అధ్యాత్మ సంకీర్తన
రేకు: 239-1
సంపుటము: 3-222
రేకు: 239-1
సంపుటము: 3-222
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| నీవొక్కఁడవే సర్వాధారము నిన్నే యెరిఁగిన నన్నియు నెఱుఁగుట భావించి యింతయుఁ దెలియఁగవలసిన బ్రహ్మవేత్తలకు నిది దెరువు | ॥పల్లవి॥ |
| నీయందె బ్రహ్మయు రుద్రుఁడు నింద్రుఁడు నీయందె దిక్పాలకులు నీయందె మనువులు వసువులు రుషులు నీయందె విశ్వాఖ్యదేవతలు నీయందె వురగులు యక్షరాక్షసులు నీయందె గరుఁడగంధర్వులు నీయందె పితరలు సిద్ధసాధ్యులు నీయందె ద్వాదశాదిత్యులు | ॥నీవొ॥ |
| నీవలననె కిన్నరకింపురుషులు నీవలననె విద్యాధరులు నీవలననె యచ్చరలు చారణులు నీవలననె నక్షత్రములు నీవలననె గ్రహములు చంద్రుఁడును నీవలన(నె?) నభోంతరిక్షములు నీవలననె జలధులు పవమానుఁడు నీవలననె గిరులును భూమియును | ॥నీవొ॥ |
| నీలోననె నదులును నగ్నియు నీలోననె సచరాచరములును నీలోననె వేదశాస్త్రము మొదలుగ నిఖిలశబ్దమయము నీలోననె అన్నియు నిన్నర్చించిన నిఖిలతృప్తికరము శ్రీలలనాధిప శ్రీవేంకటేశ్వర శ్రీవైష్ణవులకు నిది మతము | ॥నీవొ॥ |


