అధ్యాత్మ సంకీర్తన
రేకు: 208-3
సంపుటము: 3-45
రేకు: 208-3
సంపుటము: 3-45
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
| ఎట్టు వలసినాఁ జేయు మేఁటి విన్నపము లిఁక కట్టుకో పుణ్యమైనాఁ గాక మరేమైనాను | ॥పల్లవి॥ |
| నన్ను నెంచి కాచేనంటేనా యవగుణి నేను నిన్ను నెంచి కాచేనంటే నీవు లక్ష్మీపతివి యిన్నిటా నాకంటే హీనుఁడిఁక మరెవ్వఁడూ లేఁడు వున్నతి నీకంటే ఘనులొకరూ లేరు | ॥ఎట్టు॥ |
| నిలువెల్లా నెంచుకొంటే నివ్వరిముల్లంత లేను బలువుఁడ నీవైతే బ్రహ్మాండము యెలమి నే నుపకార మెవ్వరికిఁ జేయలేను మెలఁగి నీవే తృణము మేరువు సేయుదువు | ॥ఎట్టు॥ |
| భావించ నీ వేలికవు బంటుమాత్రమింతే నేను నీవు సర్వాంతరాత్మవు నే నొకఁడను సావధానమున నేను సర్వభక్షకుఁడ నింతే శ్రీవేంకటేశ నీవు జీవరక్షకుఁడవు | ॥ఎట్టు॥ |


