| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| శ్రీకృష్ణుఁడు పారిజాత తరువుతో నిజనగరి కేతెంచుట | ||
| చ. |
కనకగిరీంద్రముం గడచి గ్రక్కున రైవతకాద్రి పొంత ని ల్చిన యదు వృష్ణి భోజ నృపసింహులు సేనలతోడఁ దన్నెదు ర్కొన నగరంబుఁ జొచ్చె మణిగోపుర సంస్థిత పౌరభామినీ జనములు సేసముత్తెములు సల్లఁగ నుల్లసితాంతరంగుఁడై. |
43 |
| తే. |
పురబహిర్ద్వారములు దాఁటి భుజగశాయి రాజమార్గంబు దఱియ హేరాళ మగుచు బుగులుకొనియె ననాఘ్రాత పూర్వకములు పారిజాత మహీజాత పరిమళములు. |
44 |
| ఉ. |
ఆ మహిజాతముం గనిన యంతటిలో ధన ధాన్యరాశితో సామజ ఘోటికా మహిత శాలలతో మణిసౌధ పంక్తితో గో మహిషీ శతాంగ భట కోటులతో మఱిభూషణాలితోఁ దామరతంపరై తనరెఁ దత్పురిఁ గింపచ గేహ వాటికల్. |
45 |
| మ. |
బెరసె\న్ మేన నిగిడ్చినట్లు వళు, లుబ్బె న్దుర్బలాంగంబు, లం కురము ల్సూపె రదంబు, లంఘ్రుల వడంకు ల్దీఱె, వాలారులై కరజంబు ల్సిగిరించెఁ, గేశ వితతు ల్గప్పారె, వృద్ధాళికి\న్ మరలం బ్రాయము వచ్చెఁ దత్తరు చల న్మందాని లాసంగతి\న్. |
46 |
| క. |
విన నేర్చిరి బధిరులు, గనుఁ గొన నేర్చిరి యంధకులు, లఘుత్వము మీఱ\న్ జన నేర్చిరి వికలాంగకు లనిమిష తరు కుసుమసౌర భావేశమున\న్. |
47 |
| క. |
విస్మయముగ నీగతి ముర ఘస్మరుఁడు నికేతన ప్రఘాణమున భుజం గ స్మయ హర వాహము డిగి సస్మితముఖుఁ డగుచు నరిగె సమ్మోదమున\న్. |
48 |
| సీ. |
వరభక్తి దేవకీవసుదేవులకు మ్రొక్కి - బలభద్రునకు నట్ల ప్రణతి సేసి, గురు పురోహిత బంధుకోటికి వినయంబు - గావించి, మిత్రులఁ గౌఁగిలించి, సుత సోదరామాత్య తతి నతుల్గయికొని - యాప్త వర్గంబుల నాదరించి, గారవంబునఁ బెక్కుగతుల మన్నించుచు - వినతా తనూభవు వీడుకొలిపి, |
|
| తే. |
ప్రేయసియుఁ దానుఁ గూడి తదీయమంది రమున కేఁగి సుఖాలాప రచన మెఱయఁ బ్రతిన వచ్చెఁ గదా యిదె పారిజాత మనుచు నర్పింప నద్దేవి హర్షమంది. |
49 |