Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 251-4
సంపుటము: 3-293
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
బయ లీఁదించీ నదివో ప్రాణులను హరిమాయ
క్రియ దెలుసుకొనేటి కీలింతే కాని
॥పల్లవి॥
పెక్కుపరుషులలోన బెరశొకసతి యుంటే
యిక్కువై యందే నాఁటు నిందరిచూపు
దక్కి యందరి కాఁగిళ్ల తరుణి యుండుట లేదు
గక్కన వట్టియాసలఁ గరఁగుటే కాని
॥బయ॥
చింతకాయ కజ్జాయము చేరి యిసుమంతవుంటే
అంతటనే నోరూరు నందరికిని
పొంతనే నాలుకలకు పులుసై యుండుటే లేదు
కొంత భావించి మింగేటి గుటుకలే కాని
॥బయ॥
శ్రీవేంకటేశుతేరు దీసేటి మనుజులెల్లాను
సేవగా నేమే తీసితిమందురు
ఆవల నాతఁడే తమ‌ అంతరాత్మయైయుండి
కావించుట యెరఁగరు గర్వములే కాని
॥బయ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము