్థ నఖండస్థితి నిల్పఁజూచునభిలాష మ్మొక్కఁడే తక్కఁగన్. | 58 |
| చ. | అకృతకభక్తిమైఁ బ్రభుజయార్థిత మేనులు దాఁచుకోని సై నికులను వేనవేల నవనీపతి వేముఁడు సేకరించి వా రి కొకకొఱంతలేక సవరించి యధీనతలోనఁ జేర్చియుం చుకొనె భవిష్యదాహవరుచుల్ మదిఁ బెంపయి తీవరింపఁగన్. | 59 |
| చ. | తన సమరోద్యమమ్మునకుఁ దమ్ములు నన్నయుఁ దోడునీడలై కనఁబడ ధర్మవేమమహికాంతశిఖామణి దక్షిణాంధ్రమే దినిపయి జైత్రయాత్రకు మదిందలఁపై యొకనాఁడు ఘోడెరా యని గురుదేవుదర్శనము నందెఁ గృతాంజలిబంధుఁ డాదటన్. | 60 |
| సీ. | దొరయౌచు సిరిమలతూర్పువాఁకిలి నేలు । త్రిపురాంతకుని కృపాశ్రీకి నెలవు అంబదేవస్వాంతరంగ పంకజ కుట్మ । లోద్యానమునకు భానూదయంబు పట్టిసపుర పాశుపతపీఠ నివసదం । తేవాసితతికి నాందీకరుండు వేదశాస్త్రపురాణ విద్యావనీవీథి । కాంతర్విహారి పంచాస్యవిభుఁడు | |
| గీ. | రాజనీతికి ధర్మవర్తనము నేర్పి । జగము నలరించునట్టి యాచార్యమౌళి యీడులేనిమహాయోధు ఘోడెరాయ । గంగదేవుఁడు కరుణాప్రసంగుఁ డపుడు. | 61 |
| వ. | వేమేశ్వరు నాశీర్వదించి కూర్చుండ నభ్యనుజ్ఞ యిడుటయు నతండు వినీతుండు ఘోడెరాయదేశికోత్తమున కిట్లు విన్నవించె - | 62 |
| క. | “శ్రీగురుదేవ శుభాశీ రాగమమంత్రాక్షతముల కౌదల నిడి యు ద్యోగింప శిష్యవితతికి లోఁగని కర్జంబు లవనిలో లే వెందున్. | 215 |
| ఉ. | కూడినదానితోఁ దనియఁగూడదె! యెక్కడ లేనియాస ముం దాడఁగ సర్వరాజ్య మొకఁడై భుజియించుతలంపు గల్గియు న్నాఁడఁ; దదాశ నీదయవినా నశియింపఁగ దారిలేదు; కేల్ మోడిచి కొల్తు శాంతిసుఖముల్ దయసేయుము నాయెడందకున్. | 64 |
| వ. | మహాత్మా! యిచ్చోటికి నావచ్చుటకుం గారణము దక్షిణదేశ విజయయాత్రారంభంబున నాచార్యునాశాస్యంబుఁ బడయు నభిలాషయ; కాని, యజిహ్మబ్రహ్మవర్చసప్రసన్నంబైన గురువదనారవింద మరసినపదంపడి నా వాఙ్ముఖంబు మఱియొకతీరుం బట్టుచున్నయది నాకుం గర్తవ్య మాదేశింపుఁ” డని వేఁడుకొనుటయు నాఘోడెరాయగంగదేవుండు ప్రోలయవేమభూవరునివంక వాత్సల్య సంపత్సమార్ద్రంబగు చూపు నిగిడించి జటిలహాస ప్రరోహపురస్సరంబుగా నిట్లు వచించె - | 65 |
| మ. | ఒకసేనాగణశక్తితోఁ గడఁగి యుద్యోగింప రాగించు భౌ తికసామ్రాజ్యమె లోఁగఁజేసికొనవైతే నింక శ్రద్ధాతపో ధిక నిష్ఠాభినివేశగమ్యమగు శాంతిశ్రీసుధా రమ్యకుం డిక నీచేతికి నందునే! గడుసురెడ్డీ! దొడ్డయాశాగతుల్! | 66 |
| చ. | అహితుల నుక్కడంచి రుధిరాన్నము మెక్కుతలంపులేని నీ మహితమతంబుతో నిపుడు మాయెద యేకముకాదు; మాతృదే శహితలసన్మతిన్ స్వమతసంగ్రహణమ్ము స్వజాతిధర్మసం గ్రహణముగాఁ గడంగిన పరప్రతిహింస యహింసయే యగున్. | 67 |
| ఉ. | ప్రోలయకాపయల్ మతినిరూఢులు ధీరతమై నరాతిజం బాలపుగోతిలో గళముబంటిగఁ గ్రుంగి యొఱంగురాజ్యల క్ష్మీలసమానధర్మగవిచిక్కులు వాపిరి; నీవు తత్పరీ పాలనబద్ధకంకణ తపస్సుకృతంబున కుద్యమింపుమీ! | 68 |
| ఉ. | అంగబలంబు నర్థబల మాధృతరాష్ట్రజనాభిమాన సం సంగబలంబునున్ గదపఁజాలని కంబములై తగన్ జగ త్రాంగణవీథి రెడ్డినృపరాజ్యరమాసతికి న్నివాస మె న్నంగల యొక్కవజ్రభవనంబును నిల్పు మనల్పవైఖరిన్. | 69 |
| గీ. | అనుచుఁ గోమటివేము హృదంతరమున రవులు కాంక్షాగ్ని నివురూది రాఁజుకొలిపి దేశకాలసంవేదియౌ దేశికుండు వెండి యిట్లు వచించె నవ్విభునిఁ గాంచి. | 70 |
| వ. | వేమా! రెడ్డిసామ్రాజ్యసంస్థాపనం బన్న ధర్మసామ్రాజ్యము నిలుపుటగాఁ దలంపు; మిట్టిసమయంబున నీ వంటివీరుల కేరడంబు ధర్మాఘాతమునకు హేతు వగును; నృపాలుండు యద్ధర్మావలంబి ప్రజలు తద్ధర్మావలంబు లగుదురు కావున - | 71 |
| చ. | అటు తెలుగాణముం బువులయం దిడి హైందవధర్మసింధు వు త్కటగతిఁ బొంగులై పొరలఁ గాపయభూపతి రాజ్య మేలు; నీ విటుదెసఁ బాకనాఁటిధరణీశత రెడ్డిమహాధిరాజ్య సం ఘటన మొనర్పుమీ! బహుముఖప్రతిదారణ హేతినైపుణిన్. | 72 |
| వ. | అని పలికి యూరకుండిన ఘోడియరాయమౌని కటాక్షంబున బద్ధుండై నిబద్ధాంజలిపుటుండగు వేమవిభుండు - | 73 |
| క. | ఇది యొకయుపదేశం బి య్యది యొకయాదేశ మిదియు ననుశాసన మి య్యదియగు నాచార్యులయెద మొదలం గల యాశిషం బమోఘము నాకున్. | 74 |
| గీ. | ఒక్కసంశయ మెడలించి, యొక దురాశ మొదలు ఖండించి, శౌర్యంపుఁబదను పెంచి ధర్మరక్షణదృష్టిఁ బ్రత్యగ్రమైన యొక్కయుత్తేజ మొసఁగు గురూదితమ్ము. | 75 |
| వ. | అని వచించి హర్ష బాష్పబిందూద్గమసుందరమ్మగు కన్నుంగవచే గంగదేవగురుచరణుల యడుగుఁదామరల నద్దుకొని తదనుజ్ఞాతుం డద్దంకిఁ జేరుకొన్నవాఁడు - | 76 |
| శా. | ప్రాణప్రాణములౌసహోదరు లుదారస్ఫారతేజోనిధుల్ నానాయుద్ధకళారహోవిదులు సైనాపత్యవైయాత్యముం బూనన్ దక్షిణదేశముం గొను తలంపుల్ లోన ఱంపిల్ల వే మానాయం డెదురొత్తె రాణువలఁ; గంపం బెత్తె దిగ్భిత్తికల్. | 77 |
| సీ. | అవసన్న సమదశాత్రవుఁడు బాహాబల । శ్రీనిధి ‘యన్నసేనాని’ యొకఁడు ‘కురుమలూరి’ పురంబు పరిపాలకుండైన । ‘మల్ల’ సేనానేతృమణి యొకండు తండ్రిచాటునను గుప్తమగు విక్రమదీప్తి । దృప్తుఁడౌ ‘ననపోతరెడ్డి’ యొకఁడు తన మేనమామ పుత్రకుఁడు శౌర్యోజ్జ్వల । ద్రేఖాకుఁడగు ‘నూకరెడ్డి’ యొకఁడు | |
| గీ. | జైత్రయాత్రను దనకు బాసట యొసంగ । వేమభూమిబిడౌజుండు వీరమౌళి యభినవంబగు రెడ్డిరాజ్యమ్ము నిలుప । దాడి వెడలించె నరినికృంతనమనీష. | 78 |
| సీ. | దవుదౌల నుండి వేమవిభు నశ్యశ్రేణి । డెక్కచప్పుడుల గుండియలు వ్రస్సి పోరితమ్ములఁ గాఁకదేఱిన రెడ్డివీ । రుల గాలితాఁకునఁ దలలు వ్రాలి సకలాశలఁ గదల్చు సమరభీకరభేరి । యులివులఁ జెవుల డప్పులును బగిలి చదలు రాఁచుకొను న మ్మదపుటేనిక చాలు । నరసినంతన యసూత్కరము లొరఁగి | |
| గీ. | సమరవీథిని హతశేషశత్రుతతికిఁ । గరుణ గదురంగ శరణమ్ముఁ గనికరించి యసదృశపరాక్రమమునఁ బర్యాప్తుఁడైన । రెడ్డివేముండు పరపాళి నొడ్డి నిలిచె. | 79 |
| క. | తనవేయుచున్న యనుపద మునకున్ జయలక్ష్మి ముందుముందయి నీరా జన భాజన హస్తాంభో జనియై వేమునకుఁ జెప్పె స్వాగతవాణిన్. | 80 |
| క. | తుఱఁగలిగొను గురుదేవుని కరుణకు నిరవగుచు సమరకార్యము జయబం ధురమై దేసటి వేమే శ్వరు డెందంబునకుఁ జలువచందన మలఁదెన్. | 81 |
| మ. | గిరిదుర్గంబుల నొక్కఁడొక్కఁడును లొంగెన్; బాకనాఁటన్ స్వతం త్రరమాప్రాజ్యము రెడ్డిరాజ్యమును సంస్థాపించువేమావనీ శ్వరుపైఁ గొల్వున సర్వపండితుల యాశాస్యప్రసూనాక్షతల్ కురిసెన్; ఘోడియరాయదేవఋషివాకుల్ గాఁగ సత్యార్థముల్. | 82 |
| వ. | మ్లేచ్ఛాబ్ధికుంభోద్భవుండై దక్షిణదేశంబు సర్వం బాక్రమించి యేకరాయస్థాపనాచార్యుండు నేకసింహాసనాలంకారుండు నగు కోమటి వేమభూమీపతి తనచే నాక్రమింపఁబడిన దుర్గంబు లనుజ తనుజ బాంధవ సుహృజ్జనంబుల కిచ్చి వారిచేఁ బాలింపఁజేయుచుఁ దాను జుట్టపుమేరు వనుపేరు వడసె; నతం డాక్రమించినవి ధరణికోట, వినుకొండ, బెల్లముకొండ, కొండవీడు మున్నయిన యశీత్యధికదుర్గంబులు కలవు. ధర్మపతిష్ఠాగురుండు, నపరిమితభూదానపరశురాముండు, ననవరతపురోహితకృతసోమపానుండు, హేమాద్రిదాననిలయుండును, ఘోడెరాయగంగ గురుకృపాస్థాపితసామ్రాజ్య సముద్దీపితుండును, నియమవచ్చేతస్స్థ మృత్యుంజయుండు నగు ప్రోలయవేమారెడ్డి యసాధారణుండు - | 83 |
| సీ. | శ్రీమత్పరాక్రమక్షేత్రమ్ము పంటవం । శము కళ్ళమున రాజనములరాశి యన్నమాంబా ప్రోలయాఖ్య దంపతి గర్భ । నీరనిధాన మణీశలాక హరివంశకావ్యబంధుర కవిత్వోదాత్త । సత్త్వోపబృంహితోచ్చతరకీర్తి శివపదద్వంద్వైక సేవాఫలాహూత । భూసురాశీఃపుష్ప పుణ్యమూర్తి | |
| గీ. | శ్రీశిలోచ్చయాహోబలక్షేత్ర విహర । దఖలయాత్రిక భక్తకోట్యంతరంగ పట్టభంగపథారూఢ పరమసుగతి । విమలధర్మోల్లసత్కృతి వేమనృపతి. | 84 |
| క. | హరివంశపు ముత్తెపునెఱి సరిలో సూత్రమగు రెడ్డిచారిత్రం బీ ధరణి గలయంతకాలము తిరమై కొనసాఁగుఁ దెనుఁగుదేశపు వెలుఁగై. | 85 |
| అనపోతారెడ్డి : కొండవీటిరాజ్యము |
| మ. | తనకున్ దత్తకుమారుఁడైన యనపోతారెడ్డి రాజ్యంబు పా లనముం జేఁతకు నర్హుఁడౌటఁ గని యుల్లంబందు సంతృప్తిఁ జే కొనె నాప్రోలయవేముఁ; డీతఁ డిఁక శక్తుండై వెసన్ స్వార్జితం బున కత్యూర్జితమౌ ప్రతిష్ఠ కొకసొంపున్ దెచ్చునం చెంచుచున్. | 86 |
| మ. | ఒకయెడ దుర్జయుల్ సమరయోధులదాడియు, నొక్కవైపు సు ప్రకటిత శౌర్యులౌ విజయపట్టణవీరులు సేయుదాడి, వే ఱొకదెస నక్కళింగవిమతోద్ధతయాత్రయు నొక్కఁ డొక్కఁడై తికమకపెట్టఁజూచె రణధీరుని న య్యనపోతభూవరున్. | 87 |
| గీ. | ఎత్తివచ్చినపరుల రాయిడికి నోర్చి ప్రతిభటించెను సకలాహవమ్ములందు విజయ మార్జించె ననపోతవిభువతంసుఁ డరులు నిజవిక్రమమ్ముఁ గొండాటసేయ. | 88 |
| గీ. | తఱచు శాత్రవదండయాత్రలకు లోఁగు ననుచు ‘నద్దంకి’ వీడి యయ్యవనినేత యరిదురాలోక గిరిదుర్గమైన ‘కొండ వీడు’ దనరాచవీడుఁ గావించుకొనియె. | 89 |
| వ. | నాటంగోలెఁ గొండవీటిరెడ్డిరాజ్యం బనుప్రసిద్ధి యేర్పడియె; నటు లన్నపోతారెడ్డి శూరుండుగా ధర్మవీరుండుగాఁ బేరు వడసె; నతనితరువాతఁ దత్సహోదరుం డనవేమారెడ్డి సింహాసనాసీనుం డయ్యె. | 90 |
| అనవేముని వితరణము |
| మ. | మనుశాస్త్రోదితరీతి నెంచి యనవేమారెడ్డి ‘ధర్మాన్న వే మన’గాఁ గీర్తితుఁ డయ్యె దేశమున; సంపద్వైభవప్రీణితా వనిదేవోత్తమకోవిదుండయిన భూపాలుం డతం డన్నకం టెను దా మిన్నయనంగ నేలుబడి నూనెన్ దానతాత్పర్యుఁడై. | 91 |
| సీ. | అనపోతవిభుమౌళి యనుఁగుసోదరియైన । దొడ్డాంబికకుఁ గన్నబిడ్డఁ డగుట మేనమామకొమార్తె యౌనన్నమాంబను । బరిణయం బాడినవరుఁడు నగుట మాతామహస్థాన మహితవైభవ భోగ । సుచిరానుభవకృతజ్ఞుండు నగుట ధర్మానపేతరాట్తంత్ర విజ్ఞాన ని । ర్వహణకళా కుశాగ్రమతి యగుటఁ | |
| గీ. | దాను గాటయవేముండు - మేనమామ । యైన యనవేమునేల్బడియందు నింత వెలితిరాకుండ వేయికన్నులను నరయ । వారి బాంధవ మది చక్కఁ బరిమళించె. | 92 |
| శా. | శ్రీశైలంబుననుండి పెంపెసఁగి యాసింహాచలం బాంధ్రధా త్రీశుం డయ్యనవేముఁ డేలెఁ గృతబుద్ధిన్ ధర్మయుద్ధక్రియా వేశున్ బెద్దనమామిడన్నసుతు నుర్విన్ మంత్రిగాఁగొల్చె స ర్వాశావాసిత కీర్తి కాశకుసుమారామాభిరామమ్ముగన్. | 93 |
| చ. | అతఁడు వసంతరాయబిరుదాంచితుఁడై ప్రతివత్సరంబు నూ ర్జితగతిమై మధూత్సవము సేఁతలఁ జల్లిన చంద్ర చందనా తతమృగనాభికాగురుపదార్థపరంపరఁ బృథ్వియొండె కా దతిశయరీతి ‘గంధవతి’ యయ్యె విహాయస మప్రతర్క్యమై. | 94 |
| కుమారిగిరి : వసంతరాజీయము |
| గీ. | అన్నవేముని పాలనానంతరమ్ము రాజ్యపదభోగి యగు కుమారగిరిరెడ్డి రెడ్డిసామ్రాజ్యరమకు శరీరమైన విమతభీముండు కాటయవేముఁ డాత్మ. | 95 |
| మ. | అవనీనేతలలోఁ గుమారగిరి భాగ్యశ్రీగతిం జెప్పి చె ప్పవలెన్ వేఱొకదాని; నుద్ధతరిపువ్రాతాసు వాతాశనో త్సవసమ్మర్దఫణావిమర్దన గరుత్మన్మూర్తియౌ కాటవే మవిభూత్తంసునితోడిబాంధవము సామాన్యంబె! యాఱేనికిన్. | 96 |
| మ. | అకలంకార్థ సహస్రధాభినయ విద్యాకౌశలీధామ యౌ ‘లకుమాదేవి’ హరిప్రియాసదృశ లీలారూప నాస్థానలా సికగాఁ గాంచుచు నక్కుమారగిరి సుశ్రీనాట్యవేదార్థ సా రకళాచర్వణధూర్వహత్వ మెసలారంగా వినోదించెడిన్. | 97 |
| గీ. | భరతముని భోజదేవాది పండితోక్తు లరసి యభినయశాస్త్రంబుఁ దఱచి రచన చేసె సుకృతి ‘వసంతరాజీయ’ మనఁగ రాజసుందరుఁ డగు కుమారగిరిరెడ్డి. | 98 |
| మ. | వినుతోదారత నక్కుమారగిరి యర్పించెన్ గృతం బెంచి య మ్మనుతుల్యుండగు కాటయప్రభుని వేమారెడ్డి కత్యాప్తబం ధునకున్ మంత్రికి రాణ్మహేంద్రనగరీ దుర్గాదిమత్ప్రాగ్ధరి త్రిని తన్మిత్రకృతాపదాన చరితార్థీభూతచేతోగతిన్. | 99 |
| వ. | కాటయవేముని రాజ్యతంత్రజ్ఞత యెంతటిదో యాతని సంస్కృతభాషావైదుష్యంబు నంతటి దంట కాతండు కాళిదాసమహాకవికృత నాటకత్రయంబునకు రచించిన కుమారగిరిరాజీయాఖ్య వ్యాఖ్యయే సాక్షి. | 100 |
| పెదకోమటివేముఁడు |
| గీ. | కొమరగిరిరెడ్డివెనుక నక్కొండవీటి రాజ్యరత్నకిరీట ధారణచణుండు పెద్దకోమటివేమ భూవిభుఁడు ప్రజలఁ దనియఁ జేసె సమర్థపాలనముకలన. | 101 |
| శా. | శ్రీనాథోదితకావ్యనైషధకృతిస్వీకర్తయై యర్థిసం తానాభీప్సితకార్యనిర్వహణచింతారత్నమై రెడ్డిధా త్రీనాథాభ్యుదయానుశీలనకళాతృప్తాత్ముఁడై వేమభూ జానిన్ బెద్దయసింగధీసచివుఁ డిచ్చం గొల్చె నాసక్తిమై. | 102 |
| వ. | అ ప్పెదకోమటివేమారెడ్డి కొల్వున నుండి వామనభట్టబాణుండు వేమభూపాలచరితాదిసంస్కృతగ్రంథంబులు రచించె; శ్రీనాథుండు తదాస్థానంబున విద్యాధికారిగా నర్చింపఁబడియె - | 103 |
| క. | దాత సమస్తకళాభి జ్ఞాత మహేశ్వరపదాంబుజధ్యాత హిత శ్రోత పెదవేమధరణీ నేత యతం డేలె ధర్మనియతిరతుండై. | 104 |
| వ. | కుమారగిరి యనంతరము కొండవీటి కొడయండగు పెదకోమటివేముండు కాటయవేముని రాజమహేంద్రవరరాజ్యమ్ము నాక్రమింపంజూచి చేసినజైత్రయాత్రలతోఁ గావలసిన యిరువురకును లోపలికలఁతలు పొడముటంజేసి యఖండంబగు రెడ్డిరాజ్యంబు రెండుచీలిక లయ్యెఁ; బెదకోమటివేమభూపతికి రాజమహేంద్రవరరాజ్యంబు దక్కలేదు; కాటవేముం డట వీరశయనంబునందుటయు నతనికుమారుని కుమారగిరిని రాజుగాఁ జేసి మహామల్లుం డల్లాడరెడ్డి కొంతకాల మేల్బడి నెఱపెఁ; అల్లాడరెడ్డికుమారుండు వీరభద్రారెడ్డి నిజాగ్రజుండగు నల్లయవేమారెడ్డి సాహాయ్యంబుఁ బడయుచు బెండపూడి అన్నామాత్యుండు తన కమాత్యుండుగా రాజమహేంద్రవర రాజ్యపాలనాధికారి యయ్యె; నచ్చట - | 105 |
| ఆ.వె. | కొండవీటి పెద్దకోమటివేముండు నమరపతికి నతిథియైనపిదప నట్టిపండితేంద్రు నాత్మజన్ముండైన ‘రాచవేముఁ’ డందె రాజపదము. | 106 |
| గీ. | ప్రజల బాధించె వృద్ధగౌరవము నొంచెఁ బురిటిమంచములకుఁ బన్ను పుచ్చుకొనియెఁ జెఱకుతుద వెన్నువలెఁ బుట్టి చెఱచెఁ గొండ వీటియేల్బడిపస రాచవేమరెడ్డి. | 107 |
| గీ. | అతఁ డొకనిమిత్తమాత్రమ; యంతెకాని విజయపురిఱేండ్ల బహమనీవిభుల బహుళ సమరయాత్రలు జాతివైరములు పెరిఁగి యచటిరడ్డులయేల్బడి యడలువడియె. | 108 |
| పోతురాజుకటారి |
| మ. | అనుజన్ముండగు వీరభద్రవిభుచే నల్లాడవేముండు పా లన సేయించెను రాణ్మహేంద్రవరలీలారాజ్య; మాపెంపు నెం తనివర్ణించుట! వారి దిగ్విజయ సంధావ్యగ్ర శౌర్యాగ్ని కిం ధనమైపోయె నరాతివీరఘటితోద్యన్ముష్కరారంభముల్. | 109 |
| శా. | సారోదార తరంగశీకర సుధాసంబంధవద్గౌతమీ తీరోత్సంగిత రాణ్మహేంద్రపురధాత్రీ దేవతామూర్తిఁ జె ల్వారం గొల్వఁగఁ గొండవీడునకు దవ్వైవచ్చి శ్రీనాథుఁ డా ధారంబయ్యెను వీరభద్రమహినాథ శ్రీయశోవల్లికిన్. | 110 |
| ఉ. | తీవరమెంచి మున్ వెలమధీరుఁడు లింగమనీడు మించి యు ద్ధావనిఁ గొండవీడు గెలుపంది తమిన్ విజయాంకదీర్ఘ శం పావినిశాతమౌ నొకకృపాణము రెడ్లకుఁ బ్రాణభద్రమున్ దేవరకొండకుం గొని చనెన్ గనదూర్జిత శౌర్యమూర్తియై. | 111 |
| ఆ.వె. | నాఁడు రెడ్లకొండవీడునఁ బరదురా లోక ధాళధళ్య లోలదీప్తిఁ బొలుచు ‘నందికంత పోతురాజు కటారి’ నేఁడు వెలమదొరలజాడఁ జేరె. | 112 |
| మ. | ఉరుబాహాబలరెడ్డివంశభవ వీరోపార్జితంబైన త త్కరవాలం బటు వెల్మజోదులకుఁ గాఁగా, లోన నల్లాడ భూ వరపుత్త్రుల్ తలవంపుగాఁ దలఁచియున్ బాటించి సాధించు న త్తఱికిన్ వేచిరి పద్మనాయకవిభుత్వం బప్రధృష్యంబుగన్. | 113 |
| క. | లోకజ్ఞుఁడు శ్రీనాథ మ హాకవి యారెడ్డిఱేండ్ల యాంతర్యమ్ముం జేకొని కృతజ్ఞతన్ గా ర్యాకలన కళా వినిర్వహణ తత్పరతన్. | 114 |
| గీ. | పోయి దర్శించె నల పద్మనాయకాన్వ వాయ కౌస్తుభమణిని సర్వజ్ఞసింగ బుధునిఁ గవితారసార్ణవ పూర్ణవవిధుని నఖిలశాస్త్రకళాప్రవేశాతిరథుని. | 115 |
| క. | పరశివ కపర్ద నిపత త్సురధుని కెనయైన దివ్యసుందర కవితా స్ఫురణమ్మున శ్రీనాథుఁడు సరసుం డవ్వెలమదొరకు సంతోష మిడెన్. | 116 |
| ఉ. | దేవరకొండలో వెలమధీరుఁడు ‘లింగమనీడు’ రావు సిం గావనినేతకుం జెలియు నాతనిపట్ల వినీతుఁడై తదా జ్ఞావిధిలో మెలంగు నను చాయనెఱింగి నిజేప్సితంబు నా భూవరుసన్నిధిన్ వినిచెఁ బొందికఁ గర్జముఁ జక్కఁబెట్టఁగన్. | 117 |
| గీ. | సుకవితాస్నేహదీప్తి సూచికయుఁగాఁగఁ బోతురాజుకృపాణముం బుచ్చుకొన్న ధీరుఁ డల్ల శ్రీనాథుని తెల్వియందు వెలమఱేండ్ల గుణజ్ఞత తొలకరించె. | 118 |
| ఆ.వె. | రాణ్మహేంద్రవరపు రాజ్యంబు చెల్వారఁ గత్తితెచ్చి యిచ్చెఁ గవివరుండు; వేమధరణివిభుఁడు, వీరభద్రారెడ్డి వీడుకొనిరి కొండవీటిఋణము. | 119 |
| ఉ. | వైదికధర్మనిర్వహణవైభవగాథ త్రిలింగధాత్రి గా ధోదకమత్స్యమై సడలుచుండిన కాలమునందు రెడ్డి భూ మీదయితుల్ దయాగుణసమీహితచిత్తులు తత్పునః ప్రతి ష్ఠాదరవృత్తులై సితయశోమృతనిర్ఝరి నింపి రెల్లెడన్. | 120 |
| రాచకొండ వెలమప్రభువులు |
| క. | పరపరిపాలన మనువా గురఁ దొఱఁగి స్వతంత్రదీప్తిఁ గొనిన త్రిలింగ స్థిరపై వెలసిన పలు రా చఱికమ్ముల రాచకొండసంపద యసదే! | 121 |
| క. | కాకతిగణపతిదేవ మ హీకాంతుని కొలువుచేరి యెసఁగిన మహిత శ్రీకులలో రేచర్ల ప్రాకటవంశమున కొక్కరాణ తనర్చున్. | 122 |
| మ. | తిరమౌ రుద్రమదేవియేల్బడి నరాతివ్యూహ నీహారమున్ దెరలంజేసిన వెల్మవీరుఁడు ‘ప్రసాదిత్యుండు’ పెంపొంది యు ర్వరపై నిండుగఁ బద్మనాయకలసద్వంశంబుఁ బండించె భా స్వరుఁడై మించెను గాకతీయనృపరాజ్యస్థాపనాచార్యతన్. | 123 |
| గీ. | అల్ల కాంచీపురీవిజయమ్ములోన దాచనాయడు తాను బ్రతాపరుద్ర పతికి రణవీథి మేటితోడ్పాటు నిచ్చె వెలమవంగడమున కొక్కవిలువఁ దెచ్చె. | 124 |
| గీ. | దారుణ తురుష్కరణవీథి ‘దాచనేని’ తనయుఁ డగు సింగముండు ప్రతాపరుద్ర నేతకు సహాయుఁ డగుచు నశీతివరము లందె; నాఱేని మెప్పుల నందుకొనియె. | 125 |
| ఉ. | సంగరవీథులన్ నిజనిశాతకృపాణ వినోదఖేలనా స్తంగమితారియై విజయసాహసుఁడై రహి సంచరించి శ్రీ సింగమనీడు కాపవిభుసేఁతకు బాసటయై స్వతంత్రతా రంగమునందుఁ దా నొక ధురంధరభూమిక నంది రాజిలెన్. | 126 |
| మ. | అరినిష్కాసనవేళఁ గాపయకుఁ దోడై పోయి, యావెన్క రా జ్యరమాభోగముపైఁ దలంపు సహజంబై యుండుటంజేసి సం గరముల్ చేసి పరాక్రమించి బహుదుర్గశ్రేణి నార్జించెఁ ద త్పరభావంబున వెల్మసింగముఁడు స్వాతంత్ర్యంబు నిండార్చుచున్. | 127 |
| గీ. | తరముమీఱిన రాజ్యవిస్తరణ వాంఛ జల్లిపలికోట ముట్టడి సాఁగునపుడు సింగమవిభుండు సోమవంశీయులైన క్షత్త్రియుల కత్తివాత విశ్రాంతుఁడయ్యె. | 128 |
| వ. | సింగమనేనియుత్సంగంబునఁ బెరిగిన తనయద్వయంబున ‘అనవోతానేడును, మాదానేడును దండ్రిని మించిన జోదులై నిజపితృనిర్యాణమునకు నిమిత్తంబైన చంద్రాన్వయక్షత్త్రియసందోహమును మ్రందించి జల్లిపల్లిదుర్గంబు నాక్రమించి సోమకుల పరశురామ బిరుదాభిరాములై భాసిల్లిరి; వారిలో ననపోతానాయండు. | 129 |
| ఆ.వె. | ‘అనుమగల్లు’ విడిచి యట రాజగిరిలోన వెలమరాచఱికము వెలయఁ బెంచి కెరలి యాక్రమించెఁ గృష్ణానదికి దక్షి ణమునఁ గలుగుతెలుఁగునాఁ డదెల్ల. | 130 |
| మ. | అనపోతావనినేత రాజగిరిరాజ్యంబెల్ల భోగించి త న్పునకుం బోవక వంతులేనిబలవంతుం డౌట నోర్గల్లు కో టను ముట్టన్ దమకించి కాపవిభు నొడ్డారించి యోడించె; జో దునకున్ భోజ్యము రాజ్య మన్ననుడియందున్ లేవు స్నేహస్పృహల్. | 131 |
| మ. | అటు లోరుంగలు పద్మనాయకనృపాలాధీన మయ్యెన్; శిరో ఘటితాంజ ల్యుపరంజిత స్తుతివచఃకల్యాణులై వీరు లు త్కటభక్తిన్ దనుఁ గొల్చుచుండఁగఁ దెలుంగాణెంబు నేలెన్ సము ద్భట శౌర్యోదయ దుష్ప్రధర్షుఁ డనపోతానాయఁ డూర్జస్వియై. | 132 |
| గీ. | అతని తమ్ముఁడు మాదనాయఁ డను నృపతి యన్నయానతిఁ బ్రాతినిధ్యమ్ముఁ బడసి కోర్కి నిండార దేవరకొండ నేలె; నటులు రేచెర్ల వెలమరాజ్యము తనర్చె. | 133 |
| వ. | అనపోతానేని యనంతర మా వీరుని యాత్మజుండు ‘సింగమనేడు’ రాచకొండయేల్బడి కొడయం డయ్యెఁ; గుమారసింగభూపాలుం డనుపేరఁ బ్రసిద్ధుండైన యాతండు త్రిలింగదేశప్రభుత్వంబు నెఱపుటయకాక దేవభాషావైదుష్యంబున నఖండప్రాభవంబుఁ బ్రకటించె; కల్యాణ ధరణీపాలుండు సింగభూపాలుండు సర్వజ్ఞచూడామణియై ‘రసార్ణవసుధాకరం’బను నలంకారశాస్త్రగ్రంథంబును, ‘రత్నపాంచాలిక’యను రమణీయనాటికయును, శార్ఙ్గదేవుని సంగీతరత్నాకరమునకు సంగీతసుధాకరాభిధవ్యాఖ్యయు రచించిన విద్వత్కవియగుటయకాక, ‘చమత్కారచంద్రికా’ కృతిప్రణీత యగు విశ్వేశ్వరకవిని, నమరకోశవ్యాఖ్యాత యగు బొమ్మకంటి అప్పయార్యుని నిజాస్థానవిద్వాంసులుగా నుంచి సంభావించిన గుణజ్ఞుండు - | 134 |
| గీ. | రావుసింగమహీపాలు ధీవితాలు దర్శనముచేసికొని శారదాస్తవంబుఁ బలికె శ్రీనాథకవిసార్వభౌముఁ డతని సాహితీప్రాభవమున కాశ్చర్యపడుచు. | 135 |
| ఆ.వె. | రాచకొండ వెలమరాజ్యమ్ము సింగభూ పాలుఁ డేలునాఁటి కాలమునకుఁ బరమభక్తచక్రవర్తి పోతనకవి రసకవిత్వసృష్టి ప్రాణయష్టి. | 136 |
| సీ. | గోపాలశిశుమౌళి కుటిలకుంతలపాళి । వక్రోక్తిలీల రాఁబట్టినాఁడు వ్రజబాలు సుషిరరావమున నవిచ్ఛిన్న । వాఙ్మహస్సులు గిలుబాడినాఁడు వెన్నునితలనెమ్మిపించెమ్ములో వర్ణ । విన్యాసరుచిఁ గొల్లఁబెట్టినాఁడు నవనీతదస్యువెన్నడి సమాసపువెన్న । పూసలు కొసరి కాఁజేసినాఁడు. | |
| గీ. | లేదుపో! తనకెక్కడి పేదతనము! । భాగవతరూప జాతరూపమ్ముధనము నతఁడు రాసులువోసె సర్యాంధ్రజాతి । కారగింపుగ రసమయం బైనయాస్తి. | 137 |
| పర్వాంతము |
| క. | వినిపించితిఁ బంచమ మీ పునఃప్రతిష్ఠాఖ్య పర్వమును; సత్యముఁ జె ప్పిన నబ్బా! యిది బిందువు చినుకుట కదె! రెడ్డిరాజ్య సింధువునందున్. | |
| శా. | నాచే నీచరితప్రబంధ మిటు సందర్భింపఁగాఁ జేసి మై త్త్రీచిహ్నంబుగఁ బద్మనాయక కులశ్రీవల్లభౌదార్య స ధ్రీచీనంబుగ నిల్పనెంచితివి తండ్రీ! విక్రమోదాత్త శి క్షాచండాశువు వెల్మవంగడ మనంగా నెయ్య మిట్లొప్పెడిన్. | |