Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 211-2
సంపుటము: 3-62
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
తాము స్వతంత్రులు గారు తమయంతను
ఆ మీఁదటి గురి అది నీవు
॥పల్లవి॥
యెలమి స్వర్గమేలేటి‌ ఇంద్రునికినైనాను
అలమి కోరేటి ఫలమది నీవు
బలిమిఁ గైలాసమేలే పతి రుద్రునికినైనా
నిలుకడైన పదము నీ పదము
॥తాము॥
యెక్కుడు సత్యలోకము యేలే బ్రహ్మకునైనా
ఇక్కువఁ జేరేచోటు యెందును నీవు
వెక్కసపుఁ బుణ్యముల వేదములకైనాను
అక్కరతో ముఖ్యమైన అర్థమెల్లా నీవు
॥తాము॥
నాఁడు నాఁడే ముక్తులైన నారదశుకాదులకు
నేఁడును విహరించే నెలవు నీవు
పోఁడిమి శ్రీవేంకటేశ పోలించ నెవ్వరూ లేరు
మూడులోకముల నీవే మూలము నీవే
॥తాము॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము