అధ్యాత్మ సంకీర్తన
రేకు: 238-5
సంపుటము: 3-220
రేకు: 238-5
సంపుటము: 3-220
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| పరమాత్మ నిన్ను గొల్చి బ్రదికేము విరసపు జాలిఁ జిక్కి వెతఁబడ నోపము | ॥పల్లవి॥ |
| మగఁడు విడిచినా మామ విడువనియట్లు నగి నామనసు రోసినా లోకులు మానరు తగిలేరు పొగిలేరు దైన్యమే చూపేరు మొగమోటలను నేను మోసపోవనోపను | ॥పర॥ |
| పొసఁగ దేవుఁడిచ్చినా పూజరి వరమీఁడు విసిగి నే విడిచినా విడువరు లోకులు కొసరేరు ముసరేరు కోరిక దీర్చుమనేరు పసలేని పనులకు బడల నేనోపను | ॥పర॥ |
| నుడుగులు దప్పినా నోముఫల మిచ్చినట్టు కడఁగి వేఁడుకొన్నాఁ గానిమ్మనరు లోకులు తడవేరు తగిలేరు తామే శ్రీవేంకటేశ బుడిబుడి సంగాతాలఁ బొరల నేనోపను | ॥పర॥ |


