Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 255-3
సంపుటము: 3-316
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనె నట్టె
పవ్వళించే బ్రహ్మతండ్రి బాలుఁడయ్యె నట్టె
॥పల్లవి॥
ఘనయోగీంద్రుల మతిఁ గట్టువడనట్టివాఁడు
పనిలేక రోలఁ గట్టువడినాఁడట్టె
తనియ సురలకు పాదము చూపనట్టివాఁడు
మొనసి బండిమీఁద మోపినాఁ డట్టె
॥ఎవ్వ॥
అమృతము చేతఁ దచ్చి అందరికిచ్చినవాఁడు
తమితో వెన్న దొంగిలెఁ దానె యట్టె
గుమురై దేవదానవకోటికిఁ జిక్కనివాఁడు
భ్రమసి గోపికల పాలఁ జిక్కినాఁ డట్టె
॥ఎవ్వ॥
యిందుఁ గలఁ డిందులేఁడనెంచి చూపరానివాఁడు
అందమై రేపల్లెవాడ నాడీనట్టె
అంది కృష్ణావతారమయినట్టి దేవుఁడే
యిందున శ్రీవేంకటాద్రి యెక్కి నిలిచెనట్టె
॥ఎవ్వ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము