అధ్యాత్మ సంకీర్తన
రేకు: 255-5
సంపుటము: 3-318
రేకు: 255-5
సంపుటము: 3-318
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| కన్నదేఁటిదో విన్నదేఁటిదో కాఁగలదిఁక నేదో నన్నుం గానను నిన్నుం గానను నడుము బట్టబయలు | ॥పల్లవి॥ |
| నీమాయమహిమో నే నేరని కడమో భూమిలోన నీవున్నాఁడవు నా పుట్టుగులుఁ గలవు యేమి గాఁగలనో యింకా మీఁదట నిటకతొల్లి యేమైతినో సోమార్కుల వుదయాస్తమయంబులు చూచుచునున్నాఁడను నేను | ॥కన్న॥ |
| జ్ఞానము నీవో అజ్ఞానంబే బలువో నీనామంబులు అనంతకోట్లు నిలుకడగాఁ గాను కానఁగల యీ ప్రపంచమెల్లా కలయో యిది నిజమో కానరాని యీ ముక్కున నూర్పులు కాలముఁ గొలచేటి కుంచములు | ॥కన్న॥ |
| నీకు నీవే నను దయ దలఁచితివో నేనాచార్యుని నమ్మితినో కైకొని నాయంతర్యామివి నినుఁ గంటినిపుడే నేను శ్రీకాంతుఁడవో శ్రీవేంకటేశ్వర శ్రీవైకుంఠమే యీజగము యేకడ చూచిన నీదాసులు నాయెదుటనే వున్నారు | ॥కన్న॥ |


