| కావ్యములు | విజయ విలాసము | తృతీయాశ్వాసము |
| కుమారాభ్యుదయము | ||
| మ. |
కలుముల్ కన్నులఁ జిల్కుకల్కి మరునిం గన్నట్టిచందాన నా కలశాంభోనిధివీచికల్పతరువుం గన్నట్టి యందంబున\న్ గలకంఠీకులరత్న మంత శుభలగ్నం బందు నిం పొందఁగాఁ గులదీపం బగునట్టిపట్టిఁ గనె దిక్కుల్ తెల్విఁ బెంపెక్కఁగన్. |
229 |
| క. |
ఋభువిభుసుతునకుఁ దనయుఁడు ప్రభవించినసమయమున గుబాలునఁ గురిసె\న్ నభమున సుమనోవర్షము గుభగుభనినదములు గ్రందుకొనె దుందుభులన్. |
230 |
| తే. |
అపుడు పార్థుఁడు శుభలేఖ ననుప ననుప మానవిభవుండు శౌరి సమానమాన వాధినాథులు కొలువంగ నరుగుదెంచె నెలమితోడుత పాండవు లెదురుకొనఁగ. |
231 |
| క. |
హలి సాత్యకితోడఁ గుతూ హలియై తనసరస రాఁగ నంగనయును దా నల బలరిపుసుతునగరికి నలబలము చెలంగ నరిగె హరి కడు వేడ్కన్. |
232 |
| క. |
మన్యువివర్జితుఁ డల శత మన్యుతనూభవుఁడు లోకమాన్యవిపశ్చి న్మాన్యులయనుమతి సుతు నభి మన్యుం డని పేరు వెట్టె మది ముదమొదవన్. |
233 |
| క. |
చెల్లెలికిని మఱఁదికి మే నల్లునకు ననర్ఘ్యమణిమయాభరణంబుల్ వల్లభయుఁ దాను యదుకుల వల్లభుఁ డపు డొసఁగె బంధువర్గము మెచ్చన్. |
234 |
| తే. |
కువలయాక్షులు పెనుచు మక్కువలవలన నేఁటఁబెరిఁగెడువాఁడొక్కపూఁటఁ బెరిఁగి మెల్లమెల్లన శైశవ మెల్ల జార నందె యౌవన మారాజనందనుండు. |
235 |
| సీ. |
మనుమార్గమున భూమి మను మార్గ మంతయు స్థిరబుద్ధి యగు యుధిష్ఠిరుఁడు తెలుపఁ బాటవవద్వైరిపాటనక్రమ మెల్ల దరవర్జితుఁడు వృకోదరుఁడు తెలుప రంగదుత్తుంగతురంగాధిరోహ ముద్దండబాహుఁడు నకులుండు తెలుప సురభిరక్షణకీర్తి సురభిళదిఙ్మండ లుండగు తదనుజన్ముండు తెలుప |
|
| తే. |
వివిధకోదండ పాండిత్య విలసనంబు తానె తెలుపంగ నేర్చిన తనయుఁ డెపుడు సేవ సేయఁగ సంతతశ్రీ వెలుంగ విజయుఁ డలరారె శాశ్వతవిజయుఁ డగుచు. |
236 |