అధ్యాత్మ సంకీర్తన
రేకు: 250-3
సంపుటము: 3-286
రేకు: 250-3
సంపుటము: 3-286
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| మమ్ముఁ జూడ నేమున్నది మావంక నీకే లాభము కమ్ముక దయదలఁచి కరుణింతుఁ గాక | ॥పల్లవి॥ |
| శ్రీకాంతుఁడ నీపాదసేవకులయినవారు పాకశాసనాదులను బ్రహ్మాదులు పైకొని నరుఁడ నేను బంటఁగాఁగ నెంతవాఁడ కైకొని నీపుణ్యానకుఁ గాచుటింతే కాక | ॥మమ్ముఁ॥ |
| నారాయణుఁడ నిన్ను నమ్మినట్టి దాసులు నారదాది సనకసనందనాదులు వీరిలో నేనెంతవాఁడ వికటపుజీవుఁడను యీరీతి నీమూఁకఁ గూడ నేలుటింతే కాక | ॥మమ్ముఁ॥ |
| శ్రీవేంకటేశ నీపైచేరి భక్తిసేసేవారు కావించి యనంతముఖ్య గరుడాదులు దేవ నేనొక్క నీచుఁడ దీనరక్షకుఁడవు నీ- వీవిధమెంచుక మమ్ము నీడేరింతుఁ గాక | ॥మమ్ముఁ॥ |


