అధ్యాత్మ సంకీర్తన
రేకు: 21-6
సంపుటము: 1-130
రేకు: 21-6
సంపుటము: 1-130
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కేదారగౌళ
| పరమాత్ముని నోరఁబాడుచును యిరు- దరులు గూడఁగఁ దోసి దంచీ మాయ | ॥పరమాత్ము॥ |
| కొలఁది బ్రహ్మాండపు కుందెనలోన కులికి జీవులను కొలుచు నించి కలికి దుర్మోహపు రోఁకలి వేసి తలఁచి తనువులను దంచీ మాయ | ॥పరమాత్ము॥ |
| తొంగలి రెప్పలు రాత్రులుఁ బగలును సంగడి కనుఁగవ సరిఁ దిప్పుచు చెంగలించి వెసఁ జేతులు విసరుచు దంగుడు బియ్యముగా దంచీ మాయ | ॥పరమాత్ము॥ |
| అనయముఁ దిరువేంకటాధీశ్వరుని పనుపడి తనలోఁ బాడుచును వొనరి [1]విన్నాణి జీవులనెడి బియ్యము తనర నాతనికియ్య దంచీ మాయ | ॥పరమాత్ము॥ |
[1] ‘బిన్నాణి’ రేకు.


