Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 16-6
సంపుటము: 1-100
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
[1]ఏ దైవము శ్రీపాదన్న(న?)ఖమునఁ బుట్టిన గంగ త్రిలోకపావనము చేయను త్రిపథగామిని ఆయను
యే దైవము నాభినలినంబున జనియించిన అజుండు అఖిలాండంబులు సృజియింప నధిపతి ఆయను
॥ఏ దైవము॥
యే దైవము వురస్థలంబు దనకును మందిరమైన యిందిర మాతయయ్యె యీజగంబుల కెల్లను
యే దైవము అవలోకన మింద్రాది దివిజగణంబుల కెల్లప్పుడును సుఖంబు లాపాదించును
॥ఏ దైవము॥
యే దైవము దేహవస్తు [2](వస్తు)వని అనిమిషులందరుఁ గూడి శ్రీనారాయణదేవుండని నమ్మి యుండుదురు
ఆ దేవుఁడే సిరుల కనంతవరదుఁడు తిరువేంకటగిరినాథుఁ డుభయవిభూతినాథుఁడే నా నాథుఁడు
॥ఏ దైవము॥

[1] ఈ పాటకు పల్లవి చరణ విభాగములు రేకులో చూపలేదు. ‘గంగ’ తరువాతి నిలువుగీత ప్రామాదికమా? ప్రాసపద్ధతిలో రెండేసి పంక్తులొక పాదముగ స్వీకరిస్తే, మొదటి నాలుగు పంక్తులు పల్లవిగ, తరువాతి యెనిమిది పంక్తులు ఒక చరణముగ కాగా, ఒంటి చరణముతో ముగిసినది కావచ్చు. ఈ వాఙ్మయమున ఈ పద్ధతి అపురూపమే.

[2] ఈ చిప్పగుర్తులోని ‘వస్తు’ కూడా రేకులో నున్నది.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము