| కావ్యములు | ఋతుఘోష | గుంటూరు శేషేంద్ర శర్మ |
|
| జీవన ఖేల |
|
ఓయి లతా ప్రవాసి! పద వోయి జిలేబి గులాబి తోటలన్ బ్రేయసి బాహువల్లికల బేశల కావ్య మరందగానముం జేయుచు ఖేలగా జనుము జీవితమే ఒక పూలబాటగా హాయిగ తీయగా ఒక ఖ యాముగ నీదు హయాము సాగుతన్. |
|
ఓయి సఖా! సుఖింపు, మధు- రోహలు డోలికలై చలింప చాం పేయలతావితానములు వేణువులున్ విరబూయు కోనలో తీయని నిర్ఝరీ పులినతీర కుటీర పటీర శీతల చ్ఛాయల కోయిలల్ సలుపు శ్రావ్య రవమ్ముల నాలకించుచున్. |
| వలపు |
|
మల్లెలు పూచె బాల సుకు మార సమీరము వీచె నిండు జా బిల్లి దిశాంతరాళముల వెన్నెలకాచె మనోవనస్థలీ పల్లవశయ్యలం బ్రణయ భావశకుంతము నిద్రలేచె నో హల్లకపాణి రావె భర మాయె వియోగ రసార్ద్రవేదనల్. |
|
అల్లిన రాగవల్లికల కాశ్రయమై విలసిల్లు నీవు నా పల్లవ కోమలంబయిన భావము సుంత యెఱుంగలేక యీ చల్లని పండు వెన్నెల ప సందు వృథా ఒనరింతువేల నో మల్లియ పూలరాణి బ్రతి మాలెద వాలెద నీపదమ్ములన్. |
|
ఏ యనురాగ మోహలహ రీ మహిమాతిశయమ్మొకాని నీ వాయువు సోకినన్ బ్రణయ భావ కిసాల రసాలమూర్తినై పోయి జగమ్మునే మరచి పోవుదు నా చిగురాకు రెమ్మలో కూయ వదేలనే వలపు కోయిలవై భువనైకమోహినీ. |
|
ఏ విరికొనలోన విక సించిన మల్లికవొ లతాంగి! నీ తావికి మోవికిన్ మురిసి తావక పాదకిసాలయద్వయీ సేవయొనర్తు రాగమయ జీవనమో వనమో తదన్యమౌ భావములేల మాకు క్షణ భంగుర జీవిత పాంథశాలలన్. |
| రాగమయి |
|
కలికీ! నీవిలకేగుదెంచిన శర త్కాదంబినీ మాలికా విలసన్మంజుల చంద్రరేఖవొ నిశా విర్భూత శీత ప్రభా సలిలస్నాత చకోర సుందరివొ వ ర్షాకాశ కేశావళీ గళిత ప్రోజ్జ్వల దింద్ర చాపమవొ ఆకర్ణింతు వర్ణింపవే. |
|
హేమంతంబున రెక్కవిప్పిన గులా బీపువ్వులాగున్నదే భామా! నీ తనూరేఖ; మామక మనః పంకేజ పత్రమ్ములన్ ప్రేమార్ద్రమ్ముగ దాచుకొందునొ, లస ద్విద్యుల్లతామూర్తినై కామోద్వేగ వశమ్మునన్ జిదిమి యా ఘ్రాణింతునో చెప్పవే. |
|
హుంకారంబుగ నీవునిల్చిన త్రిలి ఙ్గోక్తి ప్రపంచంబునం దోంకారంబును బోలియుందువు సఖీ! యోషాజిగీషా ముహు ష్టంకారంబొనరించు వేళల నధి జ్యంబైన శుంభ న్నిరా టంక శ్రీ మకరాంక చాపము కని ష్ఠంబౌను నీ ఠీవికిన్. |
|
అలతి గులాబిమొగ్గమగు వా! హృదయమ్ము తదంతరాళమున్ వలపను కీటకమ్మొకటి వచ్చి యహర్నిశలుం గ్రసించె నా చెలువు కృశించె సంచలిత జీవనకాంతి నశించె నీ కృపా కలిత కటాక్షమాలికలొ గాక యరణ్యములో శరణ్యముల్. |
|
నీ మోహాలస నేత్రముల్ విరిసి నా నెమ్మోము గన్నంతనే కామాగ్నింబడి కాలిపోవుదును నీ కంఠంబు విన్నంతనే శ్రీ మన్మంజుల పల్లవాభ్యుదయమై జీవింతునో ప్రేయసీ నీమందార మరంద భాషలు హిమా నీబిందు సందోహముల్. |
|
ఇంతీ! ఓ మధుర స్రవంతి! శశి తా నెన్నాళ్ళు తారా పదా క్రాంతుండై విలసిల్లు నన్నిదినముల్ కాంక్షింప వేరెదియున్ సంతోషించిన చాలు నీ మృదుపద చ్ఛాయా సమీపంబులన్ కాంతా మంగళకామినై ప్రణయ శా ఖా కోకిలస్వామినై. |
| వియోగి |
|
ఏ విషలగ్నమందు జని యించితినో హృదయేశ్వరీ! నిరా శావహ కాలపాశ వల యంబుల జిక్కి విశీర్ణమైన నా జీవితమెల్లను నందనము జేయగజాలిన నీయపూర్వ సం భావిత మాధురీ ప్రణయ వల్లరి అల్లరిపాలు చేసితిన్. |
|
తెల్లని చీరగట్టి నలు దిక్కులు నిండిన చంద్రకాంతిలో వెల్లువలైన మోహ భర వేగమునన్ నవఫుల్ల మల్లికా వల్లికవోలె నా యెదుట వాలితివో "అనురాగయోగి"! నే డల్లిన గాధగా నవలగా కల గా కనుపించు నంతయున్. |
| అశ్రువు |
|
గొజ్జగిపూల సెజ్జపయి కోమలదేహము వాల్చి ఊహలో మజ్జనమాడు సుందరికి మా కుసుమాంజలిజెప్పి వేగమే కజ్జల భాష్పబిందువుల కాన్కలుతెమ్ము గులాబితోటకుం బజ్జనెసంగు చెంగలువ బావికడన్ నివసింతు నెచ్చెలీ. |
|
భావలతా నికుంజమున పాటలు పాడిన కోకిలమ్మ యే పూవులతోటకో ఎగిరి పోయెను తీయని స్వప్నమైన నా జీవన గేహళీ తిమిర సీమలు కొమ్మలకాంతి రేఖకై బావురుమంచు శోక రస బంధురమై తపియించె నెచ్చలీ. |
|
శారద రాత్రులంగలసి జంటగ నొంటిగ సంచరించు గ న్నేరుల కోవలం జిలుగు నీడల జాడలు మాసిపోయె, పొం గారెడు నాదు వెన్నెల జ గమ్ము నగమ్మయి క్రుంగిపోయె, నే తీరున జూచినం బ్రతుకు తెన్నులు బాష్పకణ ప్రపూర్ణముల్ |
|
ఇలపై రాలిన పూలకై వగచి రే యిన్ గారుమేఘాల దా రులలో గ్రుంకినవంక జాబిలికి యా క్రోశించి యాశించినన్ ఫలమేమున్నది, మావిగున్నలకడన్ వాసించి యాశాలతా వళులం దూగిసలాడు నా ప్రియసఖిన్ వారింపుమో మిత్రమా. |
|
పోయినదాని గూర్చి తల పోయుచు చెక్కిట చేయిజేర్చి వా పోయెడు బాలకు\న్ మరచి పొమ్మని చెప్పుము గమ్యమెంతకుం డాయగలేక జీవిత యె డారుల గ్రుమ్మరు పాంథ జీవికై హాయని బాష్పబిందు వొక టైనను రాల్చకుమంచు తెల్పుమా. |
| నిరీక్ష |
|
వలమాన జ్వలమాన జీవన వనీ వాసంత వేశంతమౌ యెలబ్రాయమ్ముననున్న నన్ గని కళా హేలా మనోవీధులన్ గల కంఠమ్ములు కూయగా తనువులం గై పెక్కగా భామినీ కలభంబుల్ శలభంబులాయె విలసత్ కామానల జ్వాలకున్. |
|
అధర మధూళిధారలకు ఆసలు మోసులువారి నన్నురో కుధర యుగాగ్రభాగముల గ్రుమ్మినవారలెగాని, నా మనో మధుర లతాలవాలముల మంజుల భావ తుషారపూర వా క్సుధలను గ్రుమ్మరించు సుమ కోమల ప్రేమ లభింపదక్కటా. |
|
కోవెలవంటి నా హృదయ కుంజములో చెలువారు మవ్వపుం జీవన మాధురీ రుచులు చిందరవందర చేయువారె నా త్రోవల దారసిల్లి రొక తూలిక పోలిక భావరేఖకుం దావలమైన ప్రేమమయి తార లభింపకపోయె నక్కటా. |
|
సురుచిర ప్రేమకై యెదురు చూచి విశాల ప్రపంచవీధులం దరిగిన జోళ్ళతో దిరిగి అర్రులుజాచి వృథా నిరీక్షయై చిరిగిన నావవోలె దరి జేరక యూరక సాగరమ్మునం దొరిగెదనో విలాస మధు రోహల మేడగ కూలిపోదునో. |
|
ప్రేమ సుధారసమ్మునకు భిక్షువునై ఫలితమ్ములేక నన్ గామ పిపాస పైకొనగ గైకొనినాడ మదాంధ సింధురో ద్దామల భామలన్, హృదయ ధామ కళల్ శిధిలమ్ములాయె, నా కోమల భావ సంపదలు కోల్పడియెన్, బశువైతి నక్కటా. |
|
ఓ పరమేశ్వరా! ఒక మ హోజ్జ్వల ప్రేమ రసైకరాశినిం జూపవు ఈ భయంకర ప శుత్వము నాపవు గాంగనిర్ఝరీ దీపిత శీత శృంగముల దేలెడు వాయు తరంగడోలలం దూపవు నా నిరీక్ష కెపు డోయి సమాప్తము లోకరక్షకా! |