అధ్యాత్మ సంకీర్తన
రేకు: 208-1
సంపుటము: 3-43
రేకు: 208-1
సంపుటము: 3-43
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| పుట్టించేవాఁడవు నీవే పోరులు వెట్టేవు నీవే యెట్టు నేరుచుకొంటివిది నీ వినోదమా | ॥పల్లవి॥ |
| కొందరు దేవతలును కొందరు రాక్షసులును ఇందరి కంతర్యామి వెప్పుడు నీవు అంది కోప మొకరిపై అట్టే ప్రసాద మొకరి కిందులోనే పక్షపాతమిది నీకే తగును | ॥పుట్టిం॥ |
| నరకమనుచుఁ గొంత నగి స్వర్గమని కొంత నిరతి గురిసేసేవు నీకుక్షిలోనే ధరఁ జీఁకటొకవంక తగ వెన్నెలొకవంక నెరపేవు నీ మాయ నీకే తెలును | ॥పుట్టిం॥ |
| దాసపరిపాలనము తగు దుష్టశిక్షణము వాసిఁ గైకొంటివి నీకు వశమై రెండు దోసము నీవల్ల లేదు తొలుతే శ్రీవేంకటేశ సేసినవారి పుణ్యమే చిత్తానఁ బెట్టితివి | ॥పుట్టిం॥ |


