| కావ్యములు | విజయ విలాసము | ద్వితీయాశ్వాసము |
| క. |
శ్రీధుర్య శౌర్య! ధైర్య క్ష్మాధర మూర్ధన్య! యాది గర్భేశ్వర! వి ద్యాధిక! వితరణ దీక్షా రాధాసుత! యచ్యుతేంద్ర రఘునాథ నృపా! |
1 |
| తే. |
అవధరింపు కథాకర్ణనాతివేల హర్షు లై నట్టి దివ్య మహర్షులకును తత సమస్త పురాణ కథా శతాంగ సూతుఁడై విలసిల్లెడు సూతుఁ డనియె |
2 |
| విశారదుఁడు మలయధ్వజుని యాశయము నర్జునునకు విన్నవించుట | ||
| ఉ. |
ఆ చెలువంపు రాకొమరుఁ డంత వయస్యుని జూచి యింపుతో "నీ చతురత్వ, మీ వినయ, మీ యుచితజ్ఞత యెందునేనియుం జూచితె? మైత్రికిం దగిన చోటగు; శోభనపుం బ్రసంగమున్ సూచన చేసి రాజు మది చొ ప్పెఱుఁగన్ వలదా విశారదా?" |
3 |
| మ. |
అనినన్ "మీ మదిలోఁ దలంచినది మేలౌ; సిద్ధసంకల్పు లీ" రని యావేళనె చిత్రవాహనుఁడు కొల్వై యుండఁగాఁ బోయి యా యన "రా రమ్మ"ని గారవించి సుముఖుండై "రాజుగా రిప్పు డే మనినా? రెయ్యది వార్త?" యంచుఁ బయిపై నాసక్తితోఁ బల్కఁగన్ |
4 |
| చ. |
"అవనితలేంద్ర! మా విభుని హర్ష మదేమని విన్నవింతు? సం స్తవ మొనరించి రింతవడి సామిచరిత్రమె వేయినోళ్ళ; న ర్ణవపతితోడ బాంధవ మొనర్చిన మాధవు లీలఁ దారు బాం ధవ మొనరింపఁ జిత్త మిడినారు గుణాంబుధు లీరు గావునన్" |
5 |
| క. |
నా విని సంతోషము మది నావిర్భవ మొంద "నా మహారాజునకున్ దేవేరిగ నా కన్నెన్ బావన గుణ నీయఁ గనుట భాగ్యము గాదే? |
6 |
| చ. |
కల దొకమాటఁ దెల్పఁగల కార్యము; తొల్లి ప్రభాకరుండు నాఁ గలఁ డొకఁ డస్మదీయ కులకర్త; యతం డనపత్యుఁడై యచం చలమతి శంకరుం గుఱిచి చాలఁ దపం బొనరింప నంతటన్ 'గలుగుఁ గుమారుఁ డొక్కొకఁడుగా' నని యిచ్చె వరంబు వేడుకన్ |
7 |
| క. |
అంగజ హరుని ప్రసాదము నం గలుగుచు వచ్చె సుతుఁడు నాఁ డాదిగ మా వంగడమున; నది యిప్పుడు వెంగడమై కూఁతు రుద్భవించె న్నాకున్ |
8 |
| క. |
ఆ దుహితఁ గుమారుని మ ర్యాదగఁ జూచికొని యుందు; నా కన్నియకున్ బ్రాదుర్భవించు వానిన్ నాదు కులంబునకు వలయు నాథుని జేయన్ |
9 |
| క. |
కా దనరా దీకార్యము; జాదులును బ్రసాదమౌ విశారద! నాకున్ నాదు హితం బొనఁగూరిచి నా దుహితం బెండ్లి సేయు నరనాథునకున్" |
10 |
| తే. |
అని యతనిఁ బంచె; నా మాట కర్జునుండు సమ్మతించె; ముహూర్త నిశ్చయము నయ్యె; హితుఁ డన విశారదుఁడె కాక యెందుఁ గలరె? కోర్కి వెలయంగ దొరఁ బెండ్లికొడుకుఁ జేసె |
11 |