Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 199-1
సంపుటము: 2-508
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
ఇదె వీఁడె కంటిమమ్మ యేతులవాఁడు
కదలే సూర్యచంద్రుల కన్నులవాఁడు
॥పల్లవి॥
సెలవి నవ్వులవాఁడు చేకత్తిగోళ్లవాఁడు
పలుపేగుల జంధ్యాల పంతాలవాఁడు
యెలమిఁ జెలిఁదొడపై నిడుకొన్నట్టివాఁడు
చెలఁగిన ఘననారసింహుఁడటే వీఁడు
॥ఇదె॥
కొండగద్దెమీఁదివాఁడు గొప్పకిరీటమువాఁడు
దిండుపైఁడిచీరకాశ(సె?) తెక్కులవాఁడు
రెండురూపులొకటైన రీతుల మాయలవాఁడు
అండఁ బ్రహ్లాదవరదుఁ డాతఁడటే వీఁడు
॥ఇదె॥
భవనాసి పొంతవాఁడు భావించఁ దెల్లనివాఁడు
ఇవల శ్రీవేంకటాద్రి నిరవైనాఁడు
జవళిపంతాలవాఁడు శంఖుచక్రములవాఁడు
తివిరిన‌ అహోబలదేవుఁడటే వీఁడు
॥ఇదె॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము