Display:
శృంగార సంకీర్తన
రేకు: 1908-5
సంపుటము: 29-47
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
కక్కసించఁబోతేను కలుచపడు వలపు
వొక్కటై నీవుండితేనే వోజకు వచ్చీఁ దానే*
॥పల్లవి॥
సొంటులు సోదించనేల సోలసి పలుకనేల
ఇంటికి వచ్చేఁగా యాతఁ డెందున్నా నేమే
కంటకము లాడకునే గక్కన విడెమియ్యవే
జంటవాయకుండితేనే చాయకువచ్చీఁదానే
॥కక్క॥
గుట్టు లరయఁగనేల కూరిమి గొసరనేల
పట్టెఁగా నీ కొం గతఁడు బత్తితోడను
వట్టి యెగ్గు లెంచకువే వచ్చి పాదములొత్తనే
చుట్టరికమే చూపనే సూటికి వచ్చీఁదానే
॥కక్క॥
చొప్పులు వెదకనేల చూపుల జంకించనేల
ఇప్పు డిట్టె కూడీఁగాని ఇతవెరిఁగి
అప్పఁడు శ్రీవేంకటేశుఁ డలమేల్మంగవు నీవు
తెప్పలుగా మో వియ్యవే తీరుపువచ్చీఁదానె
॥కక్క॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము