Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 268-2
సంపుటము: 3-390
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
ఆడుతాఁ బాడుతా నీతో నట్టే ముద్దు గునుసుతా
వోడక నీదండ చేరి వున్నారమయ్యా
॥పల్లవి॥
ఆసఁ దల్లిదండ్రిమోము అట్టె చూచి శిశువులు
యే సుఖదుఃఖములుఁ దా మెరఁగనట్టు
వాసుల శ్రీపతి మిమ్ము వడి నాత్మఁ దలఁచుక
యీసుల పుణ్యపాపము లెఱఁగమయ్యా
॥ఆడు॥
యేలినవారు వెట్టగా నేపునఁ దొత్తులు బంట్లు
ఆలకించి పరుల బోయడుగనట్టు
తాలిమి శ్రీపతి మీరు తగ మమ్ము రక్షించఁగా
యేలని యేమియుఁ గోర నెరఁగమయ్యా
॥ఆడు॥
చేతఁ జిక్కి నిధానము చేరి యింటఁగలవాఁడు
యేతులఁ గలిమిలేము లెరఁగనట్టు
ఆతుమలో శ్రీవేంకటాధిప నీ వుండఁగాను
యీతల నే వెలుతులు నెరఁగమయ్యా
॥ఆడు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము