| కావ్యములు | విజయ విలాసము | ప్రథమాశ్వాసము |
| గంగా తీరమున నాగకుమారి యులూచి యర్జునుని గాంచి మరులు గొనుట | ||
| క. |
భోగవతి నుండి యెప్పుడు భాగీరథి కడకు వచ్చి భాసిలు మున్నే నాగకుమారిక యయ్యెల నాగ యులూచి తమి నొక్కనాఁ డటఁ జెంతన్ |
58 |
| ఆ. |
హిమ రసైక సైకతమునందు విహరించు కైరవేషు వేషు ఘన నిభాంగు నెనరు దవుల దవులనే చూచి క్రీడిగా నెఱిఁగి యౌర! యౌర గేందువదన |
59 |
| క. |
మును ద్రౌపదీ స్వయంవర మున కేఁగిన కామరూప భోగులవలనన్ వినియున్న కతనఁ దమకము మనమునఁ బెనఁగొనఁగఁ జేరి మాయాన్వితయై |
60 |
| ఉ. |
గుట్టసియాడ గబ్బి చను గుట్టలపైఁ బులకాంకురావళుల్ తెట్టువ గట్టఁ, గోరికలు తేటలు వెట్టఁగ, వేడుకల్ మదిన్ దొట్టికొనంగ, నచ్చెరువు తొంగలి ఱెప్పల వీఁగ నొత్తఁగాఁ బెట్టిన దండ తీయక విభీత మృగేక్షణ చూచె నాతనిన్ |
61 |
| క. |
ఏణాక్షి నపుడు వెడ సిం గాణిన్ గొని యలరుఁ దూపుగమిఁ జక్కెరయే ఖాణముగాఁ గలిగిన కం ఖాణపు దొర పింజపింజ గాడఁగ నేసెన్ |
62 |
| ఉ. |
పై పయిఁ గౌతుకంబు దయివాఱి యిటుండఁగ నంత మజ్జనం బై పువుఁ జప్పరమ్మున నొయారముగాఁ గయిసేసి, దానలీ లా పరతంత్రుఁడై కలకలన్ నగుచుండెడి సవ్యసాచి, నిం ద్రోపలరోచిఁ జూచి, తలయూఁచి యులూచి రసోచితంబుగన్. |
63 |