Display:
శృంగార సంకీర్తన
రేకు: 1908-4
సంపుటము: 29-46
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
వాకిలి దెరవయ్యా వద్ద నెవ్వరున్నా నేమి
యీకడ నిన్నేమీనన దిఁకనేల సిగ్గులు
॥పల్లవి॥
మచ్చికతో జవరాలు మాఁటాడేనంటా వచ్చి
కచ్చుపెట్టెప్పటనుండి కాచుకున్నది
విచ్చనవిడిని నీకు వీణె వినిపించేనంటా
అచ్చపు వేడుకతో నాయితమై యున్నది
॥వాకి॥
వింత వింత చవులతో విందుచెప్పేనంటా వచ్చి
పంతముతో నక్షతలు పట్టుకున్నది
కాంత నీ యరత నుండి కతలు చెప్పేనంటా
అంతరంగమునఁ గోరి యాసగించుకున్నది
॥వాకి॥
బత్తితొడ నీకు నిట్టె పాదాలొత్తేనంటా వచ్చి
కొత్తగా నలమేల్మంగా కోరుకున్నది
ఇత్తల శ్రీవేంకటేశ యిందువచ్చీకెఁ గూడితి
సత్తుగా నీచేఁతలెల్లా సమ్మతించి యున్నది
॥వాకి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము