| కావ్యములు | మను చరిత్రము | ద్వితీయాశ్వాసము |
| మణిమయభవనమున నప్సరస వరూధిని | ||
| శా. |
తావుల్ క్రేవలఁ జల్లు చెంగలువ కేదారంబు తీరంబున న్మావుల్ క్రోవులు నల్లిబిల్లిగొను కాంతారంబునం, దైందవ గ్రావాకల్పిత కాయమాన జటిల ద్రాక్షా గుళుచ్ఛంబుల\న్, బూవుందీవెల నొప్పు నొక్క భవనంబు\న్, గారుడోత్కీర్ణము\న్. |
22 |
| క. |
కాంచి, తదీయ విచిత్రో దంచిత సౌభాగ్యగరిమ కచ్చెరువడి, య క్కంచన గర్భాన్వయమణి యించుక దఱియంగ నచటి కేఁగెడు వేళ\న్. |
23 |
| క. |
మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ స్థగితేతర పరిమళమై మగువ పొలుపుఁ దెలుపు నొక్క మారుత మొలసె\న్. |
24 |
| మ. |
అతఁ డా వాత పరంపరా పరిమళ వ్యాపారలీల\న్ జనా న్విత మిచ్చోటని చేరఁ బోయి, కనియెన్ విద్యుల్లతావిగ్రహ\న్, శతపత్రేక్షణఁ, జంచరీకచికుర\న్, జంద్రాస్యఁ జక్రస్తని\న్ నతనాభి\న్, నవలా నొకానొక మరున్నారీ శిరోరత్నము\న్. |
25 |
| తే. |
అమల మణిమయ నిజ మందిరాంగణస్థ తరుణ సహకార మూల వితర్దిమీఁద శీతలానిల మొలయ నాసీన యైన యన్నిలింపాబ్జముఖియు నయ్యవసరమున. |
26 |
| సీ. |
తత నితంబాభోగ ధవళాంశుకములోని, యంగదట్టపుఁ గావి రంగువలన శశికాంతమణిపీఠి జాజువాఱఁగఁ గాయ, లుత్తుంగకుచపాళి నత్తమిల్లఁ దరుణాంగుళీ ధూతతంత్రీస్వనంబుతో, జిలిబిలిపాట ముద్దులు నటింప నాలాపగతిఁ జొక్కి, యరమోడ్పుఁ గనుదోయి, రతిపారవశ్య విభ్రమము దెలుపఁ |
|
| తే. |
బ్రౌఢిఁ బలికించు గీత ప్రబంధములకుఁ గమ్రకరపంకరుహ రత్న కటక ఝణఝ ణ ధ్వనిస్ఫూర్తి తాళమానములు గొలుప నింపు దళుకొత్త వీణ వాయింపుచుండి. |
27 |