| కావ్యములు | విజయ విలాసము | ప్రథమాశ్వాసము |
| అర్జునుఁడు తన నెచ్చెలి విశారదునితో నులూచీ ప్రణయ ప్రసంగమును వర్ణించుట | ||
| చ. |
అని పలుకన్ బ్రసన్నముఖుఁడై విభుఁ డిష్టసఖున్ విశారదున్ గని "యొక వింత వింటె! ఫణికన్య యులూచి యనంగ నోర్తు నన్ గొని తమ నాగలోకమునకున్ జని తన్ను రమించు మంచుఁ జె ప్పని ప్రియ మెల్లఁజెప్పి యొడఁబా టొనరించి కరంచె డెందమున్ |
116 |
| ఉ. |
"చెప్పెడిదేమి! కన్నుఁగవ చేరల కెక్కుడు చంద్రబింబమే తప్పదు మోము, మోవి సవతా చివు రెక్కడిమాట? గొప్పకున్ గొప్ప పిఱుందు, గబ్బి చనుగుబ్బలు కౌఁగిటి కెచ్చు జాళువా యొప్పులకుప్ప మేను, నడు మున్నదొ లేదొ యెఱుంగ నింతకున్ |
117 |
| ఉ. |
"చంగున దాఁటు చూపు లిరు చక్కని బేడిస లేమొ? మీటినన్ గ్రంగన వాఁగు గుబ్బలు చొకారపుఁ దాళము లేమొ, రూపమా నం గననైన చెక్కిళులు నాణెపుటద్దము లేమొ, చొక్క మౌ రంగున మీఱు దాని యధరంబును గెంపగునేమొ, నెచ్చెలీ! |
118 |
| ఉ. |
ఆ యెలనాగ వేణి మెఱుఁగారు కటారికి మాసటీఁ డగున్ బోయన వచ్చు; నమ్మెఱుఁగుఁబోఁడి పిఱుందు సమస్త భూమికిన్ రాయ లనంగవచ్చు; నల రాజనిభాస్య యెలుంగు గట్టివా కోయిల కంచుకుత్తికలకున్ బయకాఁ డనవచ్చు నెచ్చెలీ! |
119 |
| క. |
మదిరాక్షి మోవి జిగి ప్రతి వదనము గావించు గీర వదనముతోడన్ మదనుని విలు గొనవచ్చున్ సుదతీమణి కన్నుబొమల సుద తీరెంచన్ |
120 |
| చ. |
అల జడ యందమున్, మెఱుఁగు టారు మిటారము నాకు ముందుగాఁ జిలువ కొలం బటంచుఁ జెలి చెప్పక తొల్తనె చెప్పెఁ, దత్తనూ విలసన మెన్నఁ గన్నదియు విన్నది గా, దిలలో లతాంగు లా పొలఁతుక కాలిగోరులకుఁ బోలరు, పోలునొ యేమొ తారకల్! |
121 |
| సీ. |
మరుని గెల్పుల కథా మహిమమ్ము విలసిల్లు నొఱపుఁ జిత్తరుఠీవి నుల్లసిల్లు వీనుల కమృతంపు సోనలై వర్తిల్లు శారికా ముఖ సూక్తి సందడిల్లుఁ గస్తూరికాది సద్వస్తుల బ్రభవిల్లుఁ పరిమళమ్ముల జోకఁ బరిఢవిల్లుఁ జెప్పఁ జూపఁగ రాని సింగారము ఘటిల్లు పెక్కుశయ్యల సొంపు పిక్కటిల్లు |
|
| తే. |
వింత హరువుల పసులచే విస్తరిల్లు దివ్య మాణిక్య కాంతులఁ దేజరిల్లు నందముల కెల్ల నందమై యతిశయిల్లుఁ బాఁప జవరాలి బంగారు పడకటిల్లు |
122 |
| క. |
ఆ భోగము, తద్వస్తు చ యాభోగము నెందుఁగన్నయవి గావు సుమీ! నాభోగపురము సరి యౌ నా భోగవతీ పురంబు సార్థంబయ్యెన్ |
123 |
| ఉ. |
ఆ మదిరాక్షి భోగవతి యన్ నదిఁ గ్రుంకఁగఁజేసి, తత్పుర స్థేముని హాటకేశ్వరు భజింప నొనర్చిటు తోడి తెచ్చి న న్నీ మహి నిల్పి యేఁగె నిదె యిప్పుడె; నన్నెడఁబాయలేని యా ప్రేమది యింత యంత యని పేర్కొనరా" దని తెల్పెఁ; దెల్పినన్ |
124 |
| ఉ. |
మౌఖరి మించ నిట్టులను మంత్రిశిఖామణి "చోద్య మయ్యె నా వైఖరి విన్న నే మనఁగవచ్చు? నహో! మనుజేంద్ర చంద్రమ శ్శేఖర! చిల్వరా కొలము చేడియ నొక్కతెఁ జెప్పనేల? నీ రేఖఁ గనుంగొనన్ వలవరే ఖచరీ ముఖ సుందరీమణుల్?" |
125 |
| క. |
అని పలుక నలరి బలరిపు తనయుండటఁ గదలి మొదలి తైర్థికులను దా నును మంచుఁగొండ యండకుఁ జని తచ్ఛిఖరావలోక జనితాదరుఁడై |
126 |