శృంగార సంకీర్తన
రేకు: 1908-6
సంపుటము: 29-48
రేకు: 1908-6
సంపుటము: 29-48
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| ఎంత సిగ్గరికత్తెవు యేమే నీవు వింత వింత వాసులేల వెదచల్లేవే | ॥పల్లవి॥ |
| వలచిన రమణుఁడు వావి నీకుఁ జెప్పితేను కలికి కన్నులనేల గద్దించేవే కలువపూవుల వేసి కతలు ని న్నడిగితే సెలవుల నవ్వులేల చిందేవే | ॥ఎంత॥ |
| చవులుగా మోవి చూపి సన్నలు నీకుఁ జేసితే జవళి బొమ్మలనేల జంకించేనే తివురుచు నీ చన్నులది క్కతఁడు చూచితేను రవళి సణఁగులేల రాలిచేవే | ॥ఎంత॥ |
| చుట్టరికమున నిన్ను సోఁకఁ గాఁగిలించుకొంటే వొట్టుగా చేతులనేల వొడ్డుకొనేవే యిట్టె శ్రీవేంకటేశుఁ డేలె నలమేల్మంగవు గుట్టున నేరుపులేల కుమ్మరించేవే | ॥ఎంత॥ |


