Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 260-2
సంపుటము: 3-344
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రాయగౌళ
ఇంతగాలమాయను యేడనున్నారో వీరు
వింతలై యడవిఁ గా సే వెన్నెలాయ బ్రదుకు
॥పల్లవి॥
యేలేవారి దూరితి యెడరు వుట్టినవేళ
కాలమును దూరితిని కలఁగేవేళ
తాలిమిలేని వేళ తగుఁగర్మము దూరితి
యేలాగని కాచేవారి నెవ్వరిఁ గానము
॥ఇంత॥
దైవమును దూరితి తమకించినట్టివేళ
కావించి నన్నే దూరితిఁ గాఁగినవేళ
సోవగాఁ గోపపు వేళ చుట్టాల దూరితిమి
యీవలఁ దోడైనవారి నెవ్వరిఁ గానము
॥ఇంత॥
పుట్టుగు దూరితిమి పోరానియట్టివేళ
కట్టఁగడ నెందువంకఁ గానమైతిమి
జట్టి శ్రీవేంకటేశుఁడు శరణంటేనే కాచె
యిట్టె యింతటివారు యెవ్వరును లేరు
॥ఇంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము